GST on Cable TV: ప్రధాని మోదీ జీఎస్టీలో కీలక మార్పులు రాబోతున్నాయని ప్రకటించిన తర్వాత దేశంలో పలు వస్తువులు, సేవల ధరలు తగ్గే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 3న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారబోతోంది. ఇందులో కేబుల్ టీవీ కస్టమర్లకు గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబుల్ టీవీ సేవలపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. దీన్ని 5 శాతానికి తగ్గించాలని కేబుల్ పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా కోట్లాది కస్టమర్లకు నెలవారీ టీవీ బిల్లులు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
Also read: Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో కూలిన భవనం.. 15 మంది మృతి
ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసి తమ సమస్యలను వివరించింది. అధిక పన్నులు, శాటిలైట్ ఛానెల్ ధరల పెరుగుదల, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పోటీ కారణంగా కేబుల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని పేర్కొంది. ఈ కష్టాలను అధిగమించేందుకు జీఎస్టీ తగ్గింపు అత్యవసరమని ఫెడరేషన్ స్పష్టం చేసింది. జీఎస్టీ రేటు తగ్గితే వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, కేబుల్ ఆపరేటర్లకు కూడా ఆర్థికంగా బలం లభిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా ఆపరేటర్లు తమ వ్యాపారాలను మరింత లాభకరంగా కొనసాగించగలుగుతారు.
డిజిటల్ సేవల విస్తరణలో పెట్టుబడి పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వ డిజిటల్ ఇండియా మిషన్ ముందుకు సాగుతుందని ఫెడరేషన్ పేర్కొంది. కేబుల్ టీవీ కేవలం వినోదం మాత్రమే కాకుండా, పట్టణాలు, గ్రామాల్లోని కుటుంబాలకు వార్తలు, విద్య సమాచారం అందించే ముఖ్య మాధ్యమమని ఫెడరేషన్ గుర్తు చేసింది. జీఎస్టీ తగ్గింపు వల్ల కస్టమర్లకు ప్రయోజనం కలగడంతో పాటు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మందికి ఉపాధి కూడా సురక్షితం అవుతుందని తెలిపింది. ప్రస్తుతం ఈ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.