సాధారణంగా రైలు ప్రయాణం చేసే సమయంలో చాలా మంది ప్రయాణీకులు రైలు నుంచి మిగిలిపోయిన ఫుడ్ ఐటెమ్స్, వాటర్ బాటిళ్లు, ఇతర చెత్తను బయటకు వేస్తుంటారు. కొన్ని సందర్భంగాల్లో కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రి, పాలిథిన్ సంచులలోని ఉంచి రైళ్లలో నుంచి నదుల్లోకి విసిరేస్తారు. అయితే, తాజాగా రైల్లో నుంచి ఓ ప్రయాణీకుడు విసిరిన కొబ్బరి కాయ తగిలి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ముంబై సమీపంలోని నైగావ్ లో 30 ఏళ్ల వ్యక్తి ట్రాక్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, రైల్లో నుంచి ఓ వ్యక్తి కొబ్బరి కాయను విసిరాడు. అది నేరుగా అతడి తలకు తగిలించింది. తీవ్రంగా గాయపడిన అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు చెప్పి వివరాల ప్రకారం.. మృతుడు వాసాయిలోని పంజు ద్వీపానికి చెందిన సంజయ్ భోయిర్ గా గుర్తించారు. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో నైగావ్ స్టేషన్ వైపు నైగావ్-భయందర్ రైల్వే వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో పక్క నుంచి వెళ్తున్న రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి విసిరిన కొబ్బరికాయ నేరుగా అతని తలకు తగిలింది. “భోయిర్ కు కొబ్బరి బోండాం తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వాసాయిలోని సర్ డిఎం పెటిట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతడిని ముంబై ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం అతడు చికిత్స పొందుతూ చనిపోయడు”అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు మొదలుపెట్టినట్లు వెల్లడించారు.
Read Also: ఏకంగా రైల్లోనే బట్టలు ఆరేశాడు, నువ్వు ఓ వర్గానికి ఇన్ స్ప్రేషన్ బ్రో!
అటు ఈ ఘటనపై పంజు ఐలాండ్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగినట్లు చెప్తున్నారు. ప్రయాణీకులు తరచుగా కొబ్బరి కాయలు, ఇతర పూజా సామాగ్రిని, విగ్రహాలను పాలిథిన్ కవర్లలో ఉంచి కదిలే రైళ్ల నుంచి నదుల్లోకి విసిరేస్తారని వెల్లడించారు. “రైళ్ల నుంచి విసిరిన వస్తువుల వల్ల గతంలో చాలా మంది గ్రామస్తులు గాయపడ్డారు. ఇలా రైళ్లలో నుంచి వస్తువులను విసిరివేయడాన్ని రైల్వే పరిపాలన అధికారులు నిషేధించాలి. అంతేకాదు, నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేయాలి. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ఈ విమానాలు ఎక్కితే ప్రాణాలకు నో గ్యారెంటీ, ఎప్పుడు ఏమైనా జరగొచ్చు!