Pension Battle Late Employee| దాదాపు 37 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత రైల్వే ఉద్యోగి కుటుంబానికి ఊరట లభించింది. ఉద్యోగి మరణించినప్పటికీ, ఆయన కుటుంబం కేసును కొనసాగించింది. చివరకు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
సౌదాగర్ అనే వ్యక్తి సెంట్రల్ రైల్వేలో నాగ్‌పూర్ ప్రాంతంలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌గా (TTE) పనిచేశారు. 1988 మే 31న దాదర్ నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ప్రయాణికులకు బెర్తులు కేటాయించేందుకు అక్రమంగా డబ్బులు అడిగారని అధికారులు ఆరోపించారు. అదనంగా రూ.1,254 నగదు కలిగి ఉన్నారని, ఒక ప్రయాణికుడి నుంచి రూ.18 అదనపు ఛార్జీ వసూలు చేయలేదని కూడా ఆరోపించారు. డ్యూటీ కార్డు పాస్ గడువును అనుమతి లేకుండా పొడిగించారని మరో ఆరోపణ చేశారు.
ఈ ఆరోపణలపై రైల్వే శాఖ విచారణ చేపట్టింది. 1996 జూన్ 7న సౌదాగర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆయన చేసిన అప్పీల్ కూడా తిరస్కరణకు గురైంది.
సౌదాగర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 2002 మార్చి 21న ట్రిబ్యునల్ ఆయన తొలగింపు ఉత్తర్వులను రద్దు చేసింది. తిరిగి ఉద్యోగంలో చేర్చడంతో పాటు వర్తించే ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. అయితే, రైల్వే శాఖ బాంబే హైకోర్టులో ట్రిబ్యునల్ ఆదేశాలను సవాలు చేసింది. 2017 సెప్టెంబర్ 21న హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేసి, ఉద్యోగ తొలగింపును సమర్థించింది. ఈలోగా సౌదాగర్ మరణించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కేసును కొనసాగించారు.
సౌదాగర్ సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాలు చేసింది. సుప్రీంకోర్టు.. కేసులో ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించింది. ప్రధాన ఫిర్యాదుదారుడు హేమంత్ కుమార్‌ను విచారణలో ప్రశ్నించలేదు. దీంతో సౌదాగర్‌కు ఆయనను ప్రశ్నించే అవకాశం లభించలేదు. మిగతా ఇద్దరు ప్రయాణికుల వాంగ్మూలాలు కూడా లంచం ఆరోపణలకు మద్దతు ఇవ్వలేదు. అదనపు నగదు ఆరోపణలకు అవసరమైన అధికారిక ఆధారాలు కూడా సమర్పించలేదు. రూ.18 ఛార్జీకి సంబంధించిన ప్రయాణికుడిని విచారణ చేయలేదు. సంబంధిత రసీదు పుస్తకాన్ని కూడా సమర్పించలేదు.
డ్యూటీ పాస్‌పై సంతకం ఫోర్జరీ చేసినట్లు నిరూపించే ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది.
Also Read: పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు
ఆరోపణలు స్పష్టంగా నిరూపితం కాలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునరుద్ధరించి, హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది.
సౌదాగర్ చట్టబద్ధ వారసులకు అన్ని సంబంధిత బెనిఫిట్స్, పెన్షన్ ప్రయోజనాలను మూడు నెలల్లో చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. సరైన ఆధారాలు, న్యాయబద్ధమైన విచారణ లేకుండా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం సమర్థనీయం కాదని ఈ తీర్పు స్పష్టం చేసింది.
Also Read: మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?