Rajamohan Reddy: నిజం వేరు.. భజన వేరు.. నిజం చేదుగా ఉన్న వినాలి.. భజన బాగుంది కదా అదే వింటూ కూర్చుంటే.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పట్టిన గతే పడుతుందంటున్నారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. కోటరి కారణంగా ఇప్పటికే తప్పు జరిగింది.. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తే ఇక పార్టీ గతి అదోగతి అంటూ హితవు పలుకుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? మరి ఆయన కామెంట్స్‌ను జగన్ వింటారా? లేక మేకపాటిని పార్టీ నుంచి దూరంగా పెడతారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై మాట్లాడుతూ రాజమోహనరెడ్డి చేసిన కామెంట్స్ అటు వైసీపీలోను.. ఇటు ఏపీ పొలిటిక్ సర్కిల్స్‌లోను చర్చకు దారితీశాయనే చెప్పాలి.
మాజీ సీఎం జగన్‌కు వాస్తవాలు చెప్పకుండా, ఆయన చుట్టూ చేరినవారంతా భజన చేస్తున్నారా..? అధికారంలో ఉన్న సమయంలో నేతలను కలవకుండా జగన్ చుట్టూ ఉన్న నాయకులు అడ్డుకున్నారా? ఇలాంటి ప్రశ్నలకు చాలా మంది ఓపెన్‌గానే ఔననే సమాధానం ఇచ్చారు చాలా మంది వైసీపీ నేతలు. అసలు వైసీపీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమే.. జగన్ చుట్టూ ఉన్న కోటరినే అనే చర్చ జరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్ధితులను జగన్‌కు చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని.. తమ గోడును జగన్ దగ్గరకు చేరే మార్గం లేకుండా కొందరు నేతలు చేశారని.. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామంటూ.. చాలా మంది నేతలు కామెంట్స్ చేశారు. ఇప్పుడీ లిస్ట్‌లో చేరిపోయారు నెల్లూరు ఎంపీగా పనిచేసిన రాజమోహనరెడ్డి. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో మాత్రం చర్చనీయాంశంగా మారాయి.
తన కుమారుడు, దివంగత నేత గౌతంరెడ్డి వర్థంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చుట్టూ ఉన్నవారే కారణమనే విధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయనేది ఫ్యాన్ పార్టీ నేతల మధ్య నడుస్తున్న చర్చ. జగన్ చుట్టూ ఉండే నాయకులు క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన నిర్దేశం చేయడం లేదని చెప్పకనే చెబుతున్నారు మేకపాటి. ఆయన చుట్టూ ఉన్న వారి భజనకు ఆకర్షితుడై ప్రజలకు జగన్ దూరమయ్యారని అభిప్రాయపడుతున్నారు.
గత ఎన్నికల్లో ప్రజలు పార్టీని ఎందుకు తిరస్కరించారన్న విషయమై మాజీ సీఎం జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నారు మేకపాటి. ఓటమికి కారణాలను విశ్లేషించి, పార్టీ చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలని మాజీ ఎంపీ మేకపాటి కోరారు. వైసీపీలో అధినేత పనితీరులో తప్పులు ఎత్తి చూపడానికి, ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చెప్పడానికి వెనుకాడని ఎందరో నాయకులు ఉన్నారన్న మేకపాటి వారికి ఆ అవకాశం దక్కడం లేదని భావిస్తున్నారు. దురదృష్టవశాత్తూ జగన్ చుట్టూ ఉన్న నేతలు తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా… ఆయన మెప్పు కోసం భజన చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్ ను తప్పుదారి పట్టిస్తున్న నేతలతో చాలా ప్రమాదకరమని, అలాంటి వారిని నమ్మొద్దని హితవు పలికారు. జగన్ తన తప్పులను సరిదిద్దుకోవాలని, ఇందుకు చేసిన తప్పులు అంగీకరించాల్సివుందని మాజీ ఎంపీ మేకపాటి స్పష్టం చేశారు.
మేకపాటి ఇస్తున్న మరో అమూల్యమైన సలహా ఏంటంటే.. ప్రజలు చదువుకొంటున్నారని, చైతన్యవంతులవుతున్నారని ఇలాంటి సమయంలో జగన్‌కు భజనలు చేసుకుంటూ ఆయన మెప్పు కోసం ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదంటున్నారు. పద్దతిగా నడుచుకోవాలని వారికి సూచించారు. ఏ పార్టీకైనా, నాయకుడికైనా అప్పుడే గుర్తింపు వస్తుందని భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే ఇలాగే కొనసాగితే పార్టీ పరిస్థితి అధోగతే అని చెప్పకనే చెబుతున్నారు. అలాగే వైసీపీ నేతల్ని బూతులు మాట్లాడొద్దంటూ మేకపాటి సూచించారు.
మేకపాటి ఇంత హఠాత్తుగా ఇలా గళం విప్పడం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఆచితూచి మాట్లాడే నేతగా పేరున్న మేకపాటి.. మాములుగా వివాదాల జోలికి పోరు. అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విధేయత కంటే భజనపరులకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారనే ఆగ్రహంతో మేకపాటి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే చర్చ కూడా ఉంది.
మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఉంటే ప్రస్తుత వైసీపీ వ్యవహారాలు, పార్టీ నేతల తీరుపై చిరాకేసినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆయన జగన్ రెడ్డి మంచినే కోరుకుంటున్నారు. అందుకే రాజకీయాలను రాజకీయాలుగా చేయాలని సలహా ఇస్తున్నారు. కానీ ఇలాంటి సలహాలు జగన్‌కు నచ్చవనే చర్చ నడుస్తోంది. మేకపాటి టీడీపీకి అమ్ముడుపోయారని అనుకుంటారనే చాలా మంది భావిస్తున్నారు. ఇలాంటి సలహాలు వైసీపీకి ఇవ్వడం అంటే.. పార్టీకి దూరం కావడమే అనే చర్చ కూడా ఉంది. పెద్దాయనగా గౌరవిస్తారని మేకపాటి ఆశపడ్డారేమో కానీ.. ఇలాంటి సలహాల వల్ల ఆయనను పార్టీలో మరింత దూరం పెడతారని చేవులు కొరుక్కుంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.
జగన్ క్షేమాన్ని కోరుకునేవాళ్లు, మేధావులు, నిజాయితీపరులు, వాస్తవాలను చెప్పేవారు పార్టీలో లేడని మేకపాటి చెబుతున్నారు. మరి ఇప్పటికైనా జగన్ ఈ వ్యాఖ్యలను ఎలా రిసీవ్ చేసుకుంటారు? మేకపాటి వ్యాఖ్యలను ఎప్పటిలాగానే లైట్ తీసుకుంటారా? లేక ఆత్మ పరిశీలన చేసుకుంటారా? పార్టీలో జగన్ క్షేమం కోరేవారు లేరని చెబుతున్న వ్యాఖ్యలను ఆలకిస్తారా? అనేది చూడాలి.
Story by Vamshi, Big Tv