Gratuity Changes: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త లేబర్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త లేబర్ కోడ్‌లలో గ్రాట్యుటీ నిబంధనలు మార్పు చేశారు. గతంలో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేస్తే కంపెనీలు గ్రాట్యుటీ ఇచ్చేవి. ఈ నిబంధనలో మార్పు చేశారు. ఇప్పుడు ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన వారికి కూడా గ్రాట్యుటీ ఇవ్వాలని నిబంధనల్లో మార్పు చేశారు. కొత్త లేబర్ చట్టాలతో ఉద్యోగులకు ప్రయోజనాలు కలగనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఏడాది సర్వీస్ పూర్తి చేసిన శాశ్వత ఉద్యోగులకే ఈ నిబంధన వర్తిస్తుందా? కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందా? అనే గందరగోళం నెలకొంది.
లేబర్ కోడ్, 2020 ప్రకారం శాశ్వత ఉద్యోగులు ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేస్తే గ్రాట్యుటీకి అర్హులు కారు. వారికి గతంలో మాదిరిగానే 5 ఏళ్ల నిబంధన ఉంది. ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్, కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే ఏడాది గ్రాట్యుటీకి అర్హులు అవుతారని లేబర్ చట్టంలో మార్పు చేసింది కేంద్రం. శాశ్వత ఉద్యోగులు గ్రాట్యుటీ అర్హతకు 5 సంవత్సరాలు నిరంతర సర్వీస్ అవసరం. ఎందుకంటే వీరి గురించి కొత్త లేబర్ కోడ్‌లలో ఎటువంటి మార్పు ప్రస్తావించబడలేదు.
“ఒక ఏడాది గ్రాట్యుటీ అర్హత నిబంధన స్థిర కాలిక ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది శాశ్వత ఉద్యోగులకు వర్తించదు. శాశ్వత ఉద్యోగులకు ప్రామాణిక అర్హత కాలం ఐదేళ్లు. శాశ్వత ఉద్యోగులకు ఐదేళ్ల నియమానికి మినహాయింపు ఉద్యోగి మరణం లేదా వైకల్యం సందర్భాలలో మాత్రమే ఉంటుంది” అని విశ్లేషకులు చెబుతున్నారు.
గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 ప్రకారం.. ఒక సంస్థ దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులకు కల్పించే ఆర్థిక ప్రోత్సాహకం గ్రాట్యుటీ. ఉద్యోగి నిబద్ధత, అంకితభావానికి కృతజ్ఞతా గ్రాట్యుటీ ఇస్తారు. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు లేదా సంస్థ నుండి వెళ్లిపోయినప్పుడు ఈ మొత్తాన్ని అందిస్తారు.
నవంబర్ 23, 2025 అమల్లోకి వచ్చిన లేబర్ చట్టాల ప్రకారం.. ఉద్యోగుల సామాజిక భద్రత, ప్రయోజనాలు లెక్కించడానికి వేతనంలో ప్రాథమిక వేతనం, కరవు భత్యం, నిలుపుదల భత్యం ఉంటాయి. భత్యాలు, సహకారాలు మొత్తం చెల్లింపులో 50% (కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినట్లు) కంటే ఎక్కువగా ఉంటే అదనపు మొత్తాన్ని వేతనానికి జోడించాలి.
గ్రాట్యుటీ చెల్లింపు.. చివరిగా తీసుకున్న నెలవారీ వేతనం×15/ 26× పూర్తి చేసిన సంవత్సరాల సర్వీస్
Also Read: Black Friday 2025: బ్లాక్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనకున్న చరిత్ర ఏమిటి?
గ్రాట్యుటీ కంపెనీ సీటీసీలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ చెల్లింపు చివరికి కంపెనీ వనరుల నుండి వస్తుంది కాబట్టి ఇది CTCలో భాగంగా ఉంటుంది.