BJP BRS Alliance: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు లేరు.. ఎప్పుడు ఏదైన జరగవచ్చు. బీజేపీ, బీఆర్ ఎస్ పొత్తుకు ఛాన్స్.. ఆ రెండు పార్టీల పొత్తు ను కేటీఆర్ ట్వీట్ బలాన్ని చేకూరుస్తుంది’ అంటూ ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ రాజకీయంగా బద్ధశత్రువులుగా కనిపించిన కారు, కమలం మధ్య మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతోందా? రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు చేతులు కలపనున్నాయా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకుదారితీశాయి. డీలిమిటేషన్ అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటన ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ప్రకటించడమే కారణం. అయితే ఇది కేవలం తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమా? లేక రాజకీయంగా మరో వ్యూహానికి సంకేతమా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని కేటీఆర్ ప్రకటించారు.ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కీలక బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించడం సహజంగానే రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఒక విధానపరమైన అంశంపై మద్దతు ప్రకటించడాన్ని రెండు పార్టీల మధ్య పొత్తుకు సంకేతమా? అనే చర్చమొదలైంది.
అయితే గత సెప్టెంబరులోనే బీజేపీతో పొత్తు ఉండబోదని,2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని కేటీఆర్ తేల్చిచెప్పారు. అదే సమయంలో దామాషా ప్రకారం లోక్‌సభ స్థానాలు పెరిగితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో అభ్యంతరం లేదని చెప్పారు. ఇప్పుడు అదే వైఖరిని మరింత స్పష్టంగా అమలు చేస్తూ బిల్లుకు మద్దతు ప్రకటించడం గమనార్హం. అంటే డీలిమిటేషన్‌పై కేంద్రంతో ఏకీభవించడం వేరు.. ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవడం వేరనే సంకేతాన్ని బీఆర్‌ఎస్ ఇవ్వాలనుకుంటోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Also read: గాజులు గలగలతో వచ్చిన క్రేజ్.. అయ్యప్ప పాటతో మొత్తం రివర్స్!
బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు లేదా విలీనం అంశం ఇప్పుడే తెరపైకి వచ్చినది కాదు. గతంలోనూ ఈ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందంటూ రాజకీయ ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బీఆర్‌ఎస్‌లో తీవ్ర కలకలం రేపాయి. తాను ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు కొందరు ప్రయత్నించారని, ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని ఆమె ఆరోపించారు. తన వైఖరి కారణంగానే ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని కూడా వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలను పార్టీ వర్గాలు అంగీకరించకపోయినా, బీఆర్‌ఎస్-బీజేపీ సంబంధాలపై అనుమానాలకు మాత్రం అవి మరింత బలం చేకూర్చాయి.ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనూ కవిత మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పరస్పరం సహకరించుకున్నాయని, భవిష్యత్తులో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు అవి తొలి అడుగులుగా మారవచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి చర్చకు దారితీశాయి. అయితే తాజాగా కేటీఆర్ డీలిమిటేషన్ కు మద్దతు అని ప్రకటించడంతో కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి.
త్వరలో రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనూ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతుంది. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, ఓట్ల బదిలీ, పరస్పర పోటీ వల్ల కలిగే నష్టాన్ని నివారించుకునే వ్యూహాలపై చర్చ జరుగుతోందన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక స్థానం బీజేపీకి, మరోసారం బీఆర్ఎస్ కు అని.. అవగాహన ఒప్పందం జరిగిందని, అందుకే అభ్యర్థులను ప్రకటించడం లేదని, డమ్మి అభ్యర్థిని హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో ప్రకటించబోతుందని మరోవైపు ప్రచారం జరుగుతుంది. అయితే జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తుందా? లేకుంటే బలమైన అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగి బరిగీసి కొట్లాడుతుందా? అనేది త్వరలోనే తేటతెల్లం కానుంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్, బీజేపీ రెండింటికీ తమదైన రాజకీయ అవసరాలున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం బీఆర్‌ఎస్‌కు ప్రధాన సవాలు. మరోవైపు తెలంగాణలో మరింత బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని అంశాల్లో రెండు పార్టీల వైఖరులు ఒకేలా కనిపించినా, అది ఎన్నికల పొత్తుకు దారితీస్తుందా అన్నది చూడాలి.
డీలిమిటేషన్‌పై కేటీఆర్ ప్రకటన తర్వాత పార్టీ శ్రేణుల్లోనూ భిన్నమైన చర్చ జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వల్ల బీఆర్‌ఎస్‌కు కలిగే రాజకీయ ప్రయోజనాలేమిటి? రాబోయే ఎన్నికల్లో ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుంది? కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక వేళ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుతో వెళ్తే తమ పరిస్థితి ఏంటి అనేది పార్టీ సీనియర్ నేతలు, టికెట్ల ఆశావాహుల్లోనూ చర్చకు దారితీసింది. పొత్తుంటే అసలు బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు? అనేది సైతం నేతలు చర్చించుకుంటున్నారు.
ఏది ఏమైనా డీలిమిటేషన్ అంశం బీఆర్‌ఎస్-బీజేపీ రాజకీయ పొత్తుల వైపు మళ్లుతోంది. కేటీఆర్ ప్రకటనను పొత్తుకు సంకేతంగా చూడాలా? లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న విధానపరమైన నిర్ణయంగా భావించాలా? అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయంగా మారుతున్న పరిణామాలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. కారు, కమలం నిజంగానే దగ్గరవుతాయా? లేక ఇది రాజకీయ వర్గాల్లో సాగుతున్న ఊహాగానాలకే పరిమితమవుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. దీనిపై బీఆర్ఎస్ సైతం క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే గులాబీపార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటన్నింటికీ గులాబీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also read: చిమ్మచీకట్లోనూ గబ్బిలాలకు దారి ఎలా కనిపిస్తుంది? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!