Big Stories

Vedma Bojju Patel: అసెంబ్లీ బరిలో.. నిరుపేద గోండు బిడ్డ.. ?

Vedma Bojju Patel: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్టీ స్థానమైన ఖానాపూర్ నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వెడ్మ బొజ్జు పటేల్ పోటీచేయబోతున్నారు. ఈ కాంగ్రెస్ సీటు కోసం వెడ్మ బొజ్జుతో బాటు పలువురు బలమైన నేతలు పోటీపడినా.. చివరికి సీటుమాత్రం బొజ్జునే వరించింది.

- Advertisement -

అత్యంత సాధారణ గోండు కుటుంబం నుంచి వచ్చిన వెడ్మ బొజ్జు ఉస్మానియాలో చదివారు. అయితే.. ఆదినుంచే తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి యూనియన్‌ (ఏఎస్‌యూ)లలో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఏఎస్‌యూ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.

- Advertisement -

ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఆదివాసులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నా.. మైదాన ప్రాంత గిరిజనులైన లంబాడీలు.. ఎస్టీ కోటాలో లభిస్తున్న విద్య, ప్రభుత్వోద్యోగాలు, ప్రభుత్వ పదవులను తన్నుకుపోవటాన్ని విద్యార్థి దశ నుంచి బొజ్జు వ్యతిరేకిస్తూ వచ్చారు. ‘ఓట్లు మావే.. సీట్లు మావే’ అనే నినాదంతో ఆదివాసీ యువత మనసుకు దగ్గరయ్యారు.

ఉస్మానియాలో చదివిన బొజ్జు పటేల్ కొన్నాళ్లు.. ఐటీడీఏలో ఉద్యోగమూ చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి.. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ పనిచేస్తూ.. ప్రస్తుతం కాంగ్రెస్ సీటును దక్కించుకున్నారు.

కల్లూర్ గూడా తండాలో పుట్టిన జొజ్జు కుటుంబానికి చిన్న ఇల్లు, కొద్దిపాటి పొలం తప్ప పెద్ద ఆస్తిపాస్తులేమీ లేవు. ఈయన కుటుంబానికి ఏ రకమైన రాజకీయ నేపథ్యమూ లేదు. వీరి కుటుంబంలో చదువుకున్న తొలి వ్యక్తి కూడా ఈయనే. అయినా.. జన బలాన్ని నమ్ముకుని, తను నమ్మిన సిద్ధాంతం కోసం తొలిసారి నేరుగా ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో ఈయనకు ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి సీనియర్ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి మంత్రి కేటీఆర్ మిత్రుడు, ఎన్నారై జాన్సన్ నాయక్ బరిలో నిలవనున్నారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపే జాన్సన్ గతంలో ఆదిలాబాద్ ఎంపీగా పోటీకి ప్రయత్నించినా.. కుదరకపోవటంతో ఈసారి ఖానాపూర్‌లో పోటీచేయనున్నారు. గత 6 నెలలుగా ఇక్కడ పర్యటిస్తూ క్యాడర్‌కు టచ్‌లో ఉంటున్నారు

సుమారు 2.10 లక్షల ఓట్లున్న ఈ నియోజక వర్గంలో 45 వేల ఓట్లు ఆదివాసీలవే. అలాగే ఈ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి, కడెం, దస్తూరాబాద్, ఖానాపూర్ మండలాలు నిర్మల్ పరిధిలోకి, జన్నారం మండలం మంచిర్యాల జిల్లాపరిధిలోకి వస్తుంది. అయితే.. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలే ఓటింగును ప్రభావితం చేస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో ఇక్కడి బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు లంబాడీ వర్గానికి చెందిన వారే. అయితే.. ముందుకు సాగటం, లంబాడా అభ్యర్థులను ఓటు వేయమని ఆదివాసీ సంఘాలు తీర్మానించటంతో ఈసారి వెడ్మ బొజ్జుకు విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. జనబలంతో, వారి అభిమానంతో నెగ్గి, ఆదివాసీల ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెడతానని ఆయన చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News