అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేం. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లలో నివసించే వారికి ఇది పెద్ద ప్రమాదంగా మారవచ్చు. అలాంటి ఇళ్లలో వెంటిలేషన్ తక్కువగా ఉండటంతో పొగ వేగంగా వ్యాపిస్తుంది. విద్యుత్ లోపాలు (షార్ట్ సర్కూట్స్) , గ్యాస్ లీకేజీలు వంటి కారణాలతో అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ముఖ్యమైన భద్రతా పరికరాలను ఇంట్లో ఉంచితే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
అగ్ని ప్రమాదాల్లో మంటల కంటే పొగ ఎక్కువ ప్రమాదకరం. నిద్రలో ఉన్నప్పుడు పొగను గుర్తించడం చాలా కష్టం. స్మోక్ అలారం పొగను వెంటనే గుర్తించి పెద్ద శబ్దంతో హెచ్చరిస్తుంది. దీంతో ఇంట్లో ఉన్నవారికి బయటకు వెళ్లేందుకు సమయం లభిస్తుంది.
పడకగదులు, హాల్ వే వంటి ప్రదేశాల్లో స్మోక్ అలారంను అమర్చాలి. ఇది సరిగా పనిచేస్తుందో లేదో తరచుగా పరీక్షించాలి. అవసరమైతే బ్యాటరీలను మార్చాలి. సరిగ్గా పనిచేసే స్మోక్ అలారం ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించగలదు.
ప్రతి ఇంట్లో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉండటం చాలా అవసరం. చిన్న మంటలు కూడా కొన్ని నిమిషాల్లో పెద్ద ప్రమాదంగా మారవచ్చు. ఇంట్లో ఫైర్ సేఫ్టీ కోసం ఎబిసి రేటింగ్ కలిగిన మల్టీ పర్పస్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను ఎంచుకోవాలి. ఇది ఘన, ద్రవ, విద్యుత్ మంటలను ఆర్పగలదు. దీన్ని వంటగది లేదా ప్రధాన ద్వారం దగ్గర ఉంచాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ దాని ఉపయోగం తెలిసి ఉండాలి. పాస్ (PASS) విధానాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగా పిన్ తీసి, మంటల అడుగు భాగాన్ని లక్ష్యంగా పెట్టాలి. తరువాత హ్యాండిల్ నొక్కి పక్కల వైపు స్ప్రే చేయాలి.
వంట చేసే సమయంలో నూనె లేదా నెయ్యి వల్ల మంటలు అంటుకోవడం సాధారణం. అలాంటి సమయంలో నీళ్లు పోస్తే మంటలు మరింత పెరుగుతాయి. ఫైర్ బ్లాంకెట్ మంటలకు అవసరమైన ఆక్సిజన్‌ను అడ్డుకుంటుంది. దీంతో మంటలు త్వరగా ఆరిపోతాయి. దీన్ని వంటగది దగ్గర అందుబాటులో ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. అవసరమైతే మంటల వల్ల కాలిన గాయాల నుంచి రక్షించేందుకు వ్యక్తిపై కూడా కప్పవచ్చు.
అగ్ని ప్రమాదాల సమయంలో కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులు విడుదల అవుతాయి. ఈ వాయువుకు వాసన లేదా రంగు ఉండదు. ఈ వాయువు ఎక్కువగా శరీరంలోకి వెళ్తే తల తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్ గాలిలో ఈ వాయువు స్థాయి పెరిగితే వెంటనే అలారం మోగిస్తుంది. గాలి రాకుండా వెంటిలేషన్ లేని ఫ్లాట్లలో నివసించే వారికి ఈ డిటెక్టర్ అదనపు భద్రతనిస్తుంది.
మల్టీ సోరె బిల్డింగ్ (బహుళ అంతస్తుల భవనాల్లో)లో నివసించే వారికి ఎస్కేప్ ల్యాడర్ చాలా ఉపయోగపడుతుంది. అగ్ని ప్రమాద సమయంలో ప్రధాన ద్వారం మూసుకుపోతే కిటికీ లేదా బాల్కనీ ద్వారా బయటకు రావచ్చు. ఈ పోర్టబుల్ ల్యాడర్‌ను సులభంగా అమర్చవచ్చు. అత్యవసర సమయంలో ఇది ప్రాణాలను కాపాడగలదు. కుటుంబ సభ్యులందరికీ దీని వినియోగం గురించి ముందుగానే తెలియజేయాలి.
అగ్ని ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు. అందుకే సరైన భద్రతా పరికరాలు ఉంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. స్మోక్ అలారం, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఫైర్ బ్లాంకెట్, కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్, ఎస్కేప్ ల్యాడర్ వంటి పరికరాలు ఇంటికి అదనపు భద్రతను అందిస్తాయి.
ఈ రోజు తీసుకున్న చిన్న జాగ్రత్త రేపు మీ కుటుంబ ప్రాణాలను కాపాడవచ్చు.