Trump Govt: అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతోంది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. ఈ విషయంలో ఎన్ని దేశాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఆయన ఏమీ పట్టించుకోలేదు. అనుకున్నది, చేయాల్సింది చేసుకుంటూపోతోంది. ఇదే సమయంలో అటు వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత సుమారు మూడు లక్షల వీసాలను రద్దు చేసింది. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.
గతేడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 3 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసింది. అందులో బర్త్ టూరిజంలో పాల్గొన్నడం, దానికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సంబంధించిన కనీసం 4000 వీసాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు, మోసం-తప్పుడు సమాచారం వంటి నిబంధనల ఉల్లంఘనలతో వీసా రద్దులకు సంబంధం ఉందని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి వెల్లడించారు.
గత ప్రభుత్వాల కన్నా తమ ప్రభుత్వం వీసాలను వేగంగా రద్దు చేసిందని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ స్పష్టం చేశారు. దాదాపు 3 లక్షలకు పైగా వీసాలను రద్దు చేయడం దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఆ పని చేసిందన్ననారు. వీసాలపై అమెరికాలో ఉంటూ చట్టాన్ని ఉల్లంఘించే, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే విదేశీయులపై ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందన్నారు. వీసాలు రద్దులో ఏ దేశీయులు ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
గతేడాది జనవరి నుండి 250000 వరకు వీసాలు రద్దు చేయబడినట్లు గత నెలలో ఆ దేశ వెల్లడించినప్పటికీ తాజా గణాంకాలు మాత్రం పెరుగుదలను సూచిస్తున్నాయి. గతేడాది బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ 23000 కేసులను సమీక్షించిన తర్వాత.. వీసాల రద్దుల వేగం పెరిగిందని నివేదిక పేర్కొంది.2025లో వీసా రద్దులో నేర పూరిత చర్యల వాటా ఎక్కువగా ఉందని ప్రస్తావించింది.
ALSO READ: ఫ్రెంచ్ విప్లవ గడ్డపై మళ్లీ అగ్గి.. ఇది నిరసనా? అంతర్జాతీయ కుట్రా?
రద్దు చేసిన వీసాల్లో సుమారు 25 శాతం దాడులు, లేకుంటే సంబంధిత నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇక మద్యం సేవించి వాహనం నడపడం వల్ల మరో 22 శాతం రద్దు అయ్యాయి. దొంగతనం 7 శాతం, మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా పంపిణీ మరో 7 శాతం ఉన్నాయి. జాతీయ భద్రతా పరమైన ఆందోళనల కారణంగా వీసా రద్దుకు కారణాలుగా ప్రభుత్వం పేర్కొంది.