BigTV English

Atla Tadde : అట్లతద్దె.. తెలుగువారికి ఎందుకంత ప్రత్యేకం ?

Atla Tadde : అట్లతద్దె.. తెలుగువారికి ఎందుకంత ప్రత్యేకం ?

Atla Tadde: తెలుగు వారి పండుగల్లో మహిళ కోసమే ఉద్దేశించిన పండుగల్లో అట్లతద్దె ఒకటి. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగను మహిళలు జరుపుకునే పండుగగా భావిస్తుండగా.. ఆంధ్ర, రాయలసీమల మహిళలకు అట్లతద్దె చెప్పుకోదగిన పండుగ. ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుకునే ఈ అట్లతద్దె పండుగను కొన్ని ప్రాంతాలవారు ఉయ్యాల పండుగ అనీ, గోరింటాకు పండుగ అనీ అంటారు.పరమేశ్వరుడిని భర్తగా పొందగోరిన పార్వతీదేవి.. నారదుని సలహా మేరకు ఈ వ్రతం చేసినట్లు పురాణ కథనం. అందుకే వివాహం కావాల్సిన యువతులు ఈ పండుగ నాడు అట్లతద్ది వ్రతం చేస్తారు. అలాగే.. కొత్తగా పెళ్లైన మహిళలు.. తమ సౌభాగ్యం కోసం దీనిని ఆచరించటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.


ఈ పండుగ నాడు అట్లను నైవేద్యంగా పెట్టటం సంప్రదాయం. నవగ్రహాలలోని కుజుడుకి అట్లు అంటే మహా ప్రీతి. ఆయనకు వీటిని ఈ రోజు నైవైద్యంగా పెట్టటం వల్ల కుజదోషాలు తొలగుతాయని, రజోదయ కారకుడైన కుజుని శుభదృష్టి కారణంగా యువతులకు ఋతు సమస్యలు రావని నమ్మకం. అలాగే.. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు చెందిన ధాన్యాలు. ఈ రెండు ధాన్యాలను కలిపి చేసే అట్లను నివేదించటం వల్ల ఆ రెండు గ్రహాల శుభదృష్టి వలన పెళ్లైనవారికి గర్భ సంబంధిత సమస్యలు దూరమై, సుఖప్రసవం అవుతుందని నమ్మకం.

అట్లతద్దె వ్రత విధి


అట్ల తద్దె రోజున వ్రతం చేసే యువతులు, మహిళలు ముందురోజే చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. అలాగే పండుగ రోజు వాయినం అందుకునేందుకు 1, 3, 5, 7, ఇలా బేసి సంఖ్యలో ముత్తైదువలను వ్రతానికి వచ్చి వాయినం అందుకోవాలని కోరుతూ వారికి ముందురోజే కుంకుడు కాయలు, సున్నిపిండి, తాంబూలం ఇచ్చి వస్తారు. అలాగే.. వ్రతం చేసే వారికి, వాయినాలు అందుకునేందుకు వచ్చేవారికి చెట్టు లేదా ఇంటి దూలానికి ఉయ్యాల వేస్తారు.
పండుగ రోజు వేకువజామునే లేచి, స్నానాదికాలు పూర్తి చేసుకుని తెల్లవారు జామునే గౌరీదేవి పూజ చేయాలి. రోజంతా ఉపవాసం, నేల మీద నిద్ర మాత్రమే ఉంటాయి. రాత్రి చంద్రదర్శనం కాగానే తిరిగి గౌరీదేవి పూజ చేసి, అట్లతద్ది నోము కథ చెప్పుకుని శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అమ్మవారికి 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇచ్చి, గోపూజ చేసి, చెరువు వద్దకు వెళ్లి దీపాలు వదిలి, అనంతరం ముత్తైదువులతో కలిసి భోజనం చేయాలి. ఈ రోజు వ్రతం చేసే వారు 11 రకాల ఫలాలను తినడంతో బాటు 11 సార్లు తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఊయల ఊగడం సంప్రదాయం.

ఈ వ్రతాన్ని చేస్తే స్త్రీలకు సంసారంలో సర్వసుఖాలు లభిస్తాయట. తెలుగునేల మీద మనం చేసుకునే అట్లతద్ది పండుగనే ఉత్తభారత దేశంలో ‘కర్వాచౌత్’ పేరుతో జరుపుకుంటారు. ఈ రోజును వ్రతం చేసే మహిళలు.. సాయంత్రం చంద్రోదయం కాగానే.. జల్లెడలో నుంచి చంద్రుడిని, ఆపై తమ భర్త ముఖాన్ని చూసి వ్రతం విరమించటం సంప్రదాయం.

Related News

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Big Stories

×