Meesho: ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ అంటే తెలియని వారు ఉండరు. అయితే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కనిపించే ధరలకు, మీషోలో కనిపించే ధరలకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. ఒక్కోసారి అయితే బయట షాపింగ్ మాల్స్‌లో కూడా వేలల్లో ఉండే వస్తువులు మీషోలో తక్కువ ధరకే ఎలా వస్తోంది? దీని క్వాలిటీని నమ్మొచ్చా? అని మనందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. మరి మీషో ఆ తక్కువ ధరల వెనుక ఉన్న అసలు గుట్టు ఏంటో తెలుసుకుందామా..
సాధారణంగా పెద్ద పెద్ద యాప్స్ తమ ప్లాట్‌ఫామ్‌లో ఎవరైనా వస్తువులు అమ్ముకుంటే.. వారి దగ్గర కొంత కమిషన్ తీసుకుంటాయి. ఏదైనా రూ.100 వస్తువు కొంటే, అందులో ఓ రూ.20 ఆ యాప్ వాళ్లకే వెళ్తాయి. కానీ మీషో అలా చేయదు. వాళ్లు సెల్లర్స్ దగ్గర సున్నా శాతం కమిషన్ తీసుకుంటారు. దీంతో అమ్మేవారు తమ లాభాన్ని తగ్గించుకోకుండానే.. ఆ కమిషన్ డబ్బులను కస్టమర్లకే తగ్గించి తక్కువ ధరకు ఇస్తారు.
మనం బయట షాపుల్లో కొంటే తయారీదారుడి నుండి హోల్‌సేలర్, ఆ తర్వాత రిటైలర్.. ఇలా ఎంతో మంది చేతులు మారుతుంది. ప్రతి ఒక్కరూ తమ లాభం వేసుకుంటారు. కానీ మీషోలో అలా కాదు. చాలా వరకు వస్తువులు నేరుగా ఫ్యాక్టరీల నుండో లేదా మెయిన్ డీలర్ల నుండో వస్తాయి. మధ్యలో దళారులు లేకపోవడమే ఈ తక్కువ ధరల వెనకున్న రహస్యం.
పెద్ద పెద్ద బ్రాండ్లు తమ వస్తువులను మెరిసిపోయే బాక్సుల్లో, ఖరీదైన ప్యాకింగ్‌తో పంపిస్తాయి. ఆ ఖర్చంతా మన జేబు నుండే వసూలు చేస్తారు. మీషోలో మాత్రం ప్యాకింగ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే వీళ్లు కోట్లు ఖర్చు పెట్టి టీవీల్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వరు. ఆ హంగులు, ఆర్భాటాలు లేవు కాబట్టే రేట్లు అంత తక్కువ.
Also Read: 165Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 9500 చిప్‌సెట్.. వన్‌ప్లస్ నుంచి పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్ వచ్చేస్తోంది!
మీషో కేవలం సిటీల్లో ఉండే వాళ్ల కోసమే కాదు.. పల్లెటూర్లలో ఉండే సామాన్యులను దృష్టిలో పెట్టుకుని పుట్టింది. వీళ్లు లోకల్ కొరియర్ సర్వీసులను వాడుకుంటారు. దీనివల్ల వస్తువును చేరవేసే ఖర్చు (షిప్పింగ్) బాగా తగ్గుతుంది. అందుకే చాలా వస్తువులపై మనకు ఫ్రీ డెలివరీ కూడా దొరుకుతుంది.
మీషోలో అమ్మేవారు ఒక్కో వస్తువు మీద పదుల సంఖ్యలో లాభం ఆశించరు. తక్కువ లాభంతో ఎక్కువ మందికి అమ్మాలనేది వాళ్ల ప్లాన్. అంటే.. రూపాయి లాభంతో వంద వస్తువులు అమ్మడం మేలు అనే సూత్రాన్ని వీళ్లు పాటిస్తారు.
ముఖ్యంగా బడ్జెట్‌లో ఇల్లు గడుపుకోవాలనుకునే మధ్యతరగతి వాళ్లకు మీషో చాలా ఉపయోగకరం. పండుగలకు, ఫంక్షన్లకు తక్కువ ధరకే కొత్త బట్టలు, ఇంటి సామాన్లు కొనుక్కోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా.. ఇంట్లో ఉండే ఆడవాళ్లు రీసెల్లర్స్‌గా మారి, వాట్సాప్ గ్రూపుల ద్వారా వస్తువులను ఇతరులకు అమ్ముతూ తమ సొంత కాళ్ల మీద నిలబడటానికి ఇది మంచి దారి చూపిస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ, ఈజీ రిటర్న్స్ ఉండటం వల్ల నమ్మకం కూడా పెరిగింది.
Also Read: 144Hz డిస్‌ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మార్కెట్లోకి వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇక దుమ్ములేపడమే!