BigTV English

Utthana Ekadashi : నారాయణుడు నిద్రలేచే రోజే.. ఉత్థాన ఏకాదశి

Utthana Ekadashi : నారాయణుడు నిద్రలేచే రోజే.. ఉత్థాన ఏకాదశి
Utthana Ekadashi

Utthana Ekadashi : ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణూవు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశి(తొలి ఏకాదశి) నాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పియోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అను పేరు.
దీనినే హరిబోధిని ఏకాదశి, దేవప్రబోధిని అని కూడా పిలుస్తారు. ఈ నాల్గునెలల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయరు. నేటి ఏకాదశి నుంచి శుభకార్యాలు ప్రారంభించవచ్చు. మునులు, పీఠాధిపతులు చేపట్టే చాతుర్మాస వ్రతం నేటితో ముగుస్తుంది.


‘ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద! త్యజనిద్రాం జగత్పతే, త్వయిస్తుపే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్” అనే ప్రబోధన మంత్రంతో నేడు నారాయణుడి ప్రార్థనచేసి, అర్చించి, ఉపవాసం ఉండాలి. ఈ రోజున భాగవతంలో “అంబరిషోపాఖ్యానం” చదివినా, విన్నా మేలు జరుగుతుందని పురోహితులు అంటున్నారు. భీష్మపితామహుడు మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి రోజునే అస్త్రసన్యాసం చేసి అంపశయ్యపై శయనించిన రోజు, యజ్ఞవల్క్య మహర్షి జన్మతిథి కూడా నేడే. కార్తీకశుద్ధ ఏకాదశి రోజున ‘గోపద్మ వ్రతం చేయడం ఎంతో విశిష్టమైనది.

కార్తీకశుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు. యోగులు, సిద్ధులు మొదలైన వారు విష్ణులోకం చేరుకొని కీర్తనలతో, భజనలతో, కర్పూరహారతులతో శ్రీమహావిష్ణువును మేల్కొలుపుతారు. ఈ రోజు విష్ణువుకి హారతి ఇవ్వడం వల్ల అకాలమృత్యు దోషం తొలిగిపోతుందనీ, నేరుగా హారతి ఇవ్వలేని వారు ఆలయంలో కర్పూరం సమర్పించినా లేదా దూరం నుంచైనా హారతిని కనీసం చూసినా ఆ ఫలితం ఉంటుందని చెబుతారు.


ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే.. వెయ్యి అశ్వమేథ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నేడు ఒక చిన్న మంచిపని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు సర్వపాపపరిహారం కలుగుతుంది, పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాలు, యాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది’ అని బ్రహ్మదేవుడు నారదమహర్షికి తెలిపాడు.

ఈ రోజున భాగవతంలోని అంబరీషుని కథను చదువుతారు. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. విష్ణు భక్తుడైన అంబరీషుడు ఏడు దీవులతో కూడిన భూమండలాన్ని జన రంజకంగా, ధర్మయుతంగా పాలించేవాడు. ఈ సమయంలోనే ఆయన శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప యాగం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు.

ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఇందులో భాగంగా ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి, ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి, ప్రజలందరికీ అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. దీక్ష కొద్ది గడియల్లో ముగియనుండగా దుర్వాస మహర్షి అక్కడికి రాగా అంబరీషుడు విచ్చేసాడు. ఆయనను అత్యంత భక్తితో ఆహ్వానించి ఆ రోజుకి దుర్వాసుణ్ణి తన అతిథిగా ఉండమని కోరతాడు.

సరేనన్న.. దుర్వాసుడు తాను నదిలో స్నానం చేసి వచ్చేవరకు వేచి ఉండమని చెప్పి నదికి వెళ్తాడు. ఇక.. ద్వాదశి ఘడియలు వచ్చే సమయం అయింది. నియమం ప్రకారం.. ద్వాదశి ఘడియల్లో ఉపవాసాన్ని వదిలి, హరి పూజ చేసి, అతిథికి భోజనం పెట్టి, తానూ తినవలసి ఉంది. మహూర్తం మించిపోవటంతో కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు అంబరీషుడు ఆ ముహూర్తంలో ఒక తులసీ దళం తిని, గుక్కెడు నీళ్లు తాగి దుర్వాసుని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. స్నానం చేసి వచ్చిన దుర్వాసుడు తన దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని, మాట తప్పావంటూ ఆగ్రహిస్తాడు.

కోపానికి ప్రతీక అయిన దుర్వాసుడు.. ఆ కోపంలో తన తల వెంట్రుకల్లో నుంచి ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమన్నాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలువగానే ఆయనకు గతంలో విష్ణువు ప్రసాదించిన సుదర్శన చక్రం ప్రత్యక్షమై క్షణంలో ఆ రాక్షసుడి తల నరికేసింది. అంతటితో ఆగక.. విష్ణు భక్తుడిని చంపే ప్రయత్నం చేసిన దుర్వాసుడి వెంట కూడా పడింది. దీంతో ఆయన ప్రాణభయంతో బ్రహ్మ, శివుడి దగ్గరకు వెళ్లగా, వారు.. శ్రీ మహావిష్ణువు దగ్గరకే వెళ్ళమన్నారు.

తాను అంబరీషుని భక్తికి బందీని అయ్యాననీ, కాబట్టి వెళ్లి ఆయన్నే వేడుకోమన్నాడు. చివరికి దుర్వాసుడు వెళ్ళి అంబరీషుని వేడుకోగానే, ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు. దీంతో కథ సుఖాంతమవుతుంది. ఈ రోజున అన్నదానం చేస్తే.. సూర్యగ్రహణ సమయంలో గంగా తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. శక్తి కొద్దీ పేదలకు దానం చేయడం వల్ల మోక్షాన్ని పొందుతారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువుని పూజించి, రాత్రి జాగరణ చేసి, ద్వాదశి ఘడియలు ఉండగానే శ్రీమహావిష్ణుపూజ చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×