Actor Death: గత కొంతకాలంగా చిత్రసీమలో వరుస శుభవార్తలే కాదు వరుస విషాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అభిమాన సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఇంకొంతమంది తల్లిదండ్రులవుతున్నారు. ఇక్కడ మరికొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తున్నారు. ఇలా తమ అభిమాన నటీనటులు అనారోగ్య సమస్యలతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకొంతమంది వృద్ధాప్య సమస్యలతో మరణిస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసిన కేజీఎఫ్ నటుడు కన్నుమూశారు.
ఆయన ఎవరో కాదు హరీష్ రాయ్ (Harish Rai).. ప్రశాంత్ నీల్ (Prashanth Neel).దర్శకత్వంలో యష్ (Yash) హీరోగా వచ్చిన కే జి ఎఫ్ – 1 సినిమాలో హీరోకి బాబాయి పాత్రలో.. అంటే ఛాఛా అనే పాత్రలో హీరోకి అత్యంత సన్నిహితుడిగా నటించిన హరీష్ రాయ్ కన్నుమూశారు. కేజీఎఫ్ రెండవ పార్ట్ విడుదలయ్యే నాటికే ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అది నాలుగో స్టేజ్ కి చేరడంతో పూర్తిగా బక్కచిక్కిపోయారు. ఆర్థిక సహాయం కోసం సెలబ్రిటీలను ఆశ్రయించిన ఈయనకు.. ధ్రువ సర్జ ఆర్థిక సహాయాన్ని అందించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి జారడంతో హరీష్ రాయ్ కన్నుమూశారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. అభిమానులు సైతం కన్నీటి పర్యంతం అవుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
ALSO READ:Kaantha: ఊదేయడానికి దుమ్ము కాదు.. నేనొక పర్వతం.. కాంత ట్రైలర్ రిలీజ్!
కే జి ఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న హరీష్ రాయ్ గతంలో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “గత మూడు సంవత్సరాలుగా నేను గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాను. ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. అందుకే నాకు గొంతు క్యాన్సర్ ఉందనే విషయాన్ని రహస్యంగా ఉంచాను. నాకు క్యాన్సర్ ఉందనే విషయం చెబితే అవకాశాలు రావని అలా చేశాను. కే జి ఎఫ్ సినిమాలో గుబురు గడ్డంతో నటించడానికి ఇది కూడా ఒక కారణం. సినిమాలు విడుదల అయ్యే వరకు వేచి చూశాను. ప్రస్తుతం క్యాన్సర్ నాలుగో దశలో ఉంది.అభిమానులను.. ఇండస్ట్రీలోని వాళ్లను సహాయం అడగాలి అనుకున్నాను. ఆర్థిక సహాయం కోరాలనుకున్నాను.. అందుకే వీడియో కూడా రికార్డు చేశాను. కానీ ఆ వీడియోని పోస్ట్ చేయడం ఇష్టం లేక వదిలేసాను” అంటూ గతంలో ఆయన తన బాధను చెప్పుకొచ్చారు. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. దీంతో ధృవ సర్జ స్పందించి కొంతవరకు ఆర్థిక సహాయం చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది.
ఇకపోతే గతంలో ఓం, నల్ల వంటి చిత్రాలలో పవర్ఫుల్ విలన్ పాత్రలు పోషించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు క్యాన్సర్ తో బాధపడుతూ తుది శ్వాస విడవడాన్ని సినీ సెలబ్రిటీలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈయన మరణానికి సంతాపం తెలియజేస్తూ.. వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.