Personal Loan EMI| ప్రతి నెలా పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లిస్తున్నారా? అయితే ఒక్క నెల వాయిదా మిస్ అయినా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జీతం ఆలస్యం కావడం, అనుకోని ఖర్చులు రావడం లేదా ఆటో డెబిట్ ఫెయిల్ కావడం వల్ల ఈఎంఐ చెల్లింపు ఆగిపోవచ్చు. అయితే, ఒక ఈఎంఐ మిస్ అయితే ఎంత పెనాల్టీ పడుతుంది? క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా? వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.
పర్సనల్ లోన్ తీసుకున్నవారు నిర్ణీత తేదీలో ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంది. వీటిలో ఆలస్య చెల్లింపు ఛార్జీలు, వర్తించే పెనాల్టీ ఛార్జీలు ఉండవచ్చు. ఎంత మొత్తం చెల్లించాలనేది మీ లోన్ ఒప్పందం, రుణదాత నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఈఎంఐ ఆలస్యమైతే బకాయి మొత్తాన్ని వెంటనే చెక్ చేయాలి. అదనపు ఛార్జీల గురించి సందేహాలుంటే బ్యాంకును సంప్రదించాలి. వీలైనంత త్వరగా బకాయిని చెల్లించడం ద్వారా మరిన్ని ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.
బ్యాంకులు, NBFCలు రుణ చెల్లింపుల వివరాలను క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తాయి. ఈఎంఐ చెల్లింపులో ఆలస్యం మీ క్రెడిట్ రిపోర్టులో నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. క్రెడిట్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు రుణ దరఖాస్తులను తిరస్కరించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో అధిక వడ్డీ రేట్లను విధించవచ్చు. అయితే, ఒక్క ఈఎంఐ మిస్ అయినంత మాత్రాన ప్రతి ఒక్కరి క్రెడిట్ స్కోర్ ఒకే విధంగా తగ్గుతుందని చెప్పలేం. మీ గత చెల్లింపుల చరిత్ర, ఆలస్యం జరిగిన వ్యవధి వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.
ఈఎంఐ మిస్ అయినప్పుడు బ్యాంకులు సాధారణంగా SMSలు, ఈమెయిల్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా గుర్తుచేస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే బ్యాంకుతో మాట్లాడి మీ పరిస్థితిని వివరించాలి. బకాయి మొత్తం, చెల్లింపు గడువు, అందుబాటులో ఉన్న పరిష్కారాల గురించి తెలుసుకోవాలి.
Also Read: చాణక్య నీతి.. ఒక వ్యక్తి నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఈ 5 లక్షణాలు గమనించండి
ఖాతాలో తగినంత డబ్బు ఉన్నప్పటికీ ఆటో డెబిట్ ఫెయిల్ కావచ్చు. బ్యాంకు సర్వర్ సమస్యలు లేదా ఆటో డెబిట్ ఆదేశాల్లో లోపాలు దీనికి కారణం కావచ్చు. ముందుగా బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ చెక్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు, రుణదాతను సంప్రదించి సమస్యను పరిష్కరించాలి. ఈఎంఐ చెల్లించిన తర్వాత రసీదును భద్రపరచి, చెల్లింపు నమోదైందో లేదో నిర్ధారించుకోవాలి.
బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఈఎంఐ తేదీకి ముందే రిమైండర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఒక ఈఎంఐ బకాయి ఉండగానే తదుపరి వాయిదా గడువు వస్తే ఆర్థిక భారం పెరగవచ్చు. అందువల్ల ఆలస్యాన్ని వీలైనంత త్వరగా సరిచేసుకోవాలి. సకాలంలో చెల్లింపులు చేయడం మీ క్రెడిట్ ప్రొఫైల్ను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
Also Read: మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్షిప్లో చాలా ముఖ్యం