Eye Health Tips: మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ వాడటం, ల్యాప్‌టాప్ ముందు గంటల తరబడి కూర్చోవడం నేటి కాలంలో సాధారణం అయిపోయింది. కళ్లు మంటలు పుట్టినా, అప్పుడప్పుడు సరిగ్గా కనిపించకపోయినా ‘అయ్యో.. మొబైల్ ఎక్కువ చూసి అలసిపోయి ఉంటా లే’ అని తేలిగ్గా కొట్టిపారేస్తుంటాం. కానీ, మన కళ్లు మనకు తెలియకుండానే భవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల గురించో, కంటి చూపు మందగించడం గురించో ముందుగానే హెచ్చరిస్తుంటాయి. డాక్టర్లు చెప్పిన లెక్కల ప్రకారం ప్రపంచంలో కోట్లాది మంది చూపు కోల్పోవడానికి కారణం కేవలం సరైన సమయంలో గుర్తించకపోవడమే. అందుకే మన కళ్లు ఇచ్చే ఆ 5 సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజంతా స్క్రీన్ చూశాక కాసేపు బ్లర్‌గా కనిపించడం కామన్. కానీ ఎప్పుడూ చూపు అటూ ఇటూ మారుతూ.. క్లియర్ గా కనిపించకపోతే మాత్రం లైట్ తీసుకోవద్దు. ఇది షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల కావచ్చు లేదా కంటిలో శుక్లాలు ఏర్పడుతున్నాయనేదానికి మొదటి సంకేతం కావచ్చు. ఒక్క కంటిలో సడన్‌గా చూపు మసకబారితే వెంటనే డాక్టర్‌ను కలవడం చాలా ముఖ్యం.
పుస్తకాలు చదువుతున్నప్పుడు లేదా ల్యాప్‌టాప్ ముందు పనిచేస్తున్నప్పుడు తరచూ తలనొప్పి వస్తోందా? అయితే మీ కంటి నెంబర్ మారడమో లేదా చూపు సరిగ్గా కలవకపోవడమో జరిగి ఉండవచ్చు. కొద్దిరోజుల్లో ఇది తగ్గిపోకపోతే డ్రై ఐస్ సమస్య లేదా కళ్లలో ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. దీన్ని అలానే వదిలేస్తే కంటికి ప్రమాదం జరిగే ఛాన్స్ ఎక్కువ.
Also Read: రాత్రి చక్కగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటుందా? అయితే మీ బాడీలో ఈ 5 లోపాలున్నట్టే!
చాలామంది కళ్లు ఎర్రగా మారితే దుమ్ము పడి ఉంటుందని, లేదా అలసట అనుకుంటారు. కానీ కళ్లు ఎప్పుడూ నీరు కారడం, దురద పెట్టడం లాంటివి చేస్తుంటే డ్రై ఐస్ సిండ్రోమ్ లేదా ఇన్ఫెక్షన్ కావొచ్చు. ఇలాంటి వాటిని అలాగే వదిలేస్తే కంటి పొర దెబ్బతిని భవిష్యత్తులో పెద్ద సమస్యలు వస్తాయి.
చాలా మందికి రాత్రి వేళల్లో బండి నడిపేటప్పుడు ఎదురుగా వచ్చే లైట్ల వెలుతురుకు కళ్లు బైర్లు కమ్మినట్టు అవుతుంటాయి. నైట్ టైమ్ చూపు తగ్గడం అనేది కంటి శుక్లాలు లేదా రెటినాలో సమస్యలు వస్తున్నాయనేదానికి సంకేతం. ఇవి మెల్లమెల్లగా పెరుగుతాయి కాబట్టి.. చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది వచ్చేవరకు పట్టించుకోరు.
అప్పుడప్పుడు కళ్ల ముందు చిన్న చిన్న నల్లటి పురుగులు లాంటివి కదలడం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఒక్కసారిగా కళ్ల ముందు మచ్చలు ఎక్కువైతే, మెరుపులు లాంటివి కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. ఇది రెటినా ఊడిపోవడానికి దారితీసే తీవ్రమైన సమస్య కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కేవలం కళ్లద్దాలు మార్చుకోవడానికే కాకుండా, మన శరీరంలోని షుగర్, బీపీ లాంటి చాలా సమస్యలను కంటి పరీక్షల ద్వారానే ముందే పసిగట్టవచ్చు. కాబట్టి కళ్లలో చిన్న మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
Also Read: పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!