
Aurangzeb : మనదేశాన్ని ఏలిన మొఘల్ చక్రవర్తుల్లో ఔరంగజేబు మత విశ్వాసాలను పాటించటంలో చాలా కఠినంగా ఉండేవాడు.
జనం కట్టే పన్నులను తన ఖర్చులకు వాడుకోవటం ఇస్లాంకు విరుద్ధమని తలచి, టోపీలు కుట్టటం, చేతితో ఖురాన్ ప్రతులు రాసి అమ్మగా వచ్చిన డబ్బును వ్యక్తిగత ఖర్చులకు వాడుకునే వాడు.
ఒకరోజు ఆయనకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. నగరంలోని జనమంతా అక్కడక్కడా కాకుండా ఒకేచోట కూడి.. నమాజు చేస్తే ఏకకాలంలో, ఒకే భావనతో చేసే ఆ ప్రార్థన త్వరగా ఫలిస్తుందని అనిపించింది.
ఆయన ఆదేశంపై మర్నాడే.. రాజ భవనం పక్కనే ఉన్న మైదానంలో వందలమంది నమాజు చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందరూ ఇక్కడికే నమాజుకు రావాలనే చాటింపూ వేయించారు.
తానూ రోజూ నమాజుకు ఔరంగజేబు హాజరయ్యేవాడు. ‘ సమీపంలోని అందరూ నమాజుకు వస్తున్నారా?’ అని అధికారులను అడిగేవాడు.
రెండు రోజుల తర్వాత మైదానం పక్కనే ఉండే మసీదు వద్ద నివసించే ఓ ఫకీరు నమాజుకు రావటం లేదని, చక్రవర్తి ఆదేశమని చెప్పినా రావటం లేదని ఔరంగజేబుకు తెలిసింది.
బలవంతంగానైనా అతడిని మర్నాటి నమాజుకు తీసుకురమ్మని ఆదేశించి, ఆ రోజుకు వెళ్లిపోయాడు. మర్నాడు.. భటులు అతడిని బలవంతంగా పట్టుకొచ్చి నమాజు వరుసలో నిలిబెట్టారు. నమాజు మొదలైంది.
ముల్లా బిగ్గరగా ప్రార్థన చెబుతుండగా, ఔరంగజేబుతో సహా అందరూ మోకాళ్లమీద కూర్చొని నమాజు చేస్తున్నారు. ఇంతలో ఆ ఫకీరు బిగ్గరగా.. ‘ నీ తుచ్ఛమైన దైవం నా పాదాలకింద ఉన్నాడు’ అని అరిచి విసురుగా బయటికి వెళ్లిపోయాడు.

ప్రార్థన పూర్తికాగానే.. అతడిని ఉరితీయమని ఔరంగజేబు ఆదేశించటం, అది అమలు కావటం జరిగి పోయాయి. కానీ.. మర్నాటి నుంచి ఔరంగజేబుకు తిండీ నిద్రా కరువయ్యాయి. మనసు తీవ్రమైన కలతకు లోనవుతూ వచ్చింది.
నేను, అంతమంది మంత్రులు, అధికారులున్నా అతడు అంత ధైర్యంగా ఎలా అరిచాడు? దీనికేదో కారణం ఉందని అనుమానం వచ్చి, మంత్రులను తీసుకుని నమాజు ప్రదేశానికి వెళ్లాడు.
ముల్లాని పిలిచి.. ‘నిన్న ప్రార్థన సమయంలో మీ మనసు అల్లామీదే లగ్నమైందా? అని అడిగాడు.
దానికి ముల్లా.. తడబడుతూ.. ప్రార్థనకు ముందు మనసు అల్లా మీదనే ఉంది. కానీ.. రెండు నిమిషాలకు నా కూతురిపెళ్లి ఖర్చు గుర్తొచ్చింది. నేను మరింత బిగ్గరగా ప్రార్థన చెబితే.. పాదుషా సంతోషించి బహుమానం ఇస్తే.. నా కూతురిపెళ్లి సమస్య తీరుతుందని అనుకుంటున్నాను.. ఇంతలోనే ఆ ఫకీరు అలా కేకలేసి వెళ్లిపోయాడని జవాబిచ్చాడు.
వెంటనే ఔరంగజేబు.. నిన్న ఆ ఫకీరు నిలబడిన చోటులో తవ్విచూడమని ఆదేశించగా.. అక్కడ పెద్ద నిధి బయటపడింది. అప్పుడు చక్రవర్తికి ఆ ఫకీరు మాట్లాడిన మాటలోని అంతరార్థం అవగతమైంది.
ఒక మహా భక్తుడిని అత్యంత దారుణంగా హత్యచేయించాననే భావన కలగగానే.. ఆ మైదానంలో కుప్పకూలిపోయి.. కన్నీటి పర్యంతమయ్యాడు.
తన కళంకిత చరిత్ర భావితరాలకు తెలియరాదని, తన మరణం తర్వాత అత్యంత సాధారణంగా అంత్యక్రియలు చేయాలని, తన పూర్వీకులకు నిర్మించినట్లు పెద్దపెద్ద సమాధి అవసరం లేదని చెప్పాడట.
జీవితంలో చివరి క్షణం వరకు ఆ పశ్చాత్తాప భావన అనుక్షణం ఆయన వెంటాడిందట.