Sankranti 2026: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు, వాకిళ్లలో ముగ్గులు, గొబ్బెమ్మలతో పాటు ఇల్లంతా పిండివంటల ఘుమఘుమలు గుర్తుకొస్తాయి. రైతు చేతికి కొత్త ధాన్యం వచ్చే ఈ సమయంలో.. ఆ బియ్యం , బెల్లంతో చేసే వంటకాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. 2026 మకర సంక్రాంతిని మరింత రుచికరంగా మార్చుకోవడానికి మన సంప్రదాయ వంటకాలు , వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి సంప్రదాయ వంటకాలు:
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు.. అదొక పిండివంటల జాతర. ఈ పండగకు చేసుకునే కొన్ని ముఖ్యమైన వంటకాలు ఇవే..
1. అరిసెలు :
సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘అరిసెలు’. కొత్త బియ్యం పిండి, బెల్లం పాకంతో వీటిని తయారు చేస్తారు. అరిసెలు కేవలం రుచికరం మాత్రమే కాదు.. ఇందులో వాడే బెల్లం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది. నువ్వులు అద్ది చేసిన అరిసెలు చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని ఇస్తాయి.
తయారీ: బియ్యాన్ని 24 గంటల పాటు నానబెట్టి, ఆరబోసి, తడి ఉండగానే పిండి పట్టాలి (తడి బియ్యం పిండి). ఒక గిన్నెలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. తర్వాత పాకంలో యాలకుల పొడి, నెయ్యి వేసి, తడి బియ్యం పిండిని ఉండలు కట్టకుండా కలుపుతూ ‘చలివిడి’లా తయారు చేయాలి. అనంతరం చిన్న చిన్న ఉండలుగా తీసుకుని, నువ్వులు అద్ది, నూనెలో దోరగా వేయించాలి. వేయించిన వెంటనే అరిసెల పీటపై పెట్టి ఎక్కువైన నూనెను ఒత్తేయాలి.
2. చక్రపొంగలి & పులగం:
సంక్రాంతి రోజున కొత్త బియ్యంతో ‘పులగం’ వండి దేవుడికి నైవేద్యంగా పెడతారు. పెసరపప్పు, బియ్యం కలిపి వండే ఈ వంటకం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇక తీపి ఇష్టపడేవారు బెల్లం, నెయ్యి, జీడిపప్పు వేసి ‘చక్రపొంగలి’ని ఎంతో ఇష్టంగా తింటారు.
పులగం తయారీ: బియ్యం, పెసరపప్పు (1:1/2 నిష్పత్తిలో) తీసుకుని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. దీనికి ఉప్పు, నెయ్యి కలిపితే పులగం సిద్ధం. ఉడికించిన పులగానికి బెల్లం పాకం కలపాలి. విడిగా బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్, ఎండు కొబ్బరి ముక్కలను వేయించి పొంగలిలో కలపాలి. చివరగా పచ్చకర్పూరం వేస్తే గుడిలో ప్రసాదంలాంటి వాసన వస్తుంది.
3. సజ్జ బూరెలు & గారెలు:
కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి సజ్జలతో చేసిన బూరెలు ప్రత్యేకంగా వండుతారు. సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే, మినప పప్పుతో వేసే గారెలు సంక్రాంతి విందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
సజ్జ బూరెల తయారీ: సజ్జ పిండిని బెల్లం నీళ్లతో కలిపి ముద్దలా చేయాలి. చిన్న చిన్న పూరీల్లా ఒత్తి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఇది అరిసెల లాంటి రుచినే ఇస్తుంది కానీ మరింత ఆరోగ్యకరం.
గారెలు: మినప పప్పును 4 గంటలు నానబెట్టి, తక్కువ నీళ్లతో మెత్తగా (గట్టిగా) రుబ్బుకోవాలి. ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు కలిపి, చేతిపై చిన్న వడల్లా ఒత్తి నూనెలో ఎర్రగా వేయించాలి.
4. నువ్వుల లడ్డూలు:
చలికాలంలో నువ్వులు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అందుకే సంక్రాంతికి నువ్వులు-బెల్లం కలిపి లడ్డూలు చేయడం ఒక సంప్రదాయం. ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఇది కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే హెల్తీ స్నాక్.
తయారీ: నువ్వులను బాణలిలో వేసి చిటపటలాడే వరకు దోరగా వేయించి చల్లార్చాలి. వేయించిన నువ్వులు, తగినంత బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి కలిపి మిక్సీలో (లేదా రోట్లో) కచ్చాపచ్చాగా పొడి చేయాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నెయ్యి కలిపి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.
ఈ వంటకాల వెనక ఉన్న ఆరోగ్య రహస్యం:
సంక్రాంతి వంటకాల్లో మనం ప్రధానంగా బెల్లం, నువ్వులు, బియ్యం, వేరుశనగలు ఉపయోగిస్తాం. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే ఈ సంధి కాలంలో, ఈ పదార్థాలు మన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తే, నువ్వులు శరీరానికి కావాల్సిన కాల్షియం అందిస్తాయి.