Tips For Dehydration: శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు , లవణాలను కోల్పోయినప్పుడు ‘డీహైడ్రేషన్’ ఏర్పడుతుంది. వేసవి ఎండలు, అధిక శ్రమ, వాంతులు లేదా విరేచనాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. డీహైడ్రేషన్ వల్ల నీరసం, తలతిరగడంతో పాటు ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అయితే.. ప్రాథమిక దశలో ఉన్న డీహైడ్రేషన్ సమస్యను కొన్ని సులభమైన హోం రెమెడీస్‌తో , సరైన చిట్కాలతో వేగంగా నయం చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్ నుంచి త్వరగా కోలుకోవడానికి ఇంటి చిట్కాలు:
మన శరీరంలో దాదాపు 60-70% వరకు నీరే ఉంటుంది. కణాలు సరిగ్గా పనిచేయాలన్నా, రక్తం ప్రసరించాలన్నా నీరు అత్యవసరం. డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు కేవలం నీరు తాగడమే కాకుండా.. శరీరానికి పోగొట్టుకున్న ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం) అందించడం ముఖ్యం.
1. ఓఆర్ఎస్ (ORS ):
డిహైడ్రేషన్‌ను తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన అత్యుత్తమ మార్గం ORS.
తయారీ: ఒక లీటర్ శుభ్రమైన నీటిలో ఆరు టీస్పూన్ల చక్కెర, అర టీస్పూన్ ఉప్పు కలిపి తాగాలి.
ప్రయోజనం: ఇది శరీరంలో గ్లూకోజ్ మరియు లవణాల సమతుల్యతను తక్షణమే పునరుద్ధరిస్తుంది.
2. కొబ్బరి నీళ్లు:
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఎనర్జీ డ్రింక్ కొబ్బరి నీళ్లు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. కణాలకు అవసరమైన తేమను అందిస్తుంది. కెలోరీలు తక్కువగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
3. మజ్జిగ ,పెరుగు:
మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చిటికెడు ఉప్పు, జీలకర్ర పొడి కలిపిన చల్లని మజ్జిగ తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. విరేచనాల వల్ల డీహైడ్రేషన్ కలిగినప్పుడు పెరుగు తీసుకోవడం వల్ల కడుపులోని ఇన్ఫెక్షన్ తగ్గి, కోలుకునే వేగం పెరుగుతుంది.
4. పండ్ల జ్యూస్ ,నీటి శాతం ఉన్న ఆహారం:
డీహైడ్రేషన్ సమయంలో కేవలం ద్రవపదార్థాలే కాకుండా.. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి.
పుచ్చకాయ: ఇందులో 92% నీరు ఉంటుంది.
నారింజ/నిమ్మ: వీటిలోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.
కీరదోస: ఇది శరీరాన్ని లోపలి నుండి హైడ్రేట్ గా ఉంచుతుంది.
5. నిమ్మరసం:
గ్లాసు గోరువెచ్చని లేదా చల్లని నీటిలో సగం నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె లేదా ఉప్పు కలిపి తాగాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి, అలసటను తగ్గిస్తుంది.
6. బార్లీ నీరు:
బార్లీ గింజలను నీటిలో ఉడికించి, ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. కిడ్నీల పనితీరు మెరుగుపడి, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి.
ముఖ్యమైన జాగ్రత్తలు:
కెఫిన్ వద్దు: టీ, కాఫీ ,సోడా వంటి డ్రింక్స్ మూత్రవిసర్జనను పెంచి, శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. కాబట్టి వీటిని దూరంగా ఉంచాలి.
విశ్రాంతి: డీహైడ్రేషన్ ఉన్నప్పుడు శారీరక శ్రమ తగ్గించి, చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి.
నీటిని సిప్ చేస్తూ తాగాలి: ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగే కంటే.. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు సిప్ చేస్తూ తాగడం వల్ల శరీరం నీటిని బాగా గ్రహిస్తుంది.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
ఒకవేళ ఈ కింది లక్షణాలు కనిపిస్తే.. ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
1.24 గంటల కంటే ఎక్కువ సమయం వాంతులు/విరేచనాలు అవ్వడం.
2.తీవ్రమైన తలనొప్పి , గందరగోళం .
3. యూరిన్ ముదురు రంగులో రావడం లేదా అసలు రాకపోవడం.
4.స్పృహ కోల్పోవడం.