India Slams Pakistan: ఉగ్రవాదం, మత స్వేచ్ఛ, మైనార్టీల హక్కుల వంటి సున్నితమైన అంశాలపై పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని భారత్ అంతర్జాతీయ వేదికపై మరోసారి తీవ్రంగా ఎండగట్టింది. భారత అంతర్గత వ్యవహారాలు, జమ్మూ కాశ్మీర్ అంశంపై మాట్లాడే నైతిక హక్కు పాకిస్థాన్‌కు ఎంతమాత్రమూ లేదని స్పష్టమైన ఆధారాలతో భారత్ తిప్పికొట్టింది.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్ మొదటి కార్యదర్శి భవిష్య మంగళానందన్ ‘మత, విశ్వాస స్వేచ్ఛ’పై ఏర్పాటు చేసిన సమావేశంలో పాకిస్థాన్ నైతికతను ప్రశ్నించారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందిన సొంత పాకిస్థాన్ సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించడానికి ఆ దేశం నిరాకరించిందని పేర్కొన్నారు. అలాంటి దేశం ఇవాళ విశ్వాసం, మత స్వేచ్ఛ, సైనిక గౌరవాల హక్కుల గురించి మాట్లాడటం ఎంతో విడ్డూరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. నాడు పాకిస్థాన్ సైనికుల మృతదేహాలకు భారత సైన్యమే పూర్తి సైనిక గౌరవాలతో, ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిందని ఈ సందర్భంగా ప్రపంచానికి గుర్తుచేశారు.
మరోవైపు పాకిస్థాన్‌లో రోజురోజుకూ మైనార్టీల జనాభా తగ్గిపోతోందని, వారి ప్రాథమిక హక్కులు తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని భవిష్య పేర్కొన్నారు. సొంత దేశంలోని మైనార్టీలకు కనీస రక్షణ కల్పించలేని దేశం.. భారతదేశానికి నీతులు చెప్పే స్థాయిలో లేదని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ గురించి నిత్యం మాట్లాడే పాకిస్థాన్.. ముందుగా తన చట్టవిరుద్ధ ఆక్రమణలో ఉన్న రావలకోట్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Also Read: చిరిగిన రూ.10 నోటు వివాదం.. డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడి.. అవమానంతో యువకుడు సూసైడ్!
అటు ఉగ్రవాదంపై దౌత్యవేత్త రఘూ పురి మాట్లాడుతూ.. అంతర్జాతీయ నేరస్థుడు దావూద్ ఇబ్రహీమ్‌కు పాకిస్థాన్ ఆశ్రయం ఇవ్వడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. అల్-ఖైదా, ఉసామా బిన్ లాడెన్‌తో సంబంధాలు ఉన్నందున ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో చేర్చిన దావూద్ ఇబ్రహీమ్.. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ నేరస్థుడని తెలిపారు. ఉసామా బిన్ లాడెన్ ఎక్కడైతే దొరికి హతమయ్యాడో, అదే దేశంలో దావూద్ కూడా నివసిస్తున్నాడని పేర్కొంటూ పాకిస్థాన్ ఉగ్రవాద పోషణను ప్రపంచం ముందు పెట్టారు. ఇటీవల పహల్గామ్లో పాకిస్థాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు 27 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా.. ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి దయాది దేశంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా దౌత్యవేత్తలు ప్రస్తావించారు.
Also Read: రూ.కోటి జీతంతో జాబ్ వదులుకొని బిజినెస్ చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2.2 కోట్ల ఆదాయం