Made in India Jeep SUV: భారత మార్కెట్ పై స్టెల్లాంటిస్ గ్రూప్ మరింత ఫోకస్ పెట్టింది. అదిరిపోయే మోడల్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం టాటా మోటార్స్ తో జతకట్టింది. దిగ్గజ ఇండియన్ ఆటో కంపెనీతో కలిసి కొత్త జీప్ ఎస్‌యూవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. జీప్ మాతృ సంస్థ అయిన స్టెల్లాంటిస్, 2026 ఇన్వెస్టర్ డే సందర్భంగా ఈ కీలక ప్రాజెక్ట్ ను ప్రకటించింది. కొత్త ఎస్‌యూవీని టాటా మోటార్స్ ప్లాట్ ఫారమ్ పై అభివృద్ధి చేసి, 2028లో మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ కారును కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
టాటా మోటార్స్ తో తమ భాగస్వామ్యం రెండు దశాబ్దాలుగా కొనసాగుతోందని స్టెల్లాంటిస్ ఇండియా & ఆసియా పసిఫిక్ హెడ్ గ్రెగోయిర్ ఒలివియర్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచ స్థాయి జీప్ వాహనాన్ని భారతదేశంలోనే తయారు చేయడం సాధ్యమవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఇంజనీరింగ్, స్థానిక సరఫరా వ్యవస్థలు, తయారీ సామర్థ్యాలు భారత్ లో అందుబాటులో ఉండటం స్టెల్లాంటిస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే, కంపెనీ ఇంకా ఏ ప్లాట్ ఫారమ్ ను ఉపయోగించబోతుందో అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఆటో రంగంలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, టాటా సియెర్రా కోసం అభివృద్ధి చేస్తున్న ఆర్గోస్ ప్లాట్ ఫారమ్ ను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లాట్ ఫారమ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ లకు కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రిఫికేషన్ కు అనుగుణంగా జీప్ కొత్త మోడల్ ను తయారు చేయడం ఈజీ అవుతుంది.
స్టెల్లాంటిస్ ఇప్పటికే భారత్ లో జీప్, సిట్రోయెన్ బ్రాండ్లతో కలిసి పని చేస్తోంది. అయితే, ఈ రెండు బ్రాండ్లు భారత మార్కెట్లో పెద్ద స్థాయిలో అమ్మకాలు సాధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ధరల విషయంలో భారత వినియోగదారులు అనుకూలంగా లేరు. అందుకే, స్థానిక భాగస్వామ్యంతో తక్కువ ఖర్చులో వాహనాలను తయారు చేసి, పోటీ ధరల్లో మార్కెట్లోకి తీసుకురావాలని స్టెల్లాంటిస్ భావిస్తోంది.
టాటా మోటార్స్ తో స్టెల్లాంటిస్ కు ఇప్పటికే రంజన్ గావ్ ప్లాంట్ తో మంచి సంబంధం ఉంది. అక్కడ ఫియట్ ఇంజిన్ల తయారీ కూడా జరుగుతోంది. ఇప్పుడు అదే భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి, కొత్త తరం ఎస్‌యూవీల తయారీలో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్ ను ప్రపంచ స్థాయి తయారీ, ఎగుమతి కేంద్రంగా మార్చాలని స్టెల్లాంటిస్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం జీప్ భారత మార్కెట్లో కంపాస్, మెరిడియన్, వ్రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ లాంటి మోడళ్లను విక్రయిస్తోంది. త్వరలో రానున్న ఈ కొత్త ఎస్‌యూవీ ద్వారా కంపెనీ మరింత విస్తృత కస్టమర్ బేస్‌ను ఆకర్షించాలని చూస్తోంది.
Read Also: వావ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ఇంత లాభమా? నిజంగా వండర్!