OTP Digits:బ్రో ..OTP చెప్పవా …
సార్ ..OTP వచ్చిందా ?
అక్కా ..గా OTP సెండ్ చేయవా..
ఉదయం నుండి రాత్రి దాకా OTP..OTP..OTP.. ఈ పదం పలకనిదే రోజు గడవట్లేదంటే ఈ పదానికున్న ప్రాధాన్యత ఎలాంటిదో అర్థం అయిపోతుంది.ఇక దీనికి తోడు గూగుల్ పేలో డబ్బులు పంపాలన్నా, ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేయాలన్నా, ఆన్‌లైన్‌లో షాపింగ్ ఆర్డర్ కంప్లీట్ చేయాలన్నా, ఆఖరికి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా సరే.. OTP ని టైప్ చేయాల్సిందే.
అలాంటి ఈ OTP సరిగ్గా ఆరు అంకెలే ఎందుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను అన్నట్టుగా నంబర్స్ లో అన్ని డిజిట్స్ ఉండగా ఆరు అంకెలనే OTPలుగా ఎందుకు ఎంచుకుంటారో తెలుసా?ఈ భూ ప్రపంచంలో ఎన్ని కోట్ల యాప్స్ ఉన్నా, ఎన్ని రకాల సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నా, ఈ OTPలు మాత్రం ఎందుకు దాదాపు ప్రతిచోటా సరిగ్గా 6 అంకెలే ఉంటాయో గమనించారా?
లేకపోతే ఇప్పుడు తెలుసుకుందాం రండి!
మాములుగా మనకి పిన్ నంబర్ అంటే సడెన్ గా గుర్తుకువచ్చేది 4 అంకెలున్న సంఖ్య. అంతెందుకు మనం విచ్చలవిడిగా వాడే ఏటీఎమ్ కార్డ్ పిన్ కూడా 4 అంకెలే ఉంటుంది.అలాంటిది OTPకి కూడా 4 అంకెలే పెడితే సరిపోతుంది కదా అన్న డౌట్ మీకు రావొచ్చు. కానీ అసలైన రిస్క్ ఉంది ఇక్కడే.
అది ఏంటంటే…మాములుగా 4 అంకెలున్న సంఖ్య కూడా OTPలుగా వాడొచ్చు. ర్యాపిడో వంటి యాప్స్ లలో అది కనిపిస్తుంది కూడా. కాని అది కేవలం రిస్క్ తక్కువ వాటికే పరిమితం.ఎందుకంటే 4 అంకెల కోడ్‌లో 0000 నుంచి 9999 వరకు కేవలం 10,000 కాంబినేషన్లు మాత్రమే సాధ్యమవుతాయి.ఇక ఇప్పుడున్న టెక్నాలజీకి, విచ్చలవిడిగా డెవెలప్ అయిన ఆటోమేటెడ్ హ్యాకింగ్ టూల్స్‌కు ఈ పదివేల కాంబినేషన్లను క్రాక్ చేయడం పెద్ద కష్టం కాదు కూడా.అందుకే 4 అంకెల OTPని సెక్యూరిటీ పరంగా చాలా వీక్ అని తేల్చేశారు సైబర్ పండితులు.
అదే 6 అంకెల OTP విషయానికి వస్తే కథ వేరే లెవల్ ఉంటుంది.ఎందుకంటే 6 అంకెల కోడ్‌లో 000000 నుంచి 999999 వరకు ఏకంగా 10 లక్షల (1,000,000) కాంబినేషన్లు ఉంటాయి మరి.అంటే మీ OTPని ఊహించి సరిగ్గా చెప్పే ఛాన్స్ అవకాశం పది లక్షల్లో ఒకరి మాత్రమే ఉంటుందన్న మాట.ఇక 4 అంకెల OTP కంటే ఇది 100 రెట్లు ఎక్కువ కాంబినేషన్లతో సాలిడ్ సెక్యూరిటీ ఇస్తుందని స్పెషల్ గా చెప్పర్లేదు కూడా.
అంతేకాదండోయ్..
మన ఫోన్‌కి వచ్చే OTPలకు ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. సాధారణంగా ప్రతి OTP కేవలం 30 సెకన్ల నుంచి 3 లేదా 5 నిమిషాల వరకు మాత్రమే పనిచేస్తుంది.అంత తక్కువ సమయంలో పది లక్షల కాంబినేషన్లను వరుసగా ట్రై చేయడం ఏ హ్యాకర్ కీ సాధ్య పడదు.
also read :QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?
అలా కాకుండా ఎలాగైనా ఆ OTP ఏంటో ట్రై చేయాల్సిందే అని పట్టు వదలని విక్రమార్కుడిలా ట్రై చేయాలని చూస్తే 3 నుంచి 5 సార్లు తప్పుగా కోడ్ ఎంటర్ చేయగానే మన బ్యాంకింగ్, యూపీఐ సిస్టమ్స్ వెంటనే ఆ ప్రాసెస్ మొత్తాన్ని బ్లాక్ చేసేస్తాయి.
అంతా బాగానే ఉంది.6 అంకెలున్న డిజిట్స్ కే ఇంత సెక్యూరిటీ ఉంటే ఇక 7 అంకెలు పెడితే 1 కోటి కాంబినేషన్లు వస్తాయి, 8 అంకెలు పెడితే 10 కోట్ల కాంబినేషన్లు వస్తాయి కదా!మరి అప్పుడు ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది కదా అన్న ఆలోచన మీకు రావడం చాలా సహజం.కానీ అక్కడే మీరు డిజిట్స్ లో లెగ్గేశారు.
ఎందుకంటారా…
అక్కడ సైబర్ సెక్యూరిటీతో పాటు మన హ్యూమన్ సైకాలజీ కూడా ఈ OTP విషయంలో కీ రోల్ పోషిస్తుంది.మనుషుల మెదడు ఒకేసారి చాలా తక్కువ సమయంలో సులభంగా గుర్తుంచుకోగలిగే అంకెల సంఖ్య 6 అని ఎన్నో పరిశోధనల్లో తేలిందట.అంటే టకీ మని నోటిఫికేషన్ రాగానే ఆరు అంకెలను ఒకేసారి చూసేసి స్పీడ్‌గా టైప్ చేయవచ్చు.అదే 7 లేదా 10 అంకెలు ఉంటే… మెసేజ్ పదే పదే చూడాల్సి వస్తుంది.దాని వల్ల తప్పుగా టైప్ చేసే అవకాశం ఉంటుంది.ఇక ఆ OTP ఎంటర్ చేసేవరకల్లా పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.
అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో సంస్థలు, కంపెనీలు, బ్యాంకులు తమ కస్టమర్ల సేఫ్టీనే లక్ష్యంగా ఎక్కువగా 6 అంకెల OTPని ఎంచుకుంటాయన్న మాట.అయితే కొన్ని ప్రభుత్వ సీక్రెట్ వ్యవస్థలు, కార్పొరేట్ సెక్యూరిటీ హార్డ్‌వేర్ టోకెన్లలో ఇప్పటికీ 8 అంకెల OTPలు వాడుతుంటారట కూడా.అయితే మన రోజూ వారి డిజిటల్ లైఫ్ లో పనులన్నీ చక చకా సాగిపోవాలంటే ఈ 6 అంకెల సంఖ్య పర్ఫెక్ట్ ఫిగర్ అన్నమాట.
also read :సూర్యుడు ఉదయాన్నే పెద్దగా ఎందుకు కనిపిస్తాడో ఎప్పుడైనా ఆలోచించారా ?
సో ఇకనుంచి మీ ఫోను కి 6 అంకెల OTP రాగానే ఈ విషయాన్ని రివైండ్ చేసుకుంటారు కదూ..!!