Hair Transplant Side Effects: జుట్టు రాలే సమస్య ఉన్నవారు, బట్టతల ఉన్నవారు.. ఇటీవలి కాలంలో చాలామంది తలపై సహజంగా జుట్టు వచ్చేందుకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఈ ఆపరేషన్ తరువాత తలపై జుట్టు శాశ్వతంగా ఉంటుంది. అయితే ఇది ఒక చిన్న సర్జరీ కాబట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
చర్మ వైద్య నిపుణలు, డెర్మటాలజిస్ట్ డాక్టర్ గౌరాంగ్ కృష్ణ ఈ చికిత్సలోని రిస్కులు, రికవరీ, జాగ్రత్తల గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చారు. ఆపరేషన్ చేసుకునే ముందు సరైన క్లినిక్ ఎంపిక చేసుకోవడం, సరైన పరిశోధన చేయాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది సాధారణ కాస్మొటిక్ చికిత్స కాదు. ఇది చిన్న సర్జికల్ విధానం. జుట్టు వేర్లతో సహా తలపై ఒక ప్రాంతం నుంచి తీసి, బట్టతల లేదా తక్కువ జుట్టు ఉన్న ప్రాంతంలో అమర్చుతారు. అనుభవం ఉన్న డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే ఈ సర్జరీ చేయాలి. అర్హత లేని వ్యక్తులు చేస్తే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సర్జరీ తర్వాత చాలా మందికి నుదురు, స్కాల్ప్, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. ఈ వాపు కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. సరైన విశ్రాంతి, మందులు తీసుకుంటే వాపు త్వరగా తగ్గుతుంది. వాపును నిర్లక్ష్యం చేస్తే రికవరీలో సమస్యలు పెరుగుతాయి.
సర్జరీ సమయంలో పరిశుభ్రత లేకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. వాపు, నొప్పి, చీము ఏర్పడవచ్చు. డాక్టర్ చెప్పినట్లు పరిశుభ్రత పాటించడం, యాంటీబయాటిక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. చికిత్స చేయకపోతే అమర్చిన జుట్టు కుదుళ్లు దెబ్బతినవచ్చు.
సర్జరీ తర్వాత కొందరికి షాక్ హెయిర్ లాస్ సమస్య వస్తుంది. అంటే తాత్కాలిక జుట్టు ఊడటం జరుగుతుంది. ఇది సర్జరీ ఒత్తిడి వల్ల వస్తుంది. కొన్ని నెలల్లో కొత్త జుట్టు మొలకెత్తుతుంది. ఈ సమయంలో చాలా ఓపికగా ఉండాలి.
సర్జరీ తర్వాత తేలికపాటి నొప్పి, దురద సాధారణం. గోకడం వల్ల అమర్చిన జుట్టు కుదుళ్లు దెబ్బతినవచ్చు. డాక్టర్ సూచించిన మందులు, స్కాల్ప్ కేర్ ఉపయోగించాలి. అనవసరంగా స్కాల్ప్‌ను తాకకూడదు.
డాక్టర్ గౌరాంగ్ కృష్ణ అనుభవం లేని వ్యక్తులు చేసే సర్జరీలపై హెచ్చరించారు. అనుభవం ఉన్న సర్జన్‌లు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అర్హత లేని టెక్నీషియన్లు చేస్తే.. సమస్యలు తీవ్రం కావొచ్చ. ముందుగా డాక్టర్ అర్హతలను ధృవీకరించుకోవాలి.
Also Read: రాత్రి పడుకునే ముందు ఈ పనులు అసలు చేయొద్దు.. ఇంట్లో దరిద్రం, కష్టాలు వీటి వల్లే
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ రికవరీకి సమయం పడుతుంది. భారీ వ్యాయామాలు, ధూళి, ఎండ నుంచి స్కాల్ప్‌ను రక్షించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, నీళ్లు తాగడం రికవరీని వేగవంతం చేస్తాయి. సర్జరీ తరువాత ఫాలో అప్‌లు చేయించుకోవాలి.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తరువాత చాలామందిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయినా వాపు, ఇన్ఫెక్షన్, నొప్పి, తాత్కాలిక జుట్టు ఊడటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అనుభవం ఉన్న డాక్టర్ చేత మాత్రమే చికిత్స చేయించుకోవాలి. సర్జరీ తరువాత కూడా సరైన ప్లానింగ్, ఆఫ్టర్ కేర్ తీసుకుంటే ఇన్‌ఫెక్షన్ సమస్యను నివారించవచ్చ.