ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో ఇస్త్రీ పెట్టె ఒకటి. రోజూ ఉపయోగించడం వల్ల అందులోని ఐరన్ ప్లేట్‌పై నల్లటి మరకలు ఏర్పడతాయి. కాలిపోయిన బట్టల అవశేషాలు ఈ ప్లేట్‌కు అతుక్కోవడం వల్లే ఈ మరకలు వస్తాయి.
ఆ తరువాత ఆ ఐరన్ ప్లేట్ వల్ల బట్టలు సరిగా ఇస్త్రీ కావు. కొన్ని సందర్భాల్లో బట్టలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న సాధారణ వస్తువులతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఈ చిట్కాలు ఇస్త్రీ ప్లేట్‌ను మళ్లీ కొత్తలా మెరిపిస్తాయి.
ఐరన్ బాక్స్ తప్పుడు టెంపరేచర్‌లో సెట్ చేసి ఇస్త్రీ చేయడం ప్రధాన కారణం. కొన్ని బట్టలు ఎక్కువ వేడి తట్టుకోలేవు. దీనివల్ల అవి ఐరన్ ప్లేట్‌కు అంటుకుని కాలిపోతాయి. అంతేకాదు దుమ్ము, స్టార్చ్ కూడా ప్లేట్‌పై పేరుకుపోతాయి. వాటిని శుభ్రం చేయకుండా వాడితే మరకలు మరింత గట్టిపడతాయి. అందుకే ఇస్త్రీని తరచుగా శుభ్రం చేయడం చాలా అవసరం.
బేకింగ్ సోడా కాలిన మరకలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. కాస్త నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్‌ను చల్లగా ఉన్న ఇస్త్రీ ప్లేట్‌పై రాయండి. తర్వాత ఒక మృదువైన గుడ్డతో మెల్లగా రుద్దండి. నల్లటి మరకలు సులభంగా తొలగిపోతాయి. చివరగా తడి గుడ్డతో ప్లేట్‌ను శుభ్రం చేయండి.
తెల్లటి టూత్‌పేస్ట్ చిన్న చిన్న మరకలను తొలగిస్తుంది. కొద్దిగా టూత్‌పేస్ట్‌ను ప్లేట్‌పై రాసి రుద్దండి. కాటన్ గుడ్డతో నెమ్మదిగా శుభ్రం చేయండి. ఇది ప్లేట్‌ను గీసుకోకుండా శుభ్రం చేస్తుంది. తర్వాత తడి గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరనివ్వండి.
వెనిగర్ మొండి మరకలను కూడా తొలగిస్తుంది. దీని కోసం ముందుగా వెనిగర్‌ను కొద్దిగా వేడి చేయండి. ఒక గుడ్డను అందులో ముంచి ప్లేట్‌పై రుద్దండి. ఇలా చేయడం వల్ల మురికి త్వరగా వదులుతుంది. ప్లేట్ మళ్లీ మెరిసిపోతుంది.
ఉప్పు కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్. ఒక గుడ్డపై కొద్దిగా ఉప్పు చల్లండి. ఇస్త్రీని స్వల్పంగా వేడి చేసి ఉప్పు వేసి ఉన్న గుడ్డపై నెమ్మదిగా ఇస్త్రీ జరపండి. కాలిన మురికి సులభంగా తొలగిపోతుంది. ఇస్త్రీ మళ్లీ సాఫీగా పనిచేయడం ప్రారంభిస్తుంది.
Also Read: తొలి పరిచయంలోనే అందరి మనుసులను గెలవాలనుకుంటున్నారా? దీని కోసం చాణక్యుడు చెప్పిన మంత్రం ఇదే
ఇస్త్రీ శుభ్రం చేసే ముందు ప్లగ్ తీసేయాలి. చాలా వేడిగా ఉన్నప్పుడు శుభ్రం చేయకూడదు. ఐరన్ వస్తువులతో గట్టిగా రుద్దకండి. అలా చేస్తే ప్లేట్ దెబ్బతింటుంది. ఎప్పుడూ మృదువైన గుడ్డలనే ఉపయోగించండి.
కాలిపోయిన ఇస్త్రీ ప్లేట్‌ను ఇంట్లోనే సులభంగా శుభ్రం చేయవచ్చు. బేకింగ్ సోడా, వెనిగర్, టూత్‌పేస్ట్, ఉప్పుతో కాలిన ఐరన్ బాక్స్ మంచి ఫలితాలు ఇస్తాయి. తరచుగా శుభ్రం చేస్తే ఇస్త్రీ ఎక్కువకాలం పనిచేస్తుంది. అలాగే మీ బట్టలు కూడా సురక్షితంగా ఉంటాయి.