HDFC Bank: ఇంటి దొంగను ఎవరూ పట్టలేరని చెబుతారు. పాపం పండితే అడ్డంగా దొరికిపోతారు. ఇప్పుడు అదే జరిగింది. ఏ విషయంలో అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. దేశంలోని ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి హెచ్‌డీఎఫ్‌సీలో కీలక సమాచారం బయటకు వెళ్లినట్లు అంతర్గత విచారణలో తేలింది. దీంతో సదరు ఇద్దరు సీనియర్ అధికారులపై చర్యలకు రెడీ అవుతోంది ఆ బ్యాంకు. అసలు ఏం జరిగింది?
మార్కెట్ విలువ పరంగా భారత దేశంలో అతిపెద్ద బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి. ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు రహస్య సమాచారాన్ని బయటకు లీక్ చేశారన్నది వారిపై ఉన్న అభియోగం. ముఖ్యంగా వ్యాపార వ్యూహాలు, మార్కెట్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని బయటి వ్యక్తులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆధారాలు లభించినట్టు ఈ వ్యవహారంతో పరిచయం ఉన్న వ్యక్తులు తెలిపారు.
దీనిపై విచారణ జరుగుతున్నందున తమ పేర్లు వెల్లడించవద్దని కోరారట ఆ వ్యక్తులు. కార్యనిర్వాహక అధికారులు బ్యాంకులోని కొన్ని కీలక వ్యాపారాలు, విధులను పర్యవేక్షిస్తారు. బ్యాంకులోని కీలక విభాగాలకు బాధ్యత వహిస్తున్న ఆ అధికారులపై అనుమానాలు రావడంతో అంతర్గత విచారణ ప్రారంభించినట్టు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేశారా? అనే విషయాన్ని బ్యాంకు పరిశీలిస్తుందని, ప్రస్తుతానికి విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.
విచారణలో గుర్తించిన విషయాలను ఉన్నతాధికారులతోపాటు బోర్డులోని కొందరు సభ్యులకు ఈ ఏడాది ప్రారంభంలో చెప్పినట్టు సమాచారం. విచారణలో వెల్లడైన అంశాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వివరాలపై స్పందించలేదు ఆ బ్యాంకు ప్రతినిధి. విచారణ పూర్తయ్యాక వెల్లడయ్యే అంశాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నైతిక విలువలు, పాలనా ప్రమాణాల విషయంలో రాజీ పడబోమని బ్యాంకు తెలిపింది.
ALSO READ: 40 ఏళ్ల వయసు నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్.. ఇలా పెట్టుబడి చేస్తే రూ.3 కోట్ల రాబడి
అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తొలిసారి బయటి వ్యక్తిని చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకోవడానికి సిద్ధమైంది ఆ బ్యాంకు. ఈనెల 27న అనూప్ బాగ్చీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీఐసీఐ గ్రూపులో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు ఈ పరిణామాలు సవాలుగా మారనుందని అంటున్నారు. ఇటీవల ఆ బ్యాంకులో ఉన్నతస్థాయి మార్పులు జరిగాయి. మార్చిలో ఛైర్మన్ చక్రవర్తి.. అనుకోకుండా రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆ బ్యాంకు షేర్ సుమారు 28 శాతం ధర తగ్గింది.