
Deepa Danam : పౌర్ణిమ చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది. కార్తీకమాసమంటేనే దీపాలకు ప్రత్యేక మాసం. ఎన్నిదీపాలను వెలిగిస్తే అంత మంచిది. మాములు రోజుల్లో వెలిగించే దీపాల కన్నా కార్తీక మాసంలో వెలిగించే దీపాలు ఎంతో పుణ్యప్రదం.
కార్తీక మాసంలో దానాలకు చాలా విశిష్టత ఉంది. మనకు పురాణాల్లో 16 రకాల దానాలు ఉన్నాయి. గోదానం, అన్నదానంలాంటివి చాలామంది చేస్తారు. కానీ వీటన్నింటి కంటే దీపాదానం చేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయి. దీపాదానం చేయడం సంతానాభివృద్ధి , సత్ససంతానం, ఉన్న సంతానం వృద్ధిలోకి వస్తారు.
కార్తీకపురాణం చెబుతోంది. ఒక మహారాజు తనకు సంతానం లేక ఎంతో మథన పడుతూ పరమేశ్వరుడ్ని వేడుకునేందుకు సంసిద్దుడయ్యాడు. అప్పుడు ఒక మునీశ్వరుడు ప్రత్యక్షమై ఓ రాజా.. బ్రాహ్మణులను కానీ, పరమేశ్వరుడ్ని కానీ సంతృప్తి పరిచే పని చేస్తే మేలు జరుగుతుందని సంతాన ప్రాప్తి జరుగుతుందని చెబుతారు.
వెంటనే రాజు శివారాధన చేసి పిండిదీపాల్లో ఆవు నెయ్యితో వెలిగించి బ్రాహ్మణులకు దానం చేస్తాడు. తత్ఫలితంగా మహారాజుకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈవిధంగా కార్తీక పురాణంలో దీపాదనం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతోంది. దీపదానం చేయడం వల్ల యశో వృద్ధి, ఆదాయ వృద్ధి, ఆరోగ్య వృద్ధి , విద్యా వృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. గోధుమ పిండితో కానీ వరి పిండితో కానీ దీపాన్ని తయారు చేసి అందులో ఆవునెయ్యి ఒత్తి వెలిగించి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. గుడిలో ఇవ్వొచ్చు లేదా బ్రాహ్మణుల ఇంటికి వెళ్లి ఇవ్వచ్చు. దీపాన్ని వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా చేయచ్చు. దీపదానంలో చేసేటప్పుడు వెలిగించే ఒత్తితో పత్తితో చేయాలి. గుడ్డ ఒత్తులు కానీ వాడకూడదు. బ్రాహ్మణుడికి ఒక రోజు భోజనానికి అవసరమయ్యే సొమ్మును దక్షిణగా ఇవ్వాలి.
కార్తీక శుద్ద ఏకాదశి నుంచి కార్తీక పూర్ణమి వరకు ఉండే ఐదు రోజులలో దీపదానం చేయడం చాలామంచిది. ఇలా చేయడం వల్ల కార్తీక మాసంలో మనం తెలిసీ , తెలియక చేసే పాపాలు తొలగిపోతాయి. ముత్తైదువులకు కూడా దీప దానం ఇవ్వవచ్చు లేదా ఆలయంలో స్వామి సన్నిధానంలో లేదా ధ్వజ స్తంభం వద్ద దీపారాధన చేయడం కూడా దీప దానమే.