Navratri: శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజుకు (నవమి) అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున దుర్గాదేవి తొమ్మిదవ, చివరి రూపమైన శ్రీ సిద్ధిదాత్రి దేవిని భక్తులు పూజిస్తారు. సర్వసిద్ధులను ప్రసాదించే తల్లిగా ఈ అమ్మవారు పూజలందుకుంటారు. ఈ రోజు జరుపుకునే పూజా విధానం ,దాని ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.
సిద్ధిదాత్రి దేవి ప్రాముఖ్యత:
సిద్ధిదాత్రి అంటే “సిద్ధులను (అద్భుత శక్తులు) ప్రసాదించే తల్లి” అని అర్థం. మార్కండేయ పురాణం ప్రకారం.. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ అనే ఎనిమిది సిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులన్నింటినీ తన భక్తులకు అనుగ్రహించే శక్తి సిద్ధిదాత్రి అమ్మవారికి మాత్రమే ఉంది.
శివుడు కూడా ఈ దేవిని ఆరాధించి సిద్ధులను పొందారని.. అందుకే ఆయన అర్థనారీశ్వరుడు (శరీరంలో సగం శివుడు, సగం శక్తి) అయ్యారని చెబుతారు. ఈ తల్లి పద్మంపై కొలువై ఉంటుంది. ఈ రోజున చేసే పూజ ద్వారా నవరాత్రి ఉత్సవం యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది.
నవమి పూజా విధానం:
నవరాత్రి తొమ్మిదో రోజు పూజలో సిద్ధిదాత్రి అమ్మవారి ఆరాధనతో పాటు కన్యా పూజ (కుమారి పూజ) కూడా ప్రధానంగా జరుపుతారు.
1. పూజా సంకల్పం:
ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
పూజ గదిని శుభ్రం చేసి, సిద్ధిదాత్రి అమ్మవారి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
దేశవాళీ ఆవు నెయ్యితో దీపం వెలిగించి, నవమి రోజు పూజను మొదలుపెట్టాలి.
2. అమ్మవారి అలంకరణ:
సిద్ధిదాత్రి దేవికి ఇష్టమైన రంగు ఊదా లేదా నీలం. ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం శుభకరం.
అమ్మవారికి కమలం లేదా మల్లెపూలను సమర్పించాలి.
నైవేద్యం (ప్రసాదం): ఈ రోజున నువ్వులు లేదా హల్వా-పూరి లేదా ఖీర్ (పాయసం) నైవేద్యంగా సమర్పించడం శ్రేయస్కరం.
3. మంత్ర పఠనం:
పూజలో సిద్ధిదాత్రి అమ్మవారికి సంబంధించిన దుర్గా సప్తశతి లేదా దేవి మంత్రాలను పఠించడం మంచిది.
బీజ మంత్రం: “ఓం దేవీ సిద్ధిదాత్రియై నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
Also Read: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?
కన్యా పూజ లేదా కుమారి పూజ:
నవరాత్రి పూజ, ముఖ్యంగా నవమి రోజున, కన్యా పూజ లేకుండా అసంపూర్ణంగా భావిస్తారు.
తొమ్మిది మంది బాలికలను (2 నుండి 10 సంవత్సరాల లోపు) దుర్గా దేవి రూపాలుగా భావించి ఆహ్వానించాలి.
వారి పాదాలు కడిగి.. నమస్కరించి, కొత్త వస్త్రాలు లేదా కండువాలను సమర్పించాలి.
వారికి హల్వా, పూరీ, శనగలు, పాయసం మొదలైన ఆహారాన్ని వడ్డించాలి.
చివరిగా.. వారికి దక్షిణ (కానుకలు) లేదా చిన్న బహుమతులు ఇచ్చి.. వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
నవమి పూజను పూర్తయిన తర్వాత.. నవరాత్రిలో వెలిగించిన జ్యోతిని (దీపాన్ని) శాంతింపజేయాలి. ఈ ఆఖరి రోజు పూజతో భక్తులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, విజయాలను పొందుతారు.