స్ప్లిట్ ఎండ్స్ అంటే జుట్టు చివర్లు చిట్లిపోవడం చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. దీని వల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే జుట్టు సులభంగా విరిగిపోవడం వల్ల పెరుగుదల కూడా తగ్గుతుంది. చాలామంది ఈ సమస్యకు ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ లేదా పార్లర్ ట్రీట్‌మెంట్స్‌ను ఎంచుకుంటారు. అయితే వాటి ఫలితం కొంతకాలం మాత్రమే ఉంటుంది. సరైన జుట్టు సంరక్షణ లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీ వంటగదిలో ఉండే కొన్ని సహజ పదార్థాలతో కూడా జుట్టుకు మంచి పోషణ అందించవచ్చు. ఇవి జుట్టుకు తేమను అందించి, పొడిబారడాన్ని తగ్గించి, మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.
బొప్పాయిలో జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగు జుట్టుకు తేమను అందిస్తుంది. బాగా పండిన బొప్పాయిని మెత్తగా చేసి రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగుతో కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొదలుకొని చివర్ల వరకు రాసి అరగంట తర్వాత కడగండి. వారానికి ఒకసారి వాడితే జుట్టు పొడిబారడం తగ్గుతుంది.
గుడ్డులో ఉండే ప్రోటీన్ జుట్టును బలంగా ఉంచుతుంది. ఒక గుడ్డు పచ్చసొనలో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖ్యంగా జుట్టు చివర్లపై రాసి 40 నుంచి 45 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడగండి. ఇది జుట్టు విరిగిపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనె, బాదం నూనె, ఆముదం నూనె సమానంగా తీసుకుని కొద్దిగా గోరువెచ్చగా చేయండి. ఈ నూనెతో తలకు, జుట్టు చివర్లకు మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్‌ను పిండి జుట్టుకు చుట్టండి. ఈ పద్ధతి వల్ల జుట్టులో నూనె బాగా శోషించబడుతుంది. వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
అరటిపండులో పొటాషియం, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఒక పండిన అరటిపండును మెత్తగా చేసి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు లేదా రోజ్ వాటర్ కలపండి. ఈ ప్యాక్‌ను జుట్టుకు రాసి గంట తర్వాత కడగండి. ఇది సహజ కండీషనర్‌లా పనిచేసి జుట్టును మృదువుగా మారుస్తుంది.
పాలు, తాజా మీగడ జుట్టుకు లోతైన తేమను అందిస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల మీగడలో కొద్దిగా పచ్చిపాలు కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్లపై రాసి 20 నిమిషాల తర్వాత కడగండి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గి ఆరోగ్యంగా కనిపిస్తుంది.
Also Read: పురుషుల కంటే మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువ? దీనికి కారణాలు ఇవే
స్ప్లిట్ ఎండ్స్‌ను తగ్గించడానికి జుట్టును క్రమం తప్పకుండా ట్రిమ్ చేయండి. అధిక హీట్ స్టైలింగ్‌ను తగ్గించండి. మీ జుట్టుకు సరిపోయే మైల్డ్ షాంపూ, కండీషనర్ ఉపయోగించండి. అలాగే ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారం తీసుకుంటే జుట్టు లోపల నుంచి బలంగా పెరుగుతుంది.
ఈ సహజ చిట్కాలు ఇప్పటికే ఏర్పడిన స్ప్లిట్ ఎండ్స్‌ను పూర్తిగా తొలగించలేవు. అయితే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, కొత్తగా స్ప్లిట్ ఎండ్స్ ఏర్పడకుండా సహాయపడతాయి.