Sangareddy News: ప్రతీ మనిషికి రకరకాల సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా జంతువుల విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినా సరే ఒక్కోసారి వాటి విషయంలో భయం వారిని అనుక్షణం వెంటాడుతుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చీమల ఫోబియాతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
వివాహితకు చీమల ఫోబియా
సంగారెడ్డి జిల్లాలో పటాన్‌చేరు నియోజకవర్గంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శర్వా హోమ్స్‌లో శ్రీకాంత్-చంద్రమోహన్ మనీషా నివాసం ఉంటున్నారు. ఈ జంటకు నాలుగేళ్ల కూతురు ఉంది. అయితే మనీషాకు చీమల భయం ఎక్కువ. ఆ సమస్యతో ఆమె నిత్యం బాధపడేది. ఇంటి సమస్యల కన్నా, చీమల ఫోబియా ఆమెని అనుక్షణం వెంటాడేది.
మనీషా పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించారు. అయినా ఆమెకి ఆ ఫోబియా ఏ మాత్రం తగ్గలేదు. వీటి కారణంగా బిక్కుబిక్కుమంటూ గడిపేది. ఈ సమస్యను తనను వదలదని భావించింది. చావు ఒక్కటే పరిష్కారమని భావించింది. అయితే భర్త శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనీషా చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
నావల్ల కాదంటూ ఆత్మహత్య
శ్రీకాంత్ ఇంటికి వచ్చేసరికి బెడ్‌రూమ్ డోర్ లాక్ పెట్టింది. అనుమానం వచ్చి స్థానికుల సాయంతో ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది మనీషా. ఆ సన్నివేశాన్ని చూసి షాకయ్యాడు శ్రీకాంత్. కాసేపు నోటివెంట మాట రాలేదు. స్థానికుల సాయంతో భార్యని కిందకు దించాడు. ఆ రూమ్‌లో ఓ నోట్ బుక్‌లో లేఖ లభ్యమైంది.
శ్రీవారు.. ఐయాం సారీ, చీమలతో బతకడం నావల్ల కావడం లేదు. కూతుర్ని జాగ్రత్త. అన్నవరం-తిరుపతి-ఎల్లమ్మ మెుక్కులు తీర్చాలని అందులో రాసి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ALSO READ: సహజీవనం.. డ్రగ్స్ తీసుకున్న జంట, ఓవర్ డోస్‌తో ఒకరు మృతి
చీమల ఫోబియా అంటే ఏమిటి? చీమల భయం అనేది కేవలం మానసిక ఆందోళన. చీమల కుట్టడం పట్ల విపరీతమైన భయం పెరుగుతుంది. ఆ తర్వాత వాటిని చూసినప్పుడు ఆ భయం కంటిన్యూ అవుతుంది. దీనివల్ల రకరకాల సమస్యలు వెంటాడుతాయని అంటున్నారు. ఒక్కోసారి డిప్రెషన్‌కు దారి తీయవచ్చని అంటున్నారు నిపుణులు.