Kadapa MLA: కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తన వ్యవహార శైలితో వరుస వివాదాలతో తరచు వార్తల్లో హైలెట్ అవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో మొదలైన కుర్చీ వివాదం రాష్ట్రంలోనే రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా కుర్చీ కోసం ఐఏయస్ అధికారితో ఆమె వ్యవహరించిన తీరు కొత్తగా ప్రొటోకాల్ వివాదానికి దారి తీసింది. రెవెన్యూ అధికారుల సంఘం ఆ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుని ఖండిస్తుంటే ఎమ్మెల్యే సైతం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారుల కుటుంబ సభ్యుల కార్యక్రమంలా నిర్వహించినందుకు ధన్యవాదాలు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎందుకు ఆ ఎమ్మెల్యే వ్యవహారం వివాదంగా మారింది?
కడప నుంచి గెలిచిన మొదటి మహిళా ఎమ్మెల్యే మాధవీరెడ్డి
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప టీడీపీ శాసనసభ్యురాలు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాజీ డిఫ్యూటి సీఎం అంజాద్ బాషాపై గెలిచి మొదటిసారి కడప అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మహిళా ఎమ్మెల్యే గా గెలిచి చరిత్రలో నిలిచారు. రెండు దశాబ్దాల తర్వాత కడప అసెంబ్లీ సెగ్మెంట్‌లో టిడిపి గెలవడంతో మాధవీ రెడ్డి మరింత దూకుడుతో వ్యవహరిస్తూ కడప రెడ్డమ్మ అనిపించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు టిడిపి సీనియర్ నేత అలంకాన్ పల్లె లక్ష్మిరెడ్డి తో మొదలైన వివాదం తర్వాత కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో మళ్లీ దూకుడు కొనసాగించారు.
మేయర్ సురేష్ సీటుకు ఎసరు వచ్చేలా చేసిన ఎమ్మెల్యే
కడప వైసీపీ మేయర్ సురేష్ బాబుకు సీటుకే ఎసరు తెచ్చేలా చేసి వైసిపికి జిల్లాలో షాక్ ఇచ్చారు కడప రెడ్డెమ్మ. ఈ వ్యవహారంతోనే కడప రెడ్డెమ్మ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇదే ఫైర్ కొనసాగిస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ఇటీవల వీఆర్వోలపై తనదైన శైలిలో మండిపడ్డారు. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ పై కన్నెర్ర చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.
విలక్షణ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న మాధవీరెడ్డి
కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న మాధవీరెడ్డి తన విలక్షణ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత కడపలో పసుపు జెండా ఎగురవేసిన టీడీపీకి మాధవీరెడ్డి రూపంలో సమర్థురాలైన నాయకురాలు దొరికిందని అంతా అనుకున్నారు. కానీ, ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో మాధవీరెడ్డి వివాదాల్లో చిక్కుకుంటున్నారనే టాక్ నడుస్తోందట. తాను అధికార పార్టీ శాసనసభ్యురాలిని అన్న విషయం విస్మరించి ఆమె దూకుడుగా వ్యవహరించడంతో విమర్శల పాలవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయట.
వేదికపై ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేసిన యంత్రాంగం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి వ్యవహారతీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆగష్టు 15 సందర్బంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపింది యంత్రాంగం. కార్యక్రమం మొదలైన తర్వాత ఆలస్యంగా హాజరయ్యారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఆలస్యంగా రావడంతో ఆ లోపు ఎమ్మెల్యే కు కేటాయించిన కుర్చీలో అధికారులకు చెందిన కుటుంబ సభ్యులు కూర్చున్నారు. ఎమ్మెల్యే రాకను గమనించిన అధికారులు హడావిడిగా వేదికపై కూర్చోవాలని మరో కుర్చీని వేదిక పై తెప్పించారు.
కలెక్టర్ అభ్యర్ధనను సైతం తిరస్కరించిన మాధవీరెడ్డి
జాయింట్ కలెక్టర్ స్వయంగా వచ్చి కూర్చోవాలని సూచించానప్పటికి ఆగ్రహంతో ఊగిపోయారు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి. జిల్లా కలెక్టర్ కలగజేసుకొని కూర్చోవాలని సూచించినా తిరస్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు దూమారం రేపుతోంది. జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేదికపై జిల్లా ఉన్నతాధికారులు, మంత్రి తప్ప ఇంకెవరు కూర్చోవడానికి వీలుండదు. అయినా అధికారులు వేదికపై కూర్చోవాలని సూచించడం కొత్త చర్చకు దారి తీసింది. సదరు ప్రొటోకాల్ ఎమ్మెల్యే కు తెలియదా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కడపలో విజయవంతం అయిన టీడీపీ మహానాడు
నిజానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పనితీరుపై టీడీపీ కార్యకర్తలు, నేతల్లో జోష్ ఉందనే టాక్ జిల్లాలో ఉంది. ఆమె దూకుడు ఈ కాలానికి తగ్గ రాజకీయమే అంటూ ఆమెను సమర్థిస్తున్నవారు ఉన్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా కాస్త సంయమనం పాటించాలనే సూచనలు వినిపిస్తున్నాయట. కడప నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుర్చీ కోసం చేసిన ఫైటింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఆమె ఇమేజ్ ను పెంచింది. కడపలో మహానాడు నిర్వహణ సందర్భంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి దంపతుల సామర్థ్యానికి టీడీపీ అధిష్టానం ఫిదా అయింది. మారుమూల ప్రాంతంలో.. సరైన వసతులు లేని ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహానాడు నిర్వహించి టీడీపీ అధిష్టానం మనసు చూరగొన్నారు మాధవీరెడ్డి దంపతులు. ఇలాంటి దశలో దూకుడుతో ఇబ్బందులలో పడటం కరెక్టు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట.
Also Read: అందుకే ఇదంతా.. మేడిగడ్డ కుంగుబాటు అసలు కారణం ఇదే: KCR
ఎమ్మెల్యే భర్త అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శలు
తాజాగా ఎమ్మెల్యే వ్యవహారంతో కడపలో రెవెన్యూ శాఖ వర్సెస్ ఎమ్మెల్యే గా మారిందనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే తీరుపై రెవెన్యూ సంఘాలు గుర్రుగా ఉన్నాయంటున్నారు. జిల్లా కలెక్టర్ ఇకపై ప్రొటోకాల్ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారట. ఎమ్మెల్యే తో పాటు ఎమ్మెల్యే భర్త సైతం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఫిర్యాదులు చేశారంట. మరి కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డిలు ఈ పరిస్థితిని అధిగమించి, కడప వాసులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి.
Story By Rami Reddy, Bigtv