Gold-Silver Export: కేంద్రం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన లోహాల ఉత్పత్తుల ఎగుమతులపై డ్యూటీ డ్రా బ్యాక్ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో నగల ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బంగారు ఆభరణాల డ్రాబ్యాక్ రేటు గ్రామ్కు రూ. 1,851.99 నుండి రూ. 1,794.11కి తగ్గించింది. ఇది సుమారు 3.1 శాతం తగ్గుదల. వెండి ఆభరణాలు, కొన్ని వస్తువుల రేటు రూ. 29,501.09 నుండి రూ. 26,859.02కి తగ్గించింది. ఇది సుమారు 9 శాతం తగ్గుదల. డ్యూటీ డ్రాబ్యాక్ అంటే ఏంటి? ఎగుమతి వస్తువుల కోసం దిగుమతి చేసుకున్న ముడి సరుకులపై చెల్లించే కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను ఎగుమతిదారులకు తిరిగి చెల్లించే విధానం.
పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో ఎగుమతిదారుల పోటీతత్వాన్ని మెరుగుపరచడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని రకాల బంగారం, వెండి ఆభరణాల ఎగుమతులపై డ్యూటీ డ్రాబ్యాక్ రేట్లను దాదాపు రెట్టింపు చేసిన విషయం తెల్సిందే. బంగారు ఆభరణాలపై డ్యూటీ డ్రాబ్యాక్ను గ్రాముకు రూ. 773.17 నుండి రూ. 1,851.99కి పెంచింది. వెండి ఆభరణాలు, చేసిన వస్తువుల రేటు కిలోకు రూ. 14,990.66 నుండి రూ. 29,501.09కి పెంచింది. బంగారం-వెండి ధరలు తగ్గడం వల్ల వాటిపై దిగుమతి సుంకం తగ్గింది.
ఈ క్రమంలో డ్యూటీ డ్రాబ్యాక్ సవరణ అవసరమైందని చెబుతున్నారు అధికారులు. సవరించిన రేట్లు, డ్యూటీ డ్రాబ్యాక్ ద్వారా ఎగుమతిదారులు తిరిగి పొందే మొత్తాన్ని తగ్గించడం ద్వారా వారి లాభాల మార్జిన్లపై ఒత్తిడి కలిగించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలు, ఎగుమతి ధరలు, అంతర్జాతీయ డిమాండ్, తగ్గింపును భరించగల వ్యక్తిగత వ్యాపారాల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాయి. భారతీయ ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ బలంగా కొనసాగితే, ఎగుమతుల పనితీరుపై ప్రభావం పరిమితంగా ఉండవచ్చని పరిశ్రమ నిపుణుల మాట.
ALSO READ: చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!
వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్లో భారత్ బంగారం దిగుమతులు గతేడాదితో పోలిస్తే 81.27 శాతం మేరా తగ్గాయి. అదే సమయంలో వెండి దిగుమతులు 49.11 శాతానికి పడిపోయింది. పశ్చిమాసియా సంక్షోభం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో భారీ తగ్గుదల చోటుచేసుకుంది.