Bendakaya roti pachadi: వంటకాల్లో, ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్లకు ఉండే క్రేజే వేరు. మామిడి కాయ, టమాటా, కొత్తి మీర పచ్చళ్లే కాకుండా.. అప్పుడప్పుడు వెరైటీగా చేసే కూరగాయల పచ్చళ్లు భోజనం రుచిని రెట్టింపు చేస్తాయి. అందులోనూ బెండకాయతో రోటి పచ్చడి చేస్తే.. ఆ టేస్టే వేరుగా ఉంటుంది. చాలా మందికి బెండకాయ అనగానే ఒక రకమైన జిగురు వస్తుందని తినడానికి ఇష్టపడరు. అయితే ఈ రెసిపీలో బెండకాయలను కొద్దిగా వేయించడం ద్వారా.. ఆ జిగురు పూర్తిగా పోయి.. పచ్చడి చాలా రుచిగా వస్తుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పచ్చడి తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయలు – 250 గ్రాములు
పచ్చిమిర్చి – 6 నుంచి 7 (కారాన్ని బట్టి)
టమాటాలు – 2
చింతపండు – చిన్న నిమ్మకాయ అంత
వెల్లుల్లి రెబ్బలు – 6-8
జీలకర్ర – 1 స్పూన్
నూనె – 2 స్పూన్లు
కొత్తిమీర – గుప్పెడు
ఉప్పు – రుచికి సరి పడా
పోపు దినుసులు (ఆవాలు,శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ)
1. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో.. ఉంచి బెండకాయ ముక్కల్లోని జిగురు పూర్తిగా పోయి, కొద్దిగా రంగు మారే వరకు బాగా వేయించాలి. ఇలా వేయించడం వల్ల పచ్చడిలో జిగురు రాకుండా ఉంటుంది. వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
2. అదే ప్యాన్‌లో మరో స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి చీలికలు, టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు మెత్తగా ఉడికే.. వరకు మూత పెట్టి మగ్గించాలి. చివరగా చింత పండును కూడా వేసి టమాటాలతో పాటు కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
3. సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఈ పచ్చడిని.. రోట్లో నూరితే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఒక వేళ రోలు అందుబాటులో లేక పోతే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరి పడా ఉప్పు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటా-పచ్చిమిర్చి మిశ్రమం, కొత్తి మీర వేసి ఒక తిప్పు తిప్పాలి. చివరగా ..వేయించి పెట్టుకున్న బెండ కాయ ముక్కలను వేసి మిక్సీని.. పల్స్ మోడ్‌లో (ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయడం) ఒక్క సారి తిప్పాలి. బెండకాయ ముక్కలు పూర్తిగా పేస్ట్ లా కాకుండా పలుకులుగా తగలాలి. అప్పుడే పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది.
Also Read: నోట్లో వేస్తే కరిగిపోయే గోధుమ హల్వా..ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!
4. పచ్చడికి మరింత రుచిని తెచ్చేది పోపే! ఒక చిన్న కడాయిలో.. కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి చిటపటలాడించాలి. ఈ పోపును మనం తయారు చేసి పెట్టుకున్న బెండకాయ పచ్చడిలో కలిపేయాలి.
ఎలాంటి కూరగాయలు లేనప్పుడు లేదా కాస్త డిఫరెంట్ టేస్ట్ కోరుకున్నప్పుడు ఈ బెండకాయ రోటి పచ్చడి అద్భుతమైన ప్రత్యామ్నాయం. కేవలం పది నిమిషాల్లో.. అయిపోయే ఈ సింపుల్ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కమ్మని రుచిని ఎంజాయ్ చేయండి.