తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కులం కలరింగ్ కూడా తోడయ్యింది. ఏపీ రాజకీయాల మాదిరిగా ఇక్కడా కుల రాజకీయాలు రచ్చకెక్కేలా ఉన్నాయి. రెడ్లు- వెలమల పంచాయితీ మొదలైందిప్పుడిక్కడ.
మొన్న సీఎం రేవంత్‌రెడ్డి నీది ఏ జాతిరా.. నీ జాతెంత.. నీ లెక్కంత..? అన్నట్టుగా కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఇక్కడ తెలంగాణలో మీ వెలమల రాజ్యం నడవనీయమనే రేంజ్‌లో ఆయన ఇండైరెక్టుగా అటాక్ చేశారు. గతంలో తెలంగాణలో రెడ్ల రాజకీయమే రానుందనే విధంగా మాట్లాడిన రేవంత్ మాటలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత… సగం పాలన ముగిసిన నేపథ్యంలో అధికారం కోసం ఈ రెండు పార్టీలు తీవ్రంగా కుమ్ములాడుకుంటున్నాయి.
మొన్నటి దాకా పదేండ్లు పాలించి ఓడిన బీఆరెస్ కచ్చితంగా మేమే వస్తున్నాం.. అంటూ జనం మెదళ్ల లో బాగా నానేలా విస్తృత ప్రచారం చేస్తూ వస్తోంది. పదేండ్లు అనుభవించారు… దోచుకున్నారు.. ఇంకానా..? ఈ తులసీవనంలో మీ గంజాయి మొక్కను ఎదగనీయం..అంటూ రేవంత్ బీఆరెస్ ఆశలకు గండిపెట్టే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు.
అంతే కాదు.. మరో టర్ము కూడా మేమే అధికారంలో ఉంటాం.. ఇది చరిత్ర చెబుతున్న సత్యమని ఆయనో మైండ్ గేమ్ చాలు చేశారు. అయితే ఈ జాతి అంశం తెరపైకి రావడం.. తమను చిన్నబుచ్చేలా సీఎం మాట్లాడిన తీరుపై బీఆరెస్‌లో బాగానే చర్చ జరిగినట్టుంది. అందుకే ఇవాళ మంచిర్యాలలో జరిగిన రైతు సభలో దీనిపై ప్రత్యేకంగా మాట్లాడాడు కేటీఆర్. ఓ పెద్ద పేపరే రాసుకొచ్చాడు. తనకు అలవాటైన యాసలు, ప్రాసలు, పంచ్ డైలాగులను మిళితం చేసి నాది ఈ జాతి.. నీ జాతైతే కాదు.. అంటూ పరోక్షంగా.. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అని, తెలంగాణ అభివృద్ధిని నాశనం చేస్తున్నాడని విమర్శిస్తూ.. ఆయనను ఆ జాతి కింద పరిగణిస్తూనే.. ఆ జాతి నాది కాదంటూ .. తన జాతి గురించి పరోక్షంగా.. తెలంగాణ కోసమే మేమున్నాం.. ఎప్పటికీ ఇక్కడి ప్రజల సంక్షేమం కోసమే కట్టుబడి ఉంటామనే విధంగా చెప్పుకొచ్చాడు.
ఇక్కడ రెడ్ల ప్రస్తావన రాలేదు. జాతి అనే పదాన్నే పదే పదే వాడాడు కేటీఆర్. అయితే రేవంత్ డైరెక్టుగా అటాక్ చేస్తే.. కేటీఆర్ మాత్రం తెలంగాణ సెంటిమెంట్‌ను కలగలిపి.. తమకు, రేవంత్‌రెడ్డికి మధ్య ఉన్న తేడా ఇదీ అనే విధంగా జనాలు గ్రహించాలనే తపన అతని మాటల్లో కనిపించింది. జాతి గురించి అవహేళన చేస్తూ… తమను చిన్నబుచ్చేలా మాట్లాడిన మాటలకు హర్ట్ అవుతూనే.. దాన్నీ రాజకీయంగా జనామోదం పొందే విధంగా .. రెడ్లను తిట్టినట్టు కాకుండా.. కేవలం రేవంత్ రెడ్డి వైఖరి, అనుసరిస్తున్న విధానాన్నే నిలదీస్తున్నట్టుగా ఆయన ప్రసంగం సాగింది.
అయితే కేటీఆర్‌కే కాదు.. కేసీఆర్‌కూ తెలుసు. తెలంగాణలో రెడ్ల రాజకీయ బలం గురించి.అందుకే నేరుగా ఆ జాతి ప్రస్తావన తెచ్చి.. రేవంత్ వేసిన ఉచ్చులో ఇరుక్కుపోయి రెడ్లకు దూరం చేయాలనే వ్యూహానికి చిక్కుకోకుండా.. తెలివిగా ఇలా సమాధానమిచ్చాడు కేటీఆర్. రేవంత్ నోటి వెంట ఈ జాతి అనే పదం గతంలో ఎప్పుడూ రాలేదు. ఈ మధ్య తెలంగాణ జాతిపిత అనే పదాన్ని కేసీఆర్‌కు ఆపాదిస్తూ బీఆరెస్ విస్తృత ప్రచారం చేసింది. దీంతో రేవంత్‌కు మండింది.
వన్ ఫైన్ మార్నింగ్.. ఎవడికిరా నువ్వు జాతిపితవు..? నీదే జాతి..? నీజాతికి నువ్వు జాతిపితవు కావొచ్చు.. మాకు కాదు..! అంటూ భగ్గుమన్నాడు. అంటే.. వెలమ జాతికి నువ్వు గొప్ప కావొచ్చు. కానీ తెలంగాణ సమాజాన్ని ఓన్ చేసుకునేందుకు వాడుకుంటున్న తెలంగాణ జాతిపిత అనే పదం ఎట్టి పరిస్థితుల్లో నీకు దక్కనివ్వను .. అనే విధంగా ఆయన మాటల దాడి కొనసాగింది.