Korean Thriller Series: రాజులకు అధికార దాహం ఉండడం ఎన్నోసార్లు చూశాం మనం. కానీ రక్తదాహం ఉండడం అనేది చాలా అరుదు. యుద్ధంలో చీల్చి చెండాడితే ఏరులై పారే రక్తం గురించి కాదు మనం మాట్లాడుకుంటున్నది. సొంత సేననే చంపి, స్వయంగా వాళ్ళ రక్తాన్ని రాజే తాగుతాడు. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన కొరియన్ సిరీస్ పేరే ‘కింగ్‌డమ్’ (Kingdom 2019).
కొరియాలోని 15-16వ శతాబ్దపు ‘జోసోన్’ రాజవంశ కాలంలో షురూ అవుతుంది ఈ సిరీస్ కథ. జపాన్ తో సుదీర్ఘ యుద్ధం ముగిసిన తర్వాత దేశం తీవ్రమైన కరువు, ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. మరోవైపు రాజ్యంలో అధికార దాహం, కుట్రలు పీక్స్‌లో ఉంటాయి. జోసోన్ సామ్రాజ్యపు రాజు ఒక వింత వ్యాధి బారిన పడతాడు. అతని యువ భార్య, ఆమె తండ్రి పవర్ ఫుల్ మినిస్టర్ ‘చో హాక్-జు’ కలిసి రాజును ఒక గదిలో బంధిస్తారు. రాజును ఎవరినీ చూడనివ్వరు.
క్వీన్ గర్భవతి కావడంతో, ఆమెకు కొడుకు పుట్టే వరకు రాజు బతికే ఉన్నాడని ప్రపంచాన్ని నమ్మించి, రాజ్యాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. రాజుకు మొదటి భార్య కొడుకైన యువరాజు ‘లీ చాంగ్’కు తన తండ్రి పరిస్థితిపై అనుమానం వస్తుంది. రాజును చూడటానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాక, తండ్రికి చికిత్స చేసిన రాయల్ డాక్టర్ ‘లీ సీంగ్-హుయ్’ని వెతుక్కుంటూ, జియోంగ్సాంగ్ అనే సుదూర ప్రాంతానికి చెందిన యువరాజు తన బాడీగార్డ్‌తో కలిసి బయలు దేరుతాడు.
డాక్టర్ లీ సీంగ్-హుయ్ తన క్లినిక్‌కు తిరిగి వచ్చేసరికి, అక్కడ ఆకలితో అలమటిస్తున్న రోగులు ఉంటారు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వల్ల అక్కడ ఉన్న రోగులందరూ ఒక వింత వైరస్ బారిన పడి ‘జాంబీలు’గా మారిపోతారు. ఈ జాంబీలు పగటిపూట నిద్రపోతూ, రాత్రి అవ్వగానే శవాలలా లేచి బతికున్న మనుషులపై దాడి చేస్తుంటాయి. క్లినిక్ కు చేరుకున్న యువరాజుకు కూడా అదే ఘోర ఆకలి కనిపిస్తుంది.
అక్కడ ప్రాణాలతో మిగిలిన మెడికల్ అసిస్టెంట్ ‘సియో-బి’, మిస్టరీ ఫైటర్ ‘యంగ్-షిన్’ సహాయంతో లీ చాంగ్ ఆ జాంబీలతో ఫైట్ చేస్తారు. ఈ మహమ్మారి కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తూ రాజధాని వైపు దూసుకు పోతుంటుంది. ఒకవైపు ఊర్ల మీద ఊర్లు జాంబీలుగా మారిపోతుంటే, మినిస్టర్ చో హాక్-జు మాత్రం యువరాజును దేశద్రోహిగా ముద్రవేసి, అతడిని చంపడానికి సైన్యాన్ని పంపుతాడు. మరి ఆ యువరాజు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నాడు ? చివరకు రాజుకు సంబంధించిన చేదు నిజాన్ని యువరాజు ఎలా తెలుసుకున్నాడు ? ఈ మాస్టర్ పీస్ సిరీస్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే మొత్తం సిరీస్ ను చూడాల్సిందే.
జు జి-హూన్, బే డూనా, ర్యూ స్యుంగ్-ర్యాంగ్ తదితరులు నటించిన ఈ సిరీస్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ గా నిలిచిన ఈ సిరీస్ Netflixలో ఇంగ్లీష్, కొరియన్, హిందీ ఆడియోలతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లేదు. కావలంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడవచ్చు.
Read Also: యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్