Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఇదే. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు ఒడుతారు? అనే దానిపై చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉన్నాయి. అందుకే అధికారపార్టీ ఇక్కడ ఎన్నిక ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గల్లీ లీడర్ నుంచి మొదలు పెడితే సీఎం రేవంత్ రెడ్డి వరకు ఇప్పుడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. కానీ వీరందరిపై ఎప్పటికప్పుడు ఓ నిఘా వేసి ఉంచుతుంది AICC. ప్రచార తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయట. ఇంతకీ ఈ నివేదికల్లో ఏం తేలింది? అసలు ప్రచారశైలిపై హైకమాండ్ రియాక్షన్ ఏంటి?
జూబ్లీహిల్స్ బైపోల్‌ను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే స్థానిక నేతలు, ఇంచార్జ్ మంత్రులతో పాటు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిని బట్టే ఈ బైపోల్‌ను అధికార పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసిందట. ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు… ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఏఐసీసీ నేతలు, కార్యదర్శులు నిఘా పెడుతున్నారని తెలుస్తోంది. ఇంచార్జ్ మంత్రుల నుంచి ఎప్పటికప్పడు రిపోర్ట్ సేకరిస్తున్న పెద్దలు నేతలు పనితీరును ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారట.
మాములుగానే ఈ ఎన్నికను ఇక్కడి నేతలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తమ పాలనకు ఈ ఎన్నిక అద్ధం పడుతుందనే భావనలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికపై ఏఐసీసీ కూడా ఆరా తీస్తుందట. ఇంచార్జ్ మంత్రుల నుంచి లేటెస్టు రిపోర్టును సేకరించింది. ఆ సెగ్మెంట్‌లో ప్రచార సరళి, ఓటర్లను కన్విన్స్ చేసే తీరుపై ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, విశ్వనాధమ్‌లు రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నారు. డివిజన్ల వారీగా కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉన్నదని ఇన్ చార్జ్ మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారట. కొన్ని డివిజన్ల ప్రచారంపై ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.
రూరల్ సెగ్మెంట్‌ల తరహాలో ఇక్కడ పనిచేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని సున్నితంగానే ఇన్ ఛార్జ్ మంత్రులకు సూచన చేసినట్లు సమాచారం. అర్బన్ ఓటర్లు ఆకట్టుకునే విధంగా క్షేత్రస్ధాయిలో నేతలు పనిచేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు డివిజన్లలో జరిగిన ప్రచారం తీరు, పార్టీ మైలేజ్, అభ్యర్ధి గ్రాఫ్ వంటి వివరాలను వెంటనే ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి కోరినట్లు తెలిసింది. వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించ వద్దని నేతలకు నొక్కి చెప్పారట పార్టీ పెద్దలు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రులు చొప్పున పనిచేస్తున్నారు. మంత్రులతో పాటు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ టీమ్స్, 35 మంది కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మరి కొంత మంది క్రీయాశీలక కార్యకర్తలూ పనిచేస్తున్నారు. నేతలంతా డివిజన్‌లలో విస్తృతంగా ప్రచారం చేయాలని అటు సీఎంతో పాటు పార్టీ అధినాయకత్వం కూడా సూచనలు చేస్తున్నారు. అయితే కొన్ని డివిజన్లలో పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదనే సమాచారంతో.. ప్రచారం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఏఐసీసీ నుంచి వచ్చిన నేతలు సూచించినట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు డివిజన్లలో ఏం చేశారు? ఎంత మంది ఓటర్లను కలిశారు? వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అనే అంశాలపై ప్రతి ఒక్క ఇంచార్జ్ నుంచి సమాచారం తీసుకుంటున్నారట.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నిక ఫలితం, ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయానికి నిదర్శనంగా ఉంటుందని భావిస్తున్నది అధిష్ఠానం. ఇక్కడ గెలుపు కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు నేతలు. క్షేత్రస్థాయి ప్రచార సరళి, పార్టీ నేతల పనితీరుపై కఠినమైన నిఘా ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రచారంలో రోడ్ షోలు కంటే గడపగడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకు సాగాలని ఏఐసీసీ సెక్రటరీ సూచించారు. మరోవైపు ఏఐసీసీ కేవలం నివేదికలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు, ఓటర్లను కన్విన్స్ చేసే తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న విధానంపై కార్యదర్శులు స్వయంగా నిఘా పెడుతున్నారట.
ప్రతి డివిజన్‌లో పార్టీ పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, ప్రచారం తీరుపై అధిష్ఠానం ప్రతి గంటకు అప్‌డేట్‌లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నగర ఓటర్ల దృష్టిని ఆకర్షించే సామాజిక మాధ్యమాలు, ఇంటింటి ప్రచారంపై మరింత దృష్టి పెట్టాలని కార్యదర్శులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Story by Vamshi, Big Tv