ఇంట్లో శాంతి, వృద్ధి కోసం చాలామంది ప్రతిరోజు పూజలు చేస్తుంటారు. అయినా ఇంట్లో ఒత్తిడి, ప్రతికూలత, కలహాలు కొనసాగుతూనే ఉంటాయి. దీనికి కారణం వాస్తు దోషాలే. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం ఆగిపోతుంది. రోజూ పూజ చేయడం మాత్రమే సరిపోదు. ఇంటి వాతావరణం.. కుటుంబ సభ్యుల మానసిక సమతుల్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది.
ఇంట్లో పాత వస్తువులు, ఉపయోగించని వస్తువులు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం ఉంటే ఇల్లు భారంగా అనిపిస్తుంది. దీంతో పాజిటివ్ ఎనర్జీ రావడం ఆగిపోతుంది. ప్రతికూల ఛాయల అనుభూతి వస్తుంది. పాత, విరిగిన ఫర్నీచర్, అనవసర వస్తువులను వెంటనే తొలగించాలి. శుభ్రంగా, అందంగా అలంకరించిన ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది.
పూజా గది దిక్కు వాస్తులో చాలా ముఖ్యం. ఈశాన్య దిక్కులో పూజా గది ఉంచడం ఉత్తమం. ఈ దిక్కు శాంతి, సానుకూల శక్తికి సంబంధించినది. చీకటిగా, గాలి లేని చోట పూజగది ఉండకూడదు. సహజ వెలుతురు, గాలి ఉండేలా చూసుకోవాలి.
చాలా మంది విరిగిన విగ్రహాలను ఇంటి దేవాలయంలో ఉంచేస్తారు. వాస్తు ప్రకారం ఇది పాజిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. పగిలిన విగ్రహాలు, చినిగిన పుస్తకాలు పూజగదిలో పెట్టుకోవద్దు. వాటిని గౌరవంగా అక్కడి నుంచి తొలగించి కొత్తవి పెట్టాలి. పూజా స్థలం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
ఇంట్లో తరచూ గొడవలు, కోపతాపాలు, కఠినంగా మాట్లాడుకోవడం జరిగితే ఇంట్లో సరైన వాతావరణం ఉండదు. పైగా ప్రతికూల శక్తి పెరుగుతుంది. మాటల్లో మర్యాద, ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. గౌరవంగా ప్రవర్తించడం చాలా అవసరం. రోజూ పూజ చేసినా కుటుంబంలో కలహాలు ఉంటే శాంతి రాదు.
చీకటి గదులు ఇంటి వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. ఇంట్లో సరైన వెంటిలేషన్ లేకుండా, చీకటి గదులు ఉంటే మనసుకు బరువుగా ఉంటుంది. అందుకే తాజా గాలి, సూర్యకాంతి ఇంట్లో వచ్చే విధంగా చూసుకోవాలి. దీంతో సానుకూలత పెరుగుతుంది. కిటికీలు తెరిచి గాలి వచ్చేలా చూడాలి. ఇంట్లో మొక్కలు పెంచితే తాజా గాలి వస్తుంది.
ఇంటి ముఖ్య ద్వారం శక్తి ప్రవేశించే మార్గం. మురికి, చెత్త, విరిగిన తలుపులు ఉంటే పాజిటివ్ ఎనర్జీ రాదు. అందుకే మీ ఇంటి మెయిన్ డోర్ ఎప్పుడూ శుభ్రంగా, కాంతివంతంగా ఉంచాలి.
పడక ఎదురుగా అద్దాలు పెట్టకూడదు. ఇలా చేస్తే మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు వస్తాయి. పూజా స్థలం ఎదురుగా కూడా అద్దాలు ఉంచరాదు.
వంటగదిలో అగ్ని, నీటి మూలకాలను దూరంగా ఉంచాలి. ఇది ఆరోగ్యం, సంపదకు మంచిది. బాత్‌రూమ్ ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచాలి.
Also Read: చాణక్య నీతి.. అప్పు తీసుకోవడం మీకు అలవాటుగా మారిందా? ఈ దురలవాటుకు అసలు మూలం అదే