Delivery Boy Suicide: కస్టమర్ అవమానించడంతో మనస్తాపం చెంది ఓ డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సమీర్ హుస్సేన్ (24) అనే యువకుడు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. చిరిగిన రూ. 10 నోటు విషయంలో జరిగిన వాగ్వాదం.. చివరికి వ్యక్తి ఆత్మహత్యకు దారితీయడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
అక్టోబర్ 4 రాత్రి 10:30కు ఢిల్లీలోని వినోద్ నగర్‌లో ఉన్న రాంపాల్ సింగ్ అనే కస్టమర్‌కు సమీర్ కాఫీ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ. 150. అయితే నగదు ఇవ్వడానికి ఆ కస్టమర్ దాదాపు 15 నిమిషాలు సమయం తీసుకున్నాడు. ఆలస్యమైనప్పటికీ సమీర్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే తర్వాత ఇచ్చిన డబ్బులో రూ. 10 నోటు చిరిగిపోయి ఉండటంతో దానిని మార్చి వేరే నోటు ఇవ్వాలని సమీర్ కోరాడు.
‘అంకుల్.. దయచేసి ఈ నోటు మార్చి ఇంకోటి ఇవ్వండి’ అని తాను చాలా మర్యాదగా అడిగినట్లు సమీర్ ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియోలో తెలిపాడు. దీనికి ఆ కస్టమర్ దురుసుగా ప్రవర్తిస్తూ.. ‘నా దగ్గర ఉన్నవి ఇవే. కావాలంటే తీసుకో లేదా ఇక్కడ నుంచి వెళ్లిపో’ అని అరిచాడు. అంతేకాకుండా సమీర్‌ను కస్టమర్ మూడుసార్లు చెంపదెబ్బ కొట్టాడు. అయినప్పటికీ సమీర్ ఎదురు తిరగలేదు. కానీ తన పేదరికాన్ని అడ్డుపెట్టుకుని అందరి ముందూ అవమానించడం ఆయనను తీవ్రంగా కుంగదీసింది.
‘పేదరికమంటే అందరికీ చులకనా? నడిరోడ్డుపై నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సమీర్ కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు బైక్ లేకపోయినా కష్టపడి సంపాదించుకుని తినాలనే ఉద్దేశంతో సైకిల్‌పైనే డెలివరీలు చేసేవాడినని చెప్పాడు. తాను ఎవరి వద్ద కూడా డబ్బులు అడగలేదని, తన కాళ్లపై తాను నిలబడాలని అనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
సూసైడ్ వీడియోలో తన తల్లి గురించి మాట్లాడుతూ.. తాను చాలా ధైర్యవంతుడినేనని, కానీ ప్రస్తుత పరిస్థితులు తనను బతకనివ్వడం లేదని వాపోయాడు. మరొక వీడియోలో తన చావుకు ఆ కస్టమర్ రాంపాల్ సింగ్, ఆయన మనుమడు రాకేశ్ కారణమని స్పష్టం చేశాడు. మొదట కొట్టి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించాడు.
అక్టోబర్ 5వ తేదీనే సమీర్ తన సెల్ఫ్‌ఫోన్‌లోనే విషం తాగుతున్న వీడియోను రికార్డ్ చేసుకున్నాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని లాల్ బహాదుర్ శాస్త్రి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కొన్ని రోజుల పాటు చికిత్స పొందిన సమీర్.. అక్టోబర్ 20న మృతి చెందాడు.
Also Read: జోగి రమేష్ కోడలికి రోడ్డు ప్రమాదం.. ఘటనపై అనుమానాలు.. పోలీసులకు మేఘన తండ్రి ఫిర్యాదు!
అయితే నిందితులకు రాజకీయ అండదండలు ఉన్నాయని, తాము ఏమైనా చేయగలమని వారు బెదిరిస్తున్నారని సమీర్ తల్లి కాలిమా ఆరోపించారు. ‘నా కొడుకు పేదరికాన్ని వారు ఎగతాళి చేశారు’ అని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. BNS సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసును మార్చి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కడుపులో కణితి ఉందని ఆస్పత్రికి వెళ్లి ప్రసవించిన మహిళ.. 9 నెలల గర్భం ఎందుకు తెలియలేదంటే