Crispy Cauliflower Fry: ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా ఎప్పుడూ తినే కూరలతో బోరు కొట్టినప్పుడు కాలిఫ్లవర్ గుర్తుకు వస్తుంది. అయితే చాలా మంది కాలిఫ్లవర్ కర్రీ లేదా మంచూరియా చేస్తుంటారు. కానీ ఈసారి కాస్త డిఫరెంట్గా ఎంతో రుచికరంగా కాలిఫ్లవర్ వేపుడు ట్రై చేయండి. అన్నంలోకి, సాంబార్లోకి లేదా చపాతీలోకి ఇది అద్భుతమైన కాంబినేషన్. ఏ మాత్రం కష్టపడకుండా.. ఇంట్లో ఉండే మసాలాలతోనే నోరూరించే ఈ స్పెషల్ కాలిఫ్లవర్ వేపుడును ఎలా తయారు చేయాలో పూర్తిగా తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా చలికాలంలో లేదా వర్షాకాలంలో మార్కెట్కు తాజా కాలిఫ్లవర్ పువ్వులు రాగానే వాటితో రకరకాల వంటకాలు చేస్తుంటాం. చాలా మంది దీన్ని కేవలం కూరగా లేదా బిర్యానీల్లోనే వాడతారు. కానీ కాలిఫ్లవర్ తో చేసే ఘాటైన, కరకరలాడే వేపుడు రుచే వేరు. మీరు కూడా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఈ కొత్త స్టైల్లో కాలిఫ్లవర్ ఫ్రై చేసి చూడండి, ఇంట్లోని వాళ్ళందరూ అబ్బా అనాల్సిందే!
కాలిఫ్లవర్ పువ్వులు – 1 పెద్దది
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 3 లేదా 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
కారం – 1 లేదా 1.5 స్పూన్ (మీ కారానికి తగినట్లు)
పసుపు – చిటికెడు
ధనియాల పొడి – 1 స్పూన్
గరం మసాలా – అర స్పూన్
కరివేపాకు – రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – వేపుడుకి సరిపడా
1. కాలిఫ్లవర్ వండేటప్పుడు అన్నింటికంటే ముఖ్యం దాన్ని శుభ్రం చేయడం. కాలిఫ్లవర్ పువ్వుల లోపల సన్నని పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా కాలిఫ్లవర్ ముక్కలను మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకొని, అందులో కొద్దిగా ఉప్పు , పసుపు వేయాలి. కట్ చేసుకున్న కాలిఫ్లవర్ ముక్కలను ఈ వేడి నీటిలో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి నీరు పూర్తిగా వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులోని క్రిములు పోవడంతో పాటు ముక్కలు శుభ్రంగా మారుతాయి.
2. ముందుగా వడకట్టి పెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా కారం, చిటికెడు ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న కాలి ఫ్లవర్ ముక్కలను అందులో వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించాలి. ముక్కలు కాస్త మెత్తబడి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు.. ఫ్రై చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి.
Also Read: ఇంట్లోనే కరకరలాడే క్రిస్పీ పొటాటో బైట్స్..ఈజీగా ఇలా చేయండి!
3. ఇదే గిన్నెలో మరో స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
4.ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా.. వేయించి పెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కలను ఈ మసాలా మిశ్రమంలో వేయాలి. మసాలా అంతా ముక్కలకు బాగా .. పట్టేలా నిదానంగా కలుపుతూ, మరో 3 నుంచి 5 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించాలి.చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే! గుమగుమలాడే రుచికరమైన కాలిఫ్లవర్ వేపుడు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ ఫ్రై వేసుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే చపాతీ, పూరీ లేదా సాంబార్ అన్నం, రసంతో కూడా ఇది అదిరిపోయే సైడ్ డిష్గా పని చేస్తుంది.