Gut Health: మన శరీరాన్ని ఒక యంత్రంతో పోలిస్తే.. జీర్ణ వ్యవస్థ దాని ఇంజిన్ లాంటిది. మనం తినే ఆహారం నుంచి పోషకాలను, గ్రహించడం, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం, మన మానసిక స్థితిని నియంత్రించడంలో.. ‘గట్ హెల్త్’ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. లైష్ స్టైల్, జంక్ ఫుడ్ , ఒత్తిడి కారణంగా మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటోంది. మీ జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలను.. ఇస్తుంది. వీటిని మనం ‘రెడ్ ఫ్లాగ్స్’అంటాం. వీటిని సకాలంలో.. గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తీవ్రమైన అనారోగ్యాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పే 7 ప్రధాన సంకేతాలు:
1. తరచుగా కడుపు ఉబ్బరం, గ్యాస్ :
భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం సాధారణమే కావచ్చు. కానీ ప్రతి రోజూ ఇలా జరగడం శుభసూచకం కాదు. గ్యాస్ ఎక్కువగా రావడం, కడుపులో అసౌకర్యం కలగడం వంటివి మీ పేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరిగిపోయిందని చెప్పడానికి సంకేతం. ఇది ఆహారాన్ని సరిగ్గా.. విచ్ఛిన్నం చేయలేకపోవడాన్ని సూచిస్తుంది.
2. చక్కెర పదార్థాలపై విపరీతమైన కోరిక:
మీకు పదే పదే స్వీట్లు లేదా ప్రాసెస్ చేసిన ఆహారం తినాలనిపిస్తుందా? పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా మనుగడ సాగించడానికి చక్కెర అవసరం. అందుకే అవి మన మెదడుకు సంకేతాలు పంపి చక్కెర పదార్థాలు తినేలా ప్రేరేపిస్తాయి. దీని వల్ల గట్ హెల్త్ మరింత క్షీణిస్తుంది.
3. వివరించలేని బరువు మార్పులు:
వ్యాయామం లేదా డైట్‌లో ఎలాంటి మార్పులు లేకపోయినా.. బరువు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంటే.. అది మీ జీర్ణ వ్యవస్థ సమస్య కావచ్చు. ఇన్సులిన్ నిరోధకత పెరగడం వల్ల బరువు పెరగడం లేదా పోషకాల శోషణ తగ్గడం వల్ల బరువు తగ్గడం సంభవించవచ్చు.
4. నిద్రలేమి, నిరంతర అలసట:
మన శరీరంలో సంతోషాన్ని ఇచ్చే ‘సెరోటోనిన్’ అనే హార్మోన్ 90% వరకు పేగుల్లోనే తయారవుతుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గి నిద్ర లేమి, రోజంతా నీరసంగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి.
5. చర్మ సమస్యలు :
పేగుల్లో వాపు ఏర్పడినప్పుడు అది చర్మంపై ఎగ్జిమా, సోరియాసిస్ లేదా మొటిమల రూపంలో బయట పడుతుంది. “గట్-స్కిన్ యాక్సిస్” ప్రకారం.. లోపల జీర్ణక్రియ శుభ్రంగా లేకపోతే.. చర్మం కాంతి విహీనంగా మారుతుంది.
6. ఆహార అలెర్జీలు:
గతంలో ఇబ్బంది లేని ఆహార పదార్థాలు ఇప్పుడు తింటే.. కడుపునొప్పి, విరేచనాలు లేదా దురదలు వస్తుంటే.. మీ గట్ లైనింగ్ బలహీనపడిందని అర్థం. దీని వల్ల శరీరం కొన్ని ఆహారాలను తట్టుకోలేకపోతుంది.
7. మానసిక స్థితిలో మార్పులు:
జీర్ణ వ్యవస్థను ‘రెండవ మెదడు’ అంటారు. పేగుల ఆరోగ్యం బాలేనప్పుడు ఆందోళన, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?
ఈ రెడ్ ఫ్లాగ్స్‌ను గమనించినట్లయితే.. వెంటనే ఈ కింది మార్పులు చేసుకోండి.
ప్రోబయోటిక్స్: పెరుగు, మజ్జిగ వంటి పదార్థాలను తీసుకోండి. ఇవి మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి.
పీచు పదార్థం : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి.
నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల విషతుల్యాలు బయటకు వెళ్తాయి.
ఒత్తిడి తగ్గించుకోవడం: ధ్యానం, యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందండి.
సరైన నిద్ర: రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర అవసరం.