Social Media impact on relationships| ఈ రోజుల్లో అందరూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్స్ అన్ని మన జీవితంలో భాగమైపోయాయి. ఇవి లేకుండా జీవితం ఊహించడమే కష్టంగా ఉంటుంది. ఉదయం లేవగానే ఫోన్‌లో సోషల్ మీడియా స్క్రాల్ చేయడం ప్రారంభిస్తే రోజంతా వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉండడం ఒక సాధారణ విషయమైపోయింది. అయితే ఇదంతా వ్యసనంగా మారి మానవ సంబంధాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా దంపతులు, సహజీవనం చేసే వారి బంధాలు క్రమంగా విచ్చిన్నం అవుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం, ఐకమత్యం లోపిస్తోంది.
సోషల్ మీడియాకే రోజంతా బిజీగా ఉంటే.. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులకు ముఖ్యంగా జీవిత భాగస్వామితో గడిపేందుకు సమయం ఎక్కడుంటుంది. బంధాన్ని బలపరిచే చిన్ని చిన్న సంతోషాల కోసం తగిన సమయం కేటాయించకపోతే ఆ బంధం బలహీనమవుతుంది. మీ లైఫ్ పార్ట్‌నర్‌తో కూర్చొని వారితో మాట్లాడడం, వారి అవసరాలు తెలుసుకోవడం, వారితో క్వాలిటీ సమయం గడపడం చాలా అవసరం. కానీ ఇదంతా నేటి తరం దంపతులు చేయడం లేదు. సోషల్ మీడియాలో బిజీగా ఉండడంతో మీ పార్ట్‌నర్ తో గడాపాల్సిన సమయం తగ్గిపోతోంది. ఈ కారణంగా వారితో భావోద్వేగ సంబంధం తగ్గిపోతోంది.
సోషల్ మీడియాపై మీకు పరిచయమయ్యే వ్యక్తులను మీరు త్వరగా నమ్మకూడదు. అక్కడ ఉన్నవారంతా తమ జీవితం చాలా సుఖంగా ఉందని చూపించుకునే ప్రయత్నంలో ఉంటారు. మరి అలాంటి వ్యక్తుల జీవితాన్ని చూసి మీరు మీ జీవితాన్ని పోల్చుకోవడం ప్రారంభిస్తారు. ఇలాంటి ఆలోచనలు మీకు వస్తే మీకు మీ జీవితం పట్ల అసంతృప్తి పెరిగిపోతుంది. దీంతో మీ దాంపత్య జీవితం కచ్చితంగా ప్రభావితమవుతుంది.
సోషల్ మీడియాలో మీరు చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా మీ భాగస్వామి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు ఒకరు చేసిన పోస్ట్ ని లైక్ చేసినా, ఎవరితో నైనా ఎక్కువగా చాటింగ్ చేస్తున్నా, మీ భార్య, లేదా భర్త దాని గురించి అనుమానం చెంది మీతో ముభావంగా ఉండొచ్చు. ఆ తరువాత ఈ చిన్న చిన్న విషయాల కారణంగా మీకు దూరం కావొచ్చు. క్రమంగా ఈ గొడవలు పెరిగి మీ ఇద్దరి సంబంధాన్ని తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది.
ఈ రోజుల్లో చాలామంది తమ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదంతా మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. కారణం ఇలా చేస్తే తమ వ్యక్తిగత జీవితాన్ని లోకానికి తెలియజేయడం అందరికీ నచ్చకపోవచ్చు. ఆ తరువాత అభిప్రాయభేదాల కారణంగా గొడవపడి క్రమంగా ఇద్దరి మధ్య దూరాలు పెరిగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే ప్రతి సంబంధం లోనూ ప్రైవెసీ, కమ్యూనికేషన్ మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది.
మీరు సోషల్ మీడియాలో స్క్రాలింగ్ చేస్తూ సమయం ఎక్కువగా గడిపేస్తే మరి మీ జీవిత భాగస్వామితో గడిపేందుకు సమయం ఎక్కడుంటుంది. దీంతో ఇద్దరి మధ్య అపార్థాలు, అనుమానాలు పెరిగిపోతాయి. అందుకే సమస్య తీవ్రం కాకముందే సోషల్ మీడియా వ్యసనాన్ని గుర్తించి మీ తప్పులను సరిదిద్దాలి.. లేకపోతే చూస్తుండగానే విషయం విడాకులు వరకు వెళ్లి.. పెళ్లి పెటాకులవుతుంది.
Also Read: ఈ నియమం పాటిస్తే భార్యాభర్తల మధ్య అసలు గొడవలుండవు.. ఇద్దరి మధ్య రొమాన్స్ గ్యారంటీ
సోషల్ మీడియా జంటలను కనెక్ట్ అయి ఉండటానికి కూడా సహాయపడుతుంది. బిజీ షెడ్యూల్‌లో కూడా సులభంగా ఒకరితో మరొకరు మాట్లాడుకోవచ్చు. మీ ఫోటోలు, వీడియోలు మెమోరీస్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. దీంతో దూరంగా ఉన్న మీ భాగస్వామితో కనెక్ట్ కావొచ్చు.
సోషల్ మీడియాని పరిమితంగా ఉపయోగిస్తే అది హాని చేయదు. పైగా దాని లాభాలను ఎంజాయ్ చేయవచ్చు.