Hyderabad News: హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం మోతీనగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇకపై ఇందిరమ్మ క్యాంటీన్‌లలో ఐదు రూపాయలకే బ్రేక్‌ఫాస్ట్, భోజనం లభించనుంది. ఒక్కసోమవారం 12 ఇందిరమ్మ క్యాంటీన్‌ల ప్రారంభించారు.
తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 29న అంటే సోమవారం హైదరాబాద్‌లోని మోతినగర్, ఖైరాతాబాద్ మింట్ కంపౌండ్ వద్ద వాటిని ఓపెన్ చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేశారు. ఆయనతోపాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వయంగా పాల్గొని వివిధ రకాల టిఫిన్లను ప్రజలకు వడ్డించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, బ్రేక్ ఫాస్ట్‌లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్లేట్ టిఫిన్ తయారీకి 19 రూపాయలు అవుతుందని, కానీ ప్రభుత్వం కేవలం ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇదే టిఫిన్ బయట తినాలంటే 30 నుంచి 50 రూపాయలు పైమాటే.
ఐదు రూపాయల బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని 150 కేంద్రాల్లో అమలు చేయనుంది. తొలి విడత 60 కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత సిటీ వ్యాప్తంగా విస్తరించనుంది. ఆయా కేంద్రాల ద్వారా ప్రతీ రోజు 25 వేల మందికి టిఫిన్స్‌ని అందించనుంది జీహెచ్ఎంసీ.
ALSO READ: ఐదు దశల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు
బ్రేక్ ఫాస్ట్ మెనూ విషయానికొద్దాం. ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరి, పొంగల్ ఉండనుంది. రోజుకో వెరైటీ ఉండనుంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్, భోజనాలు అందించేందుకు హరికృష్ణా ఫౌండేషన్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. క్యాంటీన్లకు ఆదివారం రోజు సెలవు.
రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్‌కు ప్రతీ రోజూ లక్షలాది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. 2013లో ఈ పథకాన్ని కాంగ్రెస్ మొదలుపెట్టింది. రూ.5కే భోజన పథకాన్ని తొలిసారి నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద ప్రారంభించింది ప్రభుత్వం. ఆ తర్వాత రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు, అడ్డా కూలీలు ఉండే ప్రాంతాల్లో వీటిని విస్తరించింది.
హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం
మోతీనగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే బ్రేక్‌ఫాస్ట్, రూ.5కే భోజనం
నేడు హైదరాబాద్‌లో 12 ఇందిరమ్మ క్యాంటీన్‌ల ప్రారంభోత్సవం pic.twitter.com/xdJaOx1Aya
— BIG TV Breaking News (@bigtvtelugu) September 29, 2025