Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి భవానీలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో గురువారం వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశామని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. మూలా నక్షత్రం రోజున నిర్వహించిన తరహాలోనే దసరా రోజున కూడా అన్ని క్యూ లైన్ లలో ఉచిత దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు.
కృష్ణానది వరద ఉద్ధృతితో అమ్మవారి తెప్పోత్సవం, జలవిహారం రద్దు చేశామని ఈవో తెలిపారు. అయితే శివాలయం నుంచి దుర్గా ఘాట్ వరకు ఊరేగింపుగా వెళ్లి శాస్త్రోక్తంగా జరపాల్సిన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. భక్తుల రద్దీ కారణంగా తెల్లవారుజామున రెండు గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. దసరా రోజున క్యూలైన్లోని భక్తులందరికీ లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు. గురువారం ఉదయం జరిగే పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
దసరా ఉత్సవాలలో పదో రోజు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు రూ. 62 లక్షల 16 వేల 970 ఆదాయం వచ్చిందని ఈవో శీనా నాయక్ తెలిపారు. రూ.15 లడ్డూలు 12,847 విక్రయించగా 1,92,705 రూపాయలు , వంద రూపాయల లడ్డూ బాక్స్ లు 54,705 విక్రయించగా రూ.54,70,500 ఆదాయం వచ్చిందని చెప్పారు. ప్రత్యేక కుంకుమార్చనల ద్వారా రూ.36 వేలు, చండిహోమం ద్వారా రూ.24 వేలు, ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా రూ.20,464, ఫోటో క్యాలెండర్ల విక్రయం ద్వారా 6,170 రూపాయలు, కేశఖండన ద్వారా రూ.4,58,720 ఇతరత్రా 8,411 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.
బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 85,094 మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. చిన్నారులు తప్పిపోకుండా 5,042 ట్యాగ్ లు వేశామన్నారు. 25,533 మందికి అన్న ప్రసాద వితరణ, 17,29,057 లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు.
దసరా శరన్నవరాత్రుల్లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దుర్గగుడికి రూ.3 కోట్ల 55 లక్షల 82 వేల 374 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు. ఉత్సవాలలో లడ్డూ ప్రసాదాలు, దర్శన టికెట్లు, ప్రత్యేక పరోక్ష కుంకుమార్చనలు, చండీ హోమం, శ్రీ చక్ర నవార్చన, ప్రత్యేక ఖడ్గమాల టికెట్ల విక్రయం రూపేణా ఈ ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు.
సెప్టెంబర్ 22 నుండి 30వ తేదీ వరకు 11,28,923 మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు ఈవో చెప్పారు. ఈ తొమ్మిది రోజుల్లో చిన్నారులు తప్పిపోకుండా 49, 597 ట్యాగ్ లు చిన్నపిల్లలకు వేశామన్నారు. 2, 33,116 మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు.