BigTV English

Guru Nanak Jayanthi : నేడే.. గురునానక్ జయంతి

Guru Nanak Jayanthi : నేడే.. గురునానక్ జయంతి
Guru Nanak Jayanthi

Guru Nanak Jayanthi : మానవులను ధర్మమార్గంలో స్థిరపరచడానికి, గురువుకు ఉత్తమ ఉదాహరణగా నిలిచేందుకు గురునానక్ ఈ భూమ్మీద అవతరించారు. సర్వమానవ సమానత్వం, ‌మానవతా విలువలు, పరమత సహనాలే పునాదులుగా నానక్ సిక్కు ధర్మాన్ని ప్రతిపాదించారు. గురుశిష్య సంబంధాలను, ప్రేమతత్వాన్ని, ధర్మపరిరక్షణను పటిష్ఠ పరుస్తూ రూపొందించిన ఆ మతం… నేటికీ సజీవంగా కొనసాగుతోంది.


నేటి పాకిస్తాన్‌లోని రావీ నదీతీరంలోని నానక్‌ ‌సాహిబ్‌లో ఓ హిందూ సంప్రదాయ కుటుంబంలో 1469లో కార్తీక పౌర్ణమి నాడు నానక్ జన్మించారు. ‌నానక్‌ ‌తండ్రి మెహతా కాలూచంద్‌ ‌ఖత్రీ, తల్లి తృప్తాదేవి. బీబీ నాన్కీ అనే అక్క. తమ్ముడిలోని దైవత్వాన్ని తొలుత అక్కగానే గుర్తించనట్లు చెబుతారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక భావాలు కలిగిన నానక్ దైవనామస్మరణలో మునిగి తేలేవాడు. ప్రశ్నించే స్వభావం, ఆలోచించే సామర్థ్యం గల నానక్‌ను కుటుంబ వ్యాపారంలో పెట్టేందుకు చేసిన తండ్రి ప్రయత్నాలు ఫలించలేదు.

28 ఏళ్ల వయస్సులో ఒక రోజు ఉదయం నదీస్నానం, ధ్యానానికి వెళ్లిన నానక్‌ ‌గురించి మూడు రోజుల వరకు జాడలేదు. తిరిగి వచ్చాక ‘దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను’ అని ప్రకటించారు. ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులైన నానక్.. ఇల్లు విడిచి కబీర్‌, రవిదాస్‌ వంటి అనేక గొప్ప గురువులను కలిసి తన సందేహాలను నివృత్తి చేసుకోవటం ప్రారంభించారు.


ఈ కాలంలోనే హిందూ, ఇస్లామిక్ గ్రంథాలను అధ్యయనం చేసి ఆధ్యాత్మిక విషయాల పట్ల లోతైన అవగాహన సాధించారు. లోకంలోని మూఢాచారాలను మతం పేరిట జరిగే అనాచారాలుగా భావించి వాటిని వ్యతిరేకించారు. అన్ని మతాల్లోని మంచిని క్రోడీకరించి, సులభమైన పద్ధతిలో అందరూ అమలు చేసేలా సరికొత్త మతాన్ని ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఆయనను అనుసరించేవారంతా సిక్కులుగా గుర్తించబడ్డారు.

నిజానికి.. ‘సిక్కు’ అనే మాట సంస్కృతంలోని ‘శిష్య’ అనే పదం నుంచి వచ్చింది. శిష్యునికి గురువే దైవం అన్నట్లుగా.. సిక్కు సంప్రదాయంలో గురువాక్కును అనుసరించి, ఆయన ఆదేశాలను, ఆశయాలను ముందుకు తీసుకుపోవటమే ప్రధాన నియమం. సాటి మనిషిలోని మానవత్వమే పరమాత్మ తత్వం అనే భావనను నానక్ బోధించారు. దేవుడు ఒక్కడేనని, అందరిలో, అన్నింటిలో ఉన్న ఆయనను చూసేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.

మానవులందరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడని, తోటివారి ప్రేమను పొందగలిగినవారే భగవంతుడిని చూడగలరనే సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా బోధించేందుకు నానక్.. నాలుగుసార్లు ప్రపంచ యాత్రలు చేశారు. వీటిని ‘ఉదాసీ’ యాత్రలు అంటారు.

కష్టించి, న్యాయమార్గంలోనే ధనాన్ని ఆర్జించాలి. నిజాయితీగా ఆర్జిస్తూ అవసరార్థులను ఆదుకోవాలని నానక్‌ ‌బోధించారు. పనిచేసే వాడికే తినే హక్కు ఉంటుందని ఆనాడే చెప్పారు. సమాజంలో పేరున్నా.. పొలాల్లో పనిచేస్తూ జీవనం సాగించి అందరికి ఆదర్శంగా నిలిచారు. గురుద్వార్‌లలో నేలను తుడవడం, పాత్రలను శుభ్రపరచడం, నీళ్లు మోసుకురావటం వంటివి చేసేవారు. డబ్బు జేబుకే పరిమితం కావాలి తప్ప హృదయానికి తాకకూడదని, ప్రశాంతంగా జీవించాలని చెప్పేవారు.

అందుకే ఆయనకు శ్రీచంద్‌, ‌లక్ష్మీదాస్‌ అనే కుమారులు ఉన్నప్పటికీ గురుపరంపర వారసులుగా వారిని ప్రకటించలేదు. తన శిష్యుడు లెహ్నాను (1538) గురుపీఠం వారసునిగా ఎంపిక చేశారు. లెహ్నా గురు అంగద్‌గా ప్రసిద్ధులు. తరువాతి తరాలు ఆ వారసత్వాన్ని కొనసాగించి ప్రసిద్ధులయ్యారు. తర్వాత వచ్చిన సిక్కుల ఐదవ గురువు అర్జున్‌ ‌తన పూర్వ గురువులు అనుగ్రహించిన సూక్తులను, బోధనలను ‘గురు గ్రంథ సాహిబ్‌’‌గా సంకలనం చేశారు. గురు గ్రంథాన్ని పూజించడం, పఠించడం అంటే గురుపరంను గౌరవించడం, వారి సూక్తిమార్గాన్ని అనుసరించడమే అని సిక్కులు విశ్వసిస్తారు.

తన జీవితంలో చివరి 18 ఏళ్లు కర్తార్‌పూర్‌లో గడిపిన నానక్.. 1539లో నిర్యాణం చెందారు. ఆయన సమాధి.. చుట్టూ ఓ గురుద్వారాను నిర్మించారు. దేశ విభజనలో ఇది పాకిస్థాన్‌లోకి పోయింది. మన సరిహద్దుకు ఆవల కేవలం 4 కి.మీ దూరంలోనే ఈ కర్తార్ పూర్ ఉంది.

‘లోకంలో వేర్వేరు మతాలంటూ ఏమీ లేవు. కుల మత వర్ణ వర్గ భేదాలూ లేవు. ఇక్కడ ఉన్నదంతా పరమాత్మ చైతన్యమే. మానవత, సమత, మమత అనేవి మనలో ఉంటే అన్నింటా ఆయనను చూడగలమని చెప్పేందుకే నేను అవతరించాను’ అని ప్రకటించారు. ‘నేను మనిషినే చూస్తాను తప్ప అతని ధార్మిక విశ్వాసాలను, మతపరమైన దుస్తులను కాదు’ అని చెప్పిన నానక్ ప్రబోధించిన సిక్కు మతం నేటికీ వర్థిల్లుతూనే ఉంది.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×