Malayalam Time Loop Thriller: పెళ్లి అనేది జీవితంలో మర్చిపోలేని రోజు. కొత్త జీవితం మొదలవుతుందని, ఎన్నో కలలు నిజమవుతాయని ఆశపడతారు. కానీ పెళ్లి రోజే తనకు చావు ఎదురవుతుందని కల వస్తే… ఆ కల నిజమవుతున్నట్టే అదే రోజు మళ్లీ మళ్లీ ఎదురైతే… పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్న వ్యక్తి, తన మొదటి రాత్రి వరకూ చేరుకోలేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇలాంటి వింత కాన్సెప్ట్‌తో రూపొందిన మలయాళ కామెడీ థ్రిల్లర్ ‘ధూమకేతు’ (Dhoomakethu). ఈ సినిమా తాజాగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి దీన్ని ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసుకుందాం పదండి.
కుట్టన్ అనే 36 ఏళ్ల బ్యాచిలర్ చాలా కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తుంటాడు. చివరికి శర్మిలతో అతడి వివాహం కుదురుతుంది. పెళ్లి రోజు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల హడావుడితో సందడిగా ఉంటుంది. అయితే కుట్టన్ కు మాత్రం పెళ్లయినా ఓ విచిత్రమైన భయం వెంటాడుతుంది. తన మరణానికి సంబంధించిన కల రావడంతో, పెళ్లి రోజున ఏదో జరగబోతోందనే అనుమానం మొదలవుతుంది.
వివాహం పూర్తయి, మొదటి రాత్రి సమయం దగ్గర పడగానే పరిస్థితి అనూహ్యంగా మారుతుంది. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు కుట్టన్ పై దాడి చేసి అతడిని చంపేస్తారు. అతడి భార్యను కూడా అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇక్కడితో కథ ముగిసిపోయిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అసలు ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. కుట్టన్ చనిపోయిన తర్వాత మళ్లీ తన పెళ్లి రోజు ఉదయాన్నే నిద్రలేస్తాడు. కొద్దిసేపటి క్రితం జరిగిన సంఘటనలు తిరిగి జరగబోతున్నట్టుగా అనిపిస్తాయి. అదే రోజు, అదే పరిస్థితులు, అదే ప్రమాదం మళ్లీ ఎదురవుతుంటాయి.
ఈ వింత టైమ్ లూప్ లో చిక్కుకున్న కుట్టన్ మొదట ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేకపోతాడు. తనకు జరుగుతున్నది అంతా కలా, నిజమా అనే గందరగోళం అతడిని వెంటాడుతుంది. కానీ ప్రతిసారీ అదే రోజు రిపీట్ అవుతుండటంతో, ఈ చక్రం నుంచి బయట పడాలంటే ఏదో మార్చాలని గ్రహిస్తాడు. అదేంటి ? అతన్ని చంపడానికి వస్తున్న వ్యక్తులు ఎవరు ? భార్యను ఎందుకు తీసుకెళ్తున్నారు ? ఈ సంఘటనలు ఆగాలంటే ఏం చేయాలి ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
‘ధూమకేతు’ అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా డబ్బింగ్ వెర్షన్‌లో చూడొచ్చు. సాధారణంగా టైమ్ లూప్ కథల్లో హీరోకు జరిగిన సంఘటనలను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ అవకాశం పెళ్లి రోజు, మొదటి రాత్రి చుట్టూ తిరగడంతో కామెడీకి కూడా స్పేస్ దొరుకుతుంది. అదే సమయంలో ప్రతిసారి ప్రమాదం మళ్లీ ఎదురవుతుండటంతో సస్పెన్స్ కొనసాగుతుంది. సజిన్ గోపు (Sajin Gopu) కుట్టన్‌గా, నిఖిల విమల్ (Nikhila Vimal) శర్మిలగా నటించారు. గణపతి, మంజు పిల్లై, షైన్ టామ్ చాకో కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. సుధి మాడిసన్ దర్శకత్వం వహించగా, అంకిత్ మీనన్ సంగీతం అందించారు. కామెడీ అండ్ మిస్టరీ ఉన్న సినిమాలు చూడాలి అనుకుంటే ‘ధూమకేతు’ను వీకెండ్ చూడడం మరచిపోవద్దు. ముఖ్యంగా టైమ్ లూప్ కథలు ఇష్టపడేవారికి ఇది ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.