Karthika Masam 2025: కార్తీక మాసం వచ్చిందంటే మన హిందూ సంప్రదాయంలో భక్తి, పవిత్రత, పుణ్యకాలం మొదలైనట్టే. ఈ నెలలో ప్రతి ఉదయం పవిత్ర నదుల్లో స్నానం చేసి, సాయంత్రం దీపాలను వెలిగించడం అత్యంత పుణ్య కార్యమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసం దేవతలకి అత్యంత ప్రీతికరమైన కాలం. ముఖ్యంగా మహాదేవుడు శివుడు, శ్రీహరి విష్ణువు ఈ నెలలో పూజలు స్వీకరించి అపారమైన కృపను ప్రసాదిస్తారని భక్తులకు విశ్వాసం.
కార్తీక మాసంలో దీపం ఎప్పుడు వెలిగించాలి?
కార్తీక మాసంలో సాయంత్రం దీపం వెలిగించడం చాలా ముఖ్యమైనది. దీపం అంటే కేవలం వెలుగు కాదు, అది అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన కాంతి. ఆ కాంతి మనలోని చెడు భావాలను, చీకటిని పారద్రోలుతుంది. ఆధ్యాత్మికంగా ఈ దీపం మన ఆత్మను దేవుని వైపు నడిపించే సంకేతం. అందుకే ఈ కాలంలో భక్తులు ప్రతి సాయంత్రం దీపం వెలిగించడం పవిత్రంగా భావిస్తారు.
నారికేళ దీపం ప్రత్యేకత
ఈ దీపాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది నారికేళ దీపం, అంటే కొబ్బరికాయతో వెలిగించే దీపం. ఈ దీపం కేవలం ఒక ఆచారం కాదు, అది శివభక్తిలోని లోతైన అర్థాన్ని చూపించే ఆధ్యాత్మిక సాధన. కొబ్బరికాయను మన భారతీయ సంప్రదాయంలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతి పూజలోనూ, హోమంలోనూ కొబ్బరికాయ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దానిని రెండుగా చేసి అందులో వున్న నీటిని తీసి దీపంగా తయారు చేసి శివునికి సమర్పించడం అంటే మనలోని అహంకారం, ఆశ, లోకాసక్తులను విడిచి, మన ఆత్మను దైవ కాంతిలో లీనమయ్యేలా చేయడం. ఈ దీపం వెలిగించినప్పుడు మన మనసు శాంతిస్తుంది, మన హృదయం పవిత్రమవుతుంది.
నారికేళ దీపం ఎప్పుడు వెలిగించాలి?
కార్తీక మాసంలో ఈ దీపం ఎప్పుడు వెలిగించాలో కూడా ప్రత్యేకంగా చెప్పబడింది. సోమవారాలు, ప్రదోషకాలం ఈ దీపానికి అత్యంత పవిత్ర సమయంగా భావిస్తారు. ఆ సమయాల్లో నారికేళ దీపం వెలిగిస్తే శివానుగ్రహం పొందవచ్చని విశ్వాసం ఉంది. ఇంటి పూజా మందిరంలో లేదా శివాలయంలో దీపం వెలిగిస్తే ఇంట్లో శాంతి, సౌఖ్యం, ధన సమృద్ధి వృద్ధి చెందుతాయని పండితులు చెబుతున్నారు.
Also Read: Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్.. ఫోటో లవర్స్, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్..
దీపం వెలిగించే ముందు ఇలా చేయండి?
దీపం వెలిగించే ముందు స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. మనసును ప్రశాంతంగా ఉంచి, పూజా స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. కొబ్బరికాయను కడిగి, పైభాగాన్ని తీసివేయాలి, తరువాత లోపలి నీటిని తీసివేయాలి, తరువాత సగం వున్న కొబ్బరి చిప్పలో నూనె పోసి పత్తి వత్తిని ఉంచి దీపం వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో ఓం నమశ్శివాయ మంత్రాన్ని భక్తితో జపించడం అత్యంత శ్రేష్ఠం. దీపం వెలిగించి దానిని ఆర్పకూడదు. అది స్వయంగా ఆరిన తరువాత మాత్రమే తీసేయాలి. దీపం ఆరిన తరువాత కొబ్బరి చిప్పలను చెత్తలో వేయకూడదు. ఎందుకంటే, అవి పవిత్రమైనవి కాబట్టి చెట్టు మూలంలో కాస్త మట్టిన తీసి గుంతలా చేసి దీపంలా కాల్చిన కొబ్బరి చిప్పలను పెట్టి దానిపై మట్టిని వేసి పూడ్చడం శుభప్రదంగా భావిస్తారు.
దీపం వెలిగిస్తే ఏమి జరుగుతుంది..
ఈ దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు అపారమైనవి. మన పాపాలు తొలగిపోతాయి, మన ఆత్మ పవిత్రంగా మారి దైవ కాంతితో నిండిపోతుంది. శివసుగ్రహం లభించి కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. జీవితంలో అడ్డంకులు తొలగి, మనసులో శాంతి, ధ్యాన స్థితి ఏర్పడుతుంది.
శివుని స్మరణలో లీనమై
నారికేళ దీపం అంటే మన ఆత్మలోని వెలుగును వెలిగించడం. కొబ్బరికాయ మన మనస్సు అయితే, అందులో వెలిగే దీపం మన జ్ఞానరూప దేవుడు. ఆ వెలుగు మనలోని చీకటిని పారద్రోలుతుంది, మనలోని అజ్ఞానం తొలగిస్తుంది. అందుకే పెద్దలు చెబుతారు, కార్తీక మాసంలో నారికేళ దీపం వెలిగించడం కేవలం పూజ కాదు, అది మన ఆత్మ శుద్ధి, మన భక్తి సాక్ష్యం. ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఒకసారి నారికేళ దీపం వెలిగించి శివుని స్మరణలో లీనమవ్వండి వంటిది. కాబట్టి ఈ నారికేళ దీపం మీ జీవితాన్ని దైవ కాంతితో నింపుతుంది. ఓం నమశ్శివాయ!