Bank account nominee rules: ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేటప్పుడు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేటప్పుడు, మ్యూచువల్ ఫండ్స్‌లో.. ఇన్వెస్ట్ చేసేటప్పుడు లేదా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం కచ్చితంగా ఒక నామినీ పేరును చేర్చుతాం. మన తర్వాత మన సంపాదన లేదా ఆస్తులు మన కుటుంబ సభ్యులకు సురక్షితంగా అందాలని ఈ ఏర్పాటు చేస్తాం. అయితే.. మనకంటే ముందే మనం నామినేట్ చేసిన వ్యక్తి అనుకోకుండా అకాల మరణం చెందితే పరిస్థితి ఏంటి? మనం కష్టపడి దాచుకున్న డబ్బు ఎవరికి దక్కుతుంది? చాలా మంది నామినీనే ఆ ఆస్తికి పూర్తి యజమాని అని భ్రమపడుతుంటారు. కానీ.. చట్టం చెప్పే నిజాలు వేరేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చట్టపరంగా నామినీ అంటే.. ఆస్తికి లేదా డబ్బుకు పూర్తి హక్కుదారు కాదు. నామినీ కేవలం ఒక కేర్‌టేకర్ లాంటివారే. అసలు యజమాని.. మరణించిన తర్వాత ఆ డబ్బును లేదా ఆస్తులను చట్టపరమైన వారసులకు చేర వేయడానికి బ్యాంకులు లేదా సంస్థలు కల్పించిన ఒక మధ్యవర్తి సౌకర్యం మాత్రమే నామినేషన్. అంటే.. నామినీగా పేరున్నంత మాత్రాన ఆ డబ్బు మొత్తం వారికే సొంతం అయిపోతుందని అనుకోవడం పొరబాటే.
మీరు బ్యాంక్ అకౌంట్, ఇన్సూరెన్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో నామినీగా ఒకరిని (ఉదాహరణకు మీ తండ్రి లేదా సోదరుడు) పేరు రాశారు అనుకుందాం. ప్రమాదవశాత్తు ఆ నామినీ వ్యక్తి మీకంటే.. ముందే మరణిస్తే, ఆటో మేటిగ్గా ఆ నామినేషన్ రద్దు అయిపోతుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు కొత్త నామినీని మార్చకుండానే.. మరణిస్తే.. ఆ డబ్బు నేరుగా ఆ నామినీ కుటుంబ సభ్యులకు వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్లదు! ఆ డబ్బు కోసం మీ చట్టపరమైన వారసులు (భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు) క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది.
కొత్త నామినీని వెంటనే అప్డేట్ చేయండి: మీ పాత నామినీ మరణించినట్లు తెలిసిన వెంటనే.. ఆలస్యం చేయకుండా సంబంధిత బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించి కొత్త నామినీ పేరును అప్ డేట్ చేసుకోవాలి.
ఎక్కువ నామినీలు: నేటి బ్యాంకింగ్ , ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం ఒకరికంటే.. ఎక్కువ మందిని నామినీలుగా చేసే వెసులుబాటు ఉంది. అంతే కాకుండా ఎవరికి ఎంత శాతం వాటా చెందాలనేది కూడా స్పష్టంగా పేర్కొనవచ్చు. ఇది భవిష్యత్తులో గొడవలు రాకుండా కాపాడుతుంది.
లీగల్ హెయిర్ సర్టిఫికేట్ : నామినీ ఎవరూ లేకపోయినా.. లేదా నామినీ మరణించినా, అసలు వారసులు ఎవరనేది నిర్ధారించడానికి బ్యాంకులు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదా సక్సెషన్ సర్టిఫికేట్‌ను కోరుతాయి. అందుకే.. కుటుంబ రికార్డులను ఎప్పుడూ సరిగ్గా ఉంచుకోవడం ముఖ్యం.
Also Read: క్రెడిట్ కార్డ్ మాన్యువల్ ఫీజుకు బై-బై..లైఫ్‌టైమ్ ఫ్రీగా వాడుకునేందుకు మార్గాలు!
మనం కష్టపడి సంపాదించిన.. డబ్బు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా సరైన వారసులకు చేరాలంటే.. సరైన నామినేషన్ ప్లానింగ్ ఉండాలి. ఒకవేళ వీలునామ రాయడం ద్వారా ఎవరికి ఎంత ఆస్తి చెందాలనేది.. ముందే స్పష్టంగా రాసిపెట్టడం బెస్ట్. ఈ లీగల్ ప్రక్రియలు లేదా సక్సెషన్ సర్టిఫికేట్ల కోసం.. కోర్టులు లేదా న్యాయవాదులను ఆశ్రయించాల్సి వస్తే… అయ్యే ఖర్చులు సుమారు రూ.5,000 నుంచి రూ.20,000 లేదా అంతకంటే.. ఎక్కువగా ఉండొచ్చు. ఈ చిన్న లీగల్ చిక్కులను ముందే.. సరి దిద్దుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు , మానసిక ఆందోళనను తగ్గించుకోవచ్చు.
నామినేషన్ అనేది కేవలం ఒక సాధారణ విషయం కాదు, మీ కుటుంబ ఆర్థిక భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. నామినీ మరణించినప్పుడు తలెత్తే సమస్యలను ముందే ఊహించి, మీ అకౌంట్లు , ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. అప్రమత్తతే మన కుటుంబానికి అసలైన శ్రీరామరక్ష!