
Afternoon Napping: మనం రోజూవారీ పనులు చేయడం కోసం కూడా ఏదో ఒక రకంగా ఇన్‌స్పిరేషన్‌ను వెతుక్కుంటూ ఉంటాం. సోమవారం ఆఫీసుకు వెళ్లాలన్నా లేదా ఎక్కువ పని త్వరగా చేయాలన్నా.. ఇలా దేనికి అయినా ఒక స్ఫూర్తి అనేది ఉండాలని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అదే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో తమకు కావాల్సిన స్ఫూర్తిని వెతుక్కుంటారు. మధ్యహ్నం కునుకు కూడా ఒకరంగా చాలామందికి స్ఫూర్తినిస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది.
ఎంతోమంది శాస్త్రవేత్తలు, చరిత్రలో నిలిచిపోయిన వారు కూడా మధ్యాహ్నం కునుకు అనేది క్రియేటివిటీకి చాలా సహాయపడుతుందని బయటపెట్టారు. కానీ ఎంతసేపు పడుకుంటామనేది కీలకం అని కూడా అన్నారు. ముఖ్యంగా క్రియేటివిటీపై మధ్యాహ్నం కునుకు అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే ఎన్నో స్టడీలలో తేలింది. దీనినే స్లీప్ ఆన్సెట్ అంటారు. స్లీప్ ఆన్సెట్ అనేది క్రియేటివిటీకి సహాయపడుతుంది అని స్టడీలలో తేలడం తప్పా దీనికి సంబంధించి సైంటిఫిక్‌గా ఏదీ నిరూపణ అవ్వలేదని నిపుణులు బయటపెట్టారు.
బల్బ్‌ను కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ సైతం మధ్యాహ్నం కునుకు అనేది తన క్రియేటివిటీని పెంచేదని పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఆయన మధ్యాహ్నం పడుకునే ముందు ఒక మెటల్ బాల్‌ను చేతిలో పట్టుకొని పడుకునేవారట. ఎడిసన్ ఘాట నిద్రలోకి వెళ్లగానే ఆ బాల్ కిందపడుతుంది కాబట్టి ఈ శబ్దానికి నిద్రలేచేవారట. అప్పుడు మళ్లీ వెంటనే తన పనిపైన దృష్టిపెట్టేవారని చెప్తుంటారు. అందుకే మధ్యాహ్నం కునుకు గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవాలని ఇప్పటి శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.
‘డోర్మియో’ అనే పరికరాన్ని వారు మధ్యాహ్నం కునుకు గురించి స్టడీ చేయడం కోసం శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇది చేతికి ధరించే గ్లౌజ్ ఆకారంలో ఉంటుంది. మధ్యాహ్నం కునుకు తీసేవారు ఈ గ్లౌజ్ వేసుకొని నిద్రపోతే వారి ఖండరాల కదలికలను, హార్ట్ రేట్‌ను కనిపెడుతూ ఉంటుంది. డోర్మియో అనేది ఈ సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యాప్‌కు లేదా కంప్యూటర్‌కు పంపిస్తుంది. ఈ పరిశోధనల కోసం 27 లోపు వయసున్న 49 మందిని శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు.
స్లీప్ ఆన్సెట్ గురించి పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిద్ర గురించి స్టడీ చేస్తున్న క్రమంలో తాము తెలుసుకోవాల్సింది చాలా ఉందని అర్థమయిందని అన్నారు. నిద్ర వల్ల న్యూరోసైన్స్‌లో జరిగే మార్పుల గురించి స్టడీ చేయడం అనేది ఈ శతాబ్దంలో చాలా ఆసక్తికరమైన టాపిక్ అని తెలిపారు. మొత్తంగా మధ్యాహ్నం కునుక వల్ల మనిషి కాస్త విశ్రాంతి పొందడంతో పాటు క్రియేటివిటీ కూడా పెరుగుతుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకున్నారు.