Vijayanagaram TDP: విజయనగరం జిల్లా టీడీపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? ఇప్పటి వరకు ఈ ప్రశ్నకు సమాధానంపై ఒక్కొక్కరిది ఒక్కో వర్షన్. ఇప్పటివరకు పార్లమెంటరీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు. ఆయన సారథ్యంలో జిల్లాలో అన్ని స్థానాలను కూటమి గెలుచుకుంది. చీపురుపల్లి టీడీపీ టికెట్ విషయంలో నాగార్జునకు హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన డీసీసీబీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే పార్టీ సంస్థాగత మార్పుల పేరుతో ఆయన్ని పార్టీ పదవికి కూడా దూరం చేస్తుందా? లేక ఆయనవైపు మళ్లీ మొగ్గు చూపుతుందా?
విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి అధిష్టానం మల్లి కిమిడి నాగార్జున వైపే మొగ్గు చూపుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల గత కొన్ని రోజులుగా జిల్లాలో అధ్యక్ష పదవి మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎవరికి వారు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కొందరు సీనియర్ నాయకులు తమకంటే తమకే కేటాయించాలని అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే తమను తాము ప్రూవ్ చేసుకుంటామని చెబుతున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్నామని జిల్లా స్థాయి పోస్టు ఇంతవరకు తమ వరకు రాలేదని, ఇప్పటికైనా ఆ అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ పోస్టు విషయంలో గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, సీనియర్ నేతలు కంది చంద్రశేఖర్, సువ్వాడ రవి శేఖర్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు కిమిడి నాగార్జునను మించి… పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్న ఆశావహులు ఏ మేరకు పని చేయగలరన్న సందేహనికి అధిష్టానానికి సమాధానం దొరకడం లేదట.
కిమిడి నాగర్జున మాత్రం ఎవరు జిల్లా అధ్యక్షుడైనా.తన సహాయ సహకారాలు ఉంటాయని.. పార్టీ కోసం పని చేయడంలో వెనకడుగు వేసేది లేదని ఇప్పటికే అధిష్టానం వద్ద కుండ బద్దలు కొట్టేసారట. అయితే రెండోసారి ఈ పదవిని చేపట్టడానికి నాగార్జున కూడా సిద్ధంగా లేరన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే డీసీసీబి చైర్మన్‌గా ఉన్న నాగార్జునకు రెండు పదవులు అవసరమా అనే విమర్శ కూడా వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే తిరస్కరిస్తున్నారట. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాస్త నెమ్మదిగా ఉండడం కూడా ఈ తర్జనభర్జనకి మరో కారణంగా తెలుస్తోంది. అధినేత చంద్రబాబు సూచించినట్లు మంత్రి కొండపల్లి స్పీడ్ పెంచితే మాత్రం అధ్యక్షుడు ఎవరైనా పార్టీకి ఇబ్బంది ఉండకపోవచ్చు.
ప్రస్తుతానికి జిల్లాలో ప్రతిపక్ష వైసీపికి ధీటుగా బదులిచ్చే నాయకుడిగా నాగార్జున మాత్రమే కనిపిస్తున్నాడు. ఇటీవల పైడితల్లి వేదికగా బొత్స సత్యనారాయణకి జలక్ ఇవ్వడం కాకుండా వైసీపి విమర్శలకు కూడ ధీటుగా సమాధానం ఇచ్చి భళా అనిపించుకున్నాడు. ఈ ఒక్క విషయంలో మాత్రమే కాకుండా గత అయిదేళ్లలో కూడా అధికార వైసీపిని నాగార్జున దీటుగా ఎదుర్కొన్నారు. బొత్స, అతని మేనల్లుడు చిన్న శ్రీను ఇద్దరినీ కౌంటర్ ఎటాక్ చేయడంలో నాగార్జున సక్సెస్ అయ్యారనే టాక్ కూడా ఉంది.
ఇదిలా ఉంటె ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత కూడా జిల్లలో స్పీడ్ పెంచారనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఇంచార్జ్ మంత్రి అయినప్పటికీ సొంత జిల్లా అన్నట్లుగానే ఆమె దూసుకుపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కొండపల్లి శ్రీనివాస్ మెతక వైఖరి అవలంబించడం కూడా అనితకు కలిసోస్తుందనే టాక్ వినిపిస్తోంది. కొండపల్లి దూకుడు పెంచితే అనితకు ఈ అవకాశం ఉండేది కాదు.. మరోవైపు అధికారికంగా అనిత దూకుడు, పార్టీ పరంగా కిమిడి నాగర్జున దూకుడు ప్రస్తుతం రాజకీయంగా టీడీపీకి కలిసి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి టైంలో అధ్యక్షుడు మార్పు జరిగితే ఇప్పటికే మంత్రి కొండపల్లి దూకుడుగా లేకపోవడం, కొత్త అధ్యక్షుడు కూడా మెతక వైఖరి అవలంబిస్తే పార్టీ పరిస్థితి ఏమిటని మల్లగుల్లాలు పడుతందట అధిష్టానం. బొత్స, మేనల్లుడు చిన్న శ్రీనులను తట్టుకొని నిలబడాలంటే దూకుడు స్వభావం ఉన్న నాయకులూ ఇపుడు టీడీపీకి ఎంతైనా అవసరం. ముఖ్యంగా అధికారంలో ఉండడం, సరైన రీతిలో కౌంటర్ ఎటాక్ చేయకపోతే ప్రభుత్వానికి నెగటివ్‌గా మారే అవకాశం కూడా ఉండనుంది . సో ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స వేగానికి బ్రేకులు వేయగలిగే నాగార్జున బెటర్ అనేది టీడిపి ఆలోచనగా వాదనలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ పెట్టిన టీడీపీ హైకమాండ్.. జిల్లాకు సంబంధించి పరిశీలకులను పంపి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ క్రమంలో పార్టీనేతల్లో ముఖ్యంగా ఆశావహుల్లో టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఏదేమైనా అధికార పార్టీ టీడీపీకి విజయనగరం జిల్లాలో రథసారధి ఎవరనేదానిపై స్పష్టత లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది.
Story by Vamshi, Big Tv