Urea War: తెలంగాణలో యూరియా కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. మంచి వర్షాలు కురుస్తున్నాయి. అదును మీద యూరియా చల్లితే దిగుబడులు బాగుంటాయ్. అందుకే రైతులు ఎండనక వాననక క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఎండకు ఎండుతున్నారు. వానకు తడుస్తున్నారు. చెప్పుల్ని క్యూలైన్లలో పెడుతున్నారు. అయినా సరే అనుకున్నంత యూరియా దొరకట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది..? కేంద్రం ఏమంటోంది.. రాష్ట్ర ప్రభుత్వ వివరణ ఏంటి? యూరియా కష్టాలు తీరుతాయా?
అదును మీద యూరియా అవసరం..
ఇదీ తెలంగాణలో కనిపిస్తున్న సీన్లు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యూరియాకు డిమాండ్ పెరుగుతోంది. అదును మీద యూరియా చల్లితే దిగుబడులు బాగుంటాయి. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు చాలా కీలకం. అందుకే రైతులు ఈ ఎరువుల బస్తాల కోసం ఇదిగో ఇలా పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ యూరియా కొరత చుట్టూ కొత్త రాజకీయం మొదలైంది. ఈ ఖరీఫ్ సీజన్ లో ఇస్తానన్న వాటాను కేంద్రం పూర్తిగా ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. అవసరం మేరకు ఇస్తూ వచ్చామన్నది కేంద్రం మాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యప్రణాళికా లోపం, సమన్వయ లోపాలే కారణమన్నది బీఆర్ఎస్ వెర్షన్. సో యూరియా చుట్టూ తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది.
ఖరీఫ్ యూరియా కోటా 9.80 లక్షల మె. టన్నులు
ఒక్కసారి కేంద్రం ఇచ్చిన ఈ యూరియా సప్లై నెంబర్స్ చూడండి. ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన యూరియా కోటా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు. ఆగస్ట్ నెల దాకా చూస్తే 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. కానీ ఇప్పటివరకు సప్లై చేసింది కేవలం 5.18 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే ఇంకా 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాలేదు. అత్యంత కీలకమైన ఆగస్టులో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, కేవలం 1.70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. కోత విధించారా..? వస్తుందా రాదా కూడా తెలియదు. ఈ నెంబర్స్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రిలీజ్ చేసింది. తెలంగాణాలో ఏప్రిల్ నెల నుంచి ఈ ఆగస్ట్ వరకూ చూస్తే.. ఏ నెలలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తి కోటాను రిలీజ్ చేయలేకపోయిందంటోంది తెలంగాణ ప్రభుత్వం.
ఎరువుల కరువుకు దారి తీసిందేంటీ?
సో ఒక క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. మరి తెలంగాణలో ఎరువుల కరువుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఒక్కసారి ఈ ఫోటో చూడండి. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి.. జులై 8న కలిశారు. తెలంగాణకు కేంద్రం చెప్పినంత యూరియా సప్లై చేయాలని వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఈ ఫోటో చూడండి.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా జేపీ నడ్డాను ఆగస్ట్ 6న స్వయంగా కలిసి యూరియా కోటా విడుదల చేయాలని కలిసి వచ్చారు.
తెలంగాణలో యూరియా వాడకం ఎక్కువన్న నడ్డా
ఇంత జరిగాక కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డా ఏం చెప్పారో తెలుసా.. తెలంగాణలో యూరియా ఎక్కువగా వాడుతున్నారన్నారు. 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో 21%, 2024 ఖరీఫ్‌తో పోలిస్తే 2025 ఖరీఫ్‌లో 12.4% ఎక్కువ యూరియా వాడారన్నారు. రాష్ట్రంలో యూరియా ఎక్కువ వినియోగంతో భూమి సారంపై ఎఫెక్ట్ పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి జులై 8న జేపీ నడ్డాను కలిసిన తర్వాత ఎరువులు, రసాయనాల శాఖ ఈ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. అదీ సంగతి. తెలంగాణ రైతుల వాస్తవ డిమాండ్‌ను తీర్చడానికి అవసరమైన మద్దతు ఇస్తామంటూనే ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయాలని ఎరువులు, రసాయన శాఖ అధికారులను ఆదేశించారు. కానీ అలా కూడా జరగడం లేదు. అందుకే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయంటున్నారు.
రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సమతౌల్యంగా ఎరువుల ఉపయోగాన్ని, ప్రత్యామ్నాయ ఎరువులు, సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు చేయూతనందించడానికి కేంద్రం పీఎం ప్రణామ్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది రైతులు ఫాలో అవ్వాలంటే చాలా ముందస్తుగా అవగాహన కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించారు. అయితే అది పూర్తిస్థాయిలో జరగకుండానే సేంద్రియంవైపు మళ్లాలంటే కష్టమే. కేంద్ర ఎరువుల శాఖ చెప్పిన మరో విషయం ఏంటంటే.. వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను మళ్లిస్తున్న వారిపై చర్యలు తీసుకొని, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా ఎరువుల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నది. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలుతోందా? లేదంటే ఏం జరుగుతుందన్నది తేలాల్సిన విషయం.
తెలంగాణలో చాలా వరకు వర్షాధార పంటలే. అదును మీద వాన పడితే పెట్టిన పెట్టుబడి రావడం, దీంతో పాటు లాభాలు రావాలంటే యూరియా కచ్చితంగా వాడుతుంటారు. ఇది తెలంగాణలో కొత్త కాదు. అయితే యూరియా కొరత ఉండడమే ఇప్పుడు అసలు క్వశ్చన్ గా మారింది. ఈ మొత్తం మ్యాటర్ పై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఎరువుల కరువుకు మీరంటే మీరే కారణమంటూ డైలాగులు పేలుతున్నాయ్. చూశారుగా.. ఇదీ తెలంగాణలో ట్రెండింగ్ అవుతోంది. రైతుల బర్త్ డే గిఫ్టులుగా యూరియా బస్తాలను ఇస్తున్నారు. యూరియా బంగారం అన్నట్లుగా మారింది సీన్. దీనిపై రాజకీయంగా వాద ప్రతివాదాలు నడుస్తున్నా కథ మాత్రం మరోలా ఉంది.
యూరియా కొరతపై వాయిదా తీర్మానాలు
ఇక్కడ చూడండి.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం నాడు పార్లమెంట్ లో యూరియా కొరతపై వాయిదా తీర్మానాలు ఇచ్చారు. పార్లమెంట్ ఆవరణలో ఫ్లెక్సీ చేత పట్టి నిరసన తెలిపారు. తెలంగాణకు హామీ ఇచ్చినట్లుగా స్టాక్స్ పంపించాలన్నారు ఎంపీ బలరాం నాయక్. అటు కేంద్రం ఓట్ల చోరీతో పాటే యూరియా చోరీ చేస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు యూరియా కొరతపై నోరు విప్పాలన్నారు చామల. ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరతపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రైవేట్ డీలర్లు యూరియాను ఎక్కువ రేట్లకు అది కూడా కొన్ని షరతులతో అమ్ముతున్నారని రైతులు అంటున్న మాట. 40 కిలోల బస్తా ధర 267 ఉండగా, ప్రైవేటు డీలర్లు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా పంపిణీలో లిమిట్ విధించడం, ఒక రైతుకు నెలలో ఒకసారి 4-5 బస్తాలకు మించి ఇవ్వట్లేదంటున్నారు. అటు బఫర్ స్టాక్‌ను గతంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించడం కూడా కొరతకు కారణం అంటున్నారు.
బ్లాక్ మార్కెట్‌కు తరలింపుపై ఫైర్
అటు యూరియా కొరతపై గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం గతంలో కంటే ఎక్కువ యూరియా కేటాయించిందని, కానీ రాష్ట్రంలో కొరత ఉద్దేశపూర్వకంగా సృష్టించారని ఆరోపించారు. యూరియా ఏమవుతుంది? ఎవరు తింటున్నారు? అంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే కృత్రిమ కొరత సృష్టించారన్నారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు కేంద్రం ఇచ్చిందని, అప్పటికే రాష్ట్రం వద్ద 2.67 లక్షల టన్నులు నిల్వ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరియా కొరత ఎందుకు వచ్చిందని, ఎవరు బ్లాక్ మార్కెట్ కు తరలించారని, దందా ఎవరు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ 1.94 లక్షల కోట్లు ఇస్తుందంటున్నారు.
Also Read: జర భద్రం..! నేడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే ఛాన్స్
అటు BRS నాయకులు కేటీఆర్, హరీష్ రావు.. ఎరువుల కొరతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు. KCR హయాంలో యూరియా కొరత లేకుండా చూశారని, ముందస్తు ప్రణాళికతో ఎరువులు నిల్వ చేసేవారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో రైతులు క్యూలలో నిలబడాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. సో ఈ మొత్తం యూరియా మ్యాటర్ రాజకీయ రంగు పులుముకోవడంతో కథ చాలా మారుతోంది. యూరియాపై గతంలో ఎవరెవరు ఏమేం చెప్పారు.. ఏం జరిగిందన్న విషయాలను కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. యూరియా ఫ్రీ ఇస్తానన్న కేసీఆర్ మాటలను గుర్తు చేస్తున్నారు.
Story By Vidya Sagar, Bigtv