Micro Oven Uses: ఇప్పుడంతా చాలామంది ఇళ్లలో మైక్రోవేవ్ ఓవెన్ అనేది అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చినప్పుడు లేదా ఉదయాన్నే పిల్లల బాక్సులు సర్దేటప్పుడు ఆహారాన్ని నిమిషాల్లో వేడి చేసే ఈ ఓవెన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, తొందరగా అయిపోతుంది కదా.. అని ఏది పడితే అది మైక్రోవేవ్‌లో పెట్టడం మంచిది కాదంటున్నారు నిపుణులు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లతో ఓవెన్ పాడవ్వడమే కాకుండా.. ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ జరిగి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి.. ఇంట్లో మొదటిసారి మైక్రోవేవ్ ఓవెన్ వాడేవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోవేవ్ ఓవెన్‌ను ఉపయోగించాలి అనుకున్నప్పుడు.. దాని ప్లగ్‌ను సరైన స్విచ్ బోర్డుకు కనెక్ట్ చేయాలి. ప్లగ్ పెట్టే సమయంలో పవర్ ఆఫ్ చేయడం మర్చిపోకూడదు. అలాగే వైర్లు ఎక్కడా నలిగిపోకుండా, వేడి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి.
మనం ఓవెన్‌లో పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒకే రకమైన వేడి అవసరం ఉండదు. మైక్రోవేవ్‌లో హై మీడియం, లో మీడియం అనే పవర్ సెట్టింగ్స్ ఉంటాయి. మీరు వండే ఐటెమ్‌ను బట్టి తక్కువ వేడి కావాలా లేదా ఎక్కువ కావాలా అనేది సెట్ చేసుకోవాలి. తద్వారా ఆహారం మాడిపోకుండా ఉండటమే కాకుండా.. కరెంట్ కూడా ఆదా అవుతుంది.
Also Read: మీరు తినే బెల్లంలో సోడా కలిపారో లేదో.. ఇంట్లోనే ఇలా కనిపెట్టేయండి!
ఆహారాన్ని కేవలం వేడి చేస్తున్నారా.. గ్రిల్ చేస్తున్నారా లేదా బేకింగ్ చేస్తున్నారా అనే దానిపై మోడ్ ఆధారపడి ఉంటుంది. గ్రిల్ లేదా కన్వెక్షన్ వంటి రకాలు అందులో ఉంటాయి. సరైన మోడ్ ఎంచుకుంటేనే మీ ఆహారం లోపలి వరకు సమానంగా ఉడుకుతుంది.
ఓవెన్‌లో వంట చేసేటప్పుడు కేవలం మైక్రోవేవ్ సేఫ్ అని ఉన్న పాత్రలనే వాడాలి. సాధారణ ప్లాస్టిక్ డబ్బాలు వాడితే అవి కరిగిపోయి ఆహారంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా స్టీల్ లేదా మెటల్ వస్తువులను అస్సలు వాడకూడదు. దీనివల్ల నిప్పు రవ్వలు వచ్చే అవకాశం ఉంటుంది.
పై ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక.. చివరగా టైం సెట్ చేసుకోవాలి. సెకన్లు లేదా నిమిషాల లెక్కన టైమర్ పెట్టి స్టార్ట్ బటన్ నొక్కాలి. ఒకవేళ పొరపాటున ఎక్కువ సమయం సెట్ చేస్తే, వెంటనే క్యాన్సిల్ బటన్ నొక్కి ఆపేయవచ్చు.
ఓవెన్‌ను ఎప్పుడూ ఖాళీగా ఆన్ చేయకూడదు. లోపల ఆహారం లేనప్పుడు రన్ చేస్తే మెషీన్ పాడవుతుంది. అలాగే ఓవెన్‌ను ఎప్పుడూ లోపల, బయట పొడి వస్త్రంతో తుడుస్తుండాలి. ఓవెన్ డోర్స్ సరిగ్గా లాక్ అయిందో లేదో చూసుకున్నాకే స్విచ్ ఆన్ చేయాలి చేయాలి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మైక్రోవేవ్ ఓవెన్‌ను ఈజీగా వాడుకోవచ్చు.
Also Read: 10 నిమిషాల్లో హెల్దీ కొబ్బరి లడ్డూలు.. బరువు తగ్గాలనుకుంటున్న వారికి బెస్ట్ డెజర్ట్!