Palakurthi Politics: గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఓటమిపాలై మరో నియోజకవర్గానికి వలసవెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మళ్ళీ తన ప్లాన్ మార్చుకున్నారట. ఎక్కడ పోగొట్టుకున్నామో… అక్కడే వేతుక్కోవాలన్నట్లు పాలకుర్తిలో రీఎంట్రీ ఇచ్చారంట. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ ప్రత్యర్ధులకు సిగ్నల్స్ ఇస్తున్నారట. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపుపొందిన ఆ రాజకీయ దిగ్గజానికి గత అసెంబ్లీ ఎన్నీకల్లో తీవ్ర పరాభవం ఎదురైంది. రాజకీయ ఓనామాలు తెలియని యశస్వినిరెడ్డి చేతిలో భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అసలు ఆ ఓటమి భారంతో వెళ్లిపోయిన ఆ నాయకుడు మళ్ళీ ఎందుకు వ్యూహం మార్చినట్లు..?
పాలకుర్తిలో ఓటమి పాలైన ఎర్రబెల్లి దయాకరరావు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి సెగ్మెంట్లో ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో దాదాపు 50వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దారుణ ఓటమి తర్వాత పాలకుర్తి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి రావడం, అతిపిన్న వయసుకురాలి చేతిలో దారుణ ఓటమి కారణంగా పాలకుర్తికి ఎర్రబెల్లి దాదాపుగా గుడ్ బై చెప్పినట్లేనని గుసగుసలు వినిపించాయి.
వర్ధన్నపేటపై దృష్టి సారిస్తూ వచ్చిన ఎర్రబెల్లి
మరోవైపు తన సొంత నియోజకవర్గం వర్ధన్నపేటపై ఎర్రబెల్లి దృష్టి సారించారు. వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ, చేరికలను ప్రోత్సహిస్తూ వర్ధన్నపేట నియోజకవర్గంలో తన గత వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గం నుండి వర్ధన్నపేట నియోజకవర్గానికి మకాం మార్చినట్లు జోరుగా చర్చలు సాగాయి. పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోతోందని చర్చలు జరుగుతున్న వేళ అనూహ్యంగా ఎర్రబెల్లి రీఎంట్రీ ఇచ్చారు. రైతులకు సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, దేవాదుల నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి పాదయాత్ర చేశారు.
స్ధానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి ఎర్రబెల్లి వ్యూహాలు
స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఎర్రబెల్లి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని, పాలకుర్తిలో ఎర్రబెల్లి హవా లేదని కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తన సత్తా చాటేలా ఎర్రబెల్లి దయాకరరావు చేరికల పర్వానికి తెరలేపారు. తాజా మాజీ సర్పంచ్ లను మొదలుకొని 100 మందికి పైగా సీనియర్ కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . దీంతో ఎర్రబెల్లి సైలెంట్ గా నియోజకవర్గంలో పట్టు సాధిస్తున్నారని చర్చ జోరుగా సాగుతోంది.
సీనియర్ కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్తున్న ఎర్రబెల్లి
ఎన్నికల్లో ఓటమి తర్వాత పాలకుర్తి నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్న ఎర్రబెల్లి, సైలెంట్ గా తన పని తాను చేసుకోబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారని అదును చూసి వారందరినీ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తారని టాక్ వినిపిస్తోంది. పాలకుర్తి కాంగ్రెస్ లో జరుగుతున్న ఆధిపత్య పోరాటం వల్ల, వర్ధన్నపేట నియోజకవర్గానికి మారాలనుకున్న ఎర్రబెల్లి, తన నిర్ణయం మార్చుకొని తిరిగి పాలకుర్తిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త అయిన ఝాన్సీ రెడ్డి తీరుతో అసంతృప్తిగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలపై ఎర్రబెల్లి దృష్టి సారించారట.
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి ఎర్రబెల్లి స్కెచ్
ఝాన్సీ రెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తుండడంతో, తాజా పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు ఎర్రబెల్లి సిద్దమయ్యారట. ఝాన్సీ రెడ్డి వ్యతిరేకులతో పాటు, మాజీ ప్రజా ప్రతినిధులను తనవైపుకు తిప్పుకునేలా పక్కా వ్యూహంతో ఎర్రబెల్లి ముందుకు వెళ్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఎర్రబెల్లి పావులు కలుపుతున్నారని ఆయన అనుచరవర్గం ప్రచారం చేసుకుంటోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎర్రబెల్లి దయాకర్ రావు రెఫరండంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకుని ఝాన్సీ రెడ్డికి భారీ షాక్ ఇచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారట.
ఝాన్సీరెడ్డి తీరుతో విసిగిపోతున్న సీనియర్ కాంగ్రెస్ నేతలు
ఇప్పటికే ఝాన్సీ రెడ్డి తీరుతో విసిగిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేతలు.. సేవ్ కాంగ్రెస్ పేరుతో వేరుకుంపటి పెట్టారు. ఝాన్సీ రెడ్డి పై అధిష్టానం చర్యలు తీసుకోకుంటే తమ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ప్రకటించడంతో, కాంగ్రెస్ పార్టీలోని వర్గ పోరు తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారట ఎర్రబెల్లి. మరోవైపు స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులను తన దారిలోకి తెచ్చుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నారట. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి చేరికల పర్వానికి తెరలేపి, ఝాన్సీ రెడ్డి ఒంటెద్దు పోకడలకు గట్టి షాక్ ఇవ్వాలని నిశ్చయించుకున్నారనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు సైతం ఇప్పుడు ఎర్రబెల్లి దూకుడుతో డైలమాలో ఉన్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్రబెల్లికి సపోర్ట్ చేస్తేనే ఝాన్సీ రెడ్డి అహంకారం తగ్గుతుందని భావిస్తున్నాయట కాంగ్రెస్ శ్రేణులు.
Also Read: ముంబై అల్లకల్లోలం.. మునిగిన అండర్ గ్రౌండ్ మెట్రో..!
పరిస్థితులు చూసుకుని ఎంట్రీ ఇచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా పాలకుర్తి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఒక్కటై, స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారట. ఝాన్సీ రెడ్డిపై పోరుకు సొంత పార్టీ నేతలే సిద్ధం కావడంతో.. కాలం తమకు కలిసి వస్తుందని ఎర్రబెల్లి భావిస్తున్నారట. శత్రువుకు శత్రువు మిత్రుడైనట్లు.. ప్రస్తుత పరిస్థితులను గమనించిన ఎర్రబెల్లి అదునుచూసి పాలకుర్తిలో రీఎంట్రీ ఇచ్చారంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఝాన్సీ రెడ్డి పై చర్యలు తీసుకొని ఆమె వ్యతిరేక వర్గాన్ని బుజ్జగిస్తుందా.. లేక వర్గపోరుపై మౌనం వహించి ఎర్రబెల్లిని పట్టు బిగించేలా చేస్తుందా? వేచి చూడాలి.
Story By Rami Reddy, Bigtv